ఆ సోదరులకో ‘సురక్షా సూత్ర’!

రాఖీ పండగ రోజున మన అన్నాతమ్ముళ్లకు రాఖీ కడతాం. వారిచ్చే అమూల్యమైన బహుమతుల్ని అందుకొని మురిసిపోతుంటాం. మరి, మనం ఇలా ఎంతో సంతోషంగా ఉన్న ఈ తరుణంలో కూడా బోర్డర్‌లో టెన్షన్‌ వాతావరణమే ఉంటుంది. అందుకే దేశ రక్షణ కోసం పోరాడే సైనికుల కోసం ఈసారి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు సూరత్‌కు చెందిన సోషల్‌ యాక్టివిస్ట్‌ రీతూ రతి. బోర్డర్‌లో ఉన్న సైనిక సోదరుల ముఖాల్లో పండగ సంతోషాన్ని నింపాలనుకున్నారామె. ఈ క్రమంలోనే వారికోసం ప్రత్యేకంగా రాఖీలు తయారు చేయించారు.

Published : 22 Aug 2021 09:11 IST

(Photo: Instagram)

రాఖీ పండగ రోజున మన అన్నాతమ్ముళ్లకు రాఖీ కడతాం. వారిచ్చే అమూల్యమైన బహుమతుల్ని అందుకొని మురిసిపోతుంటాం. మరి, మనం ఇలా ఎంతో సంతోషంగా ఉన్న ఈ తరుణంలో కూడా బోర్డర్‌లో టెన్షన్‌ వాతావరణమే ఉంటుంది. అందుకే దేశ రక్షణ కోసం పోరాడే సైనికుల కోసం ఈసారి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు సూరత్‌కు చెందిన సోషల్‌ యాక్టివిస్ట్‌ రీతూ రతి. బోర్డర్‌లో ఉన్న సైనిక సోదరుల ముఖాల్లో పండగ సంతోషాన్ని నింపాలనుకున్నారామె. ఈ క్రమంలోనే వారికోసం ప్రత్యేకంగా రాఖీలు తయారు చేయించారు. తన స్వచ్ఛంద సంస్థ ‘ఏక్‌ సోచ్‌ ఫౌండేషన్‌’ వేదికగా ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రీతూ. ‘సమాజం మనకు ఎంతో ఇచ్చింది.. సమయమొచ్చినప్పుడు మనమూ సమాజం పట్ల మనకున్న కృతజ్ఞతను చాటుకోవాలి’ అంటోన్న ఈ సేవా మూర్తి కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

రీతూ రతి అసోంలో జన్మించారు. తండ్రి వ్యాపారవేత్త. తల్లి గువహటిలో రాజకీయ నాయకురాలిగా, కార్పొరేటర్‌గా పనిచేశారు. రాజస్థాన్‌లో పెరిగిన ఆమె.. అక్కడే డిగ్రీ పూర్తి చేశారు. దిల్లీలోని జేడీ ఇనిస్టిట్యూట్‌లో ఎక్స్‌పోర్ట్‌ టెక్నాలజీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. ఆ తర్వాత ఆషిశ్‌ రతి అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్తను పెళ్లాడిన రీతూ.. కొన్నేళ్ల పాటు భర్త అడుగుజాడల్లో నడుస్తూ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ను చేపట్టారు.

సేవతోనే మమేకమై..!

‘సమాజం మనకు చాలా ఇచ్చింది.. సమయం వచ్చినప్పుడు మనమూ మన వంతుగా సమాజానికి సేవ చేయాల’న్న సిద్ధాంతాన్ని బలంగా నమ్మే రీతూ.. ఈ విషయంలో తనకు తన తల్లిదండ్రులే స్ఫూర్తి అంటున్నారు. ఈ ప్రేరణతోనే గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో సూరత్‌ వేదికగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారామె. ఈ క్రమంలో శానిటైజింగ్‌ మెషీన్స్‌, పిల్లలకు మాస్కులు, ఆకలితో అలమటించే వారికి భోజనం తయారుచేయించి అందించడం, అవసరార్థులకు నిత్యావసర సరుకుల్ని పంపించడం.. వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మురికి వాడల్లోని పిల్లలకు పోషకాహారం, పుస్తకాలు.. అమ్మాయిలకు శ్యానిటరీ న్యాప్‌కిన్లు అందించారు. ఇల్లాలికి ఆర్థిక స్థిరత్వం ఉండాలన్న ముఖ్యోద్దేశంతో అక్కడి మహిళలు తయారుచేసే వివిధ రకాల వస్తువుల్ని మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించుకునేలా వారిని ప్రోత్సహించేవారు రీతూ. చిన్న వయసు నుంచే పిల్లల్లో సామాజిక సేవా బీజాలు నాటాలని చెప్పే రీతూ.. ఇలా తాను చేపట్టే సేవా కార్యక్రమాల్లో తన పదేళ్ల కూతురినీ భాగం చేస్తుంటారు.

వారి కోసం ‘ఏక్‌ సోచ్’!

ఇక తన సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో ‘ఏక్‌ సోచ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించారు రీతూ. యువతను, అణగారిన వర్గాల వారిని ప్రోత్సహించడం, వారి అభివృద్ధికి పాటుపడడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశంగా పెట్టుకున్నారామె. ఈ క్రమంలో తన ఏక్‌ సోచ్‌ టీమ్‌తో కలిసి పలు సంస్థలు, ఆశ్రమాలకు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు రీతూ.. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారామె. ‘హ్యూమన్‌ రైట్స్‌’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి అవసరార్థులకు దుస్తులు, చెప్పులు.. వంటి నిత్యావసరాల్ని పంపిణీ చేశారు. ఇక సూరత్‌లోని ఓ అనాథ శరణాలయంలోని అంధ చిన్నారుల సంక్షేమాన్ని చూసుకోవడానికి ముందుకొచ్చారు రీతూ. ఇందులో భాగంగా వారికి భోజనం, నాణ్యమైన విద్యను అందించడమే కాదు.. వారికి నచ్చిన రంగాల్లో ప్రోత్సహించే బాధ్యతనూ తన భుజాలపై వేసుకున్నారామె. అంతేకాదు.. ‘జాతీయ బాలికా దినోత్సవం’, ‘స్నేహితుల దినోత్సవం’.. వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయా అంశాలపై చిన్నారులు, యువతలో చైతన్యం నింపేందుకు పలు కార్యక్రమాల్ని సైతం ఏర్పాటుచేశారు.

ఆ సోదరులకో ‘సురక్షా సూత్ర’!

ఇలా ప్రతి క్షణం సమాజ సేవలో తరించే రీతూ.. ఈ రాఖీ పండగ సందర్భంగా మరో సేవా కార్యక్రమంతో ముందుకొచ్చారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్ని సైతం త్యాగం చేసి అనుక్షణం బోర్డర్‌లో దేశ రక్షణలో గడిపే సైనిక సోదరుల కోసం ప్రత్యేక రాఖీలు తయారుచేయిస్తున్నారామె. అది కూడా తన స్వచ్ఛంద సంస్థ వేదికగానే! ఈ క్రమంలో వితంతువులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇదంతా సైనిక సోదరుల ముఖాల్లో పండగ సంతోషాన్ని నింపడానికే అంటున్నారు రీతూ.
‘సైనిక సోదరుల రక్షణ కోరుతూ, వారిలో పండగ సంతోషాన్ని నింపడానికే ఈసారి రక్షాబంధన్‌ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంచుకున్నా. మొత్తంగా సుమారు ఏడు వేల పర్యావరణహిత రాఖీలు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. కేవలం తయారుచేయడమే కాదు.. మా మహిళా బృందం నుంచి ఓ నలుగురు సోదరీమణులు బోర్డర్‌కి వెళ్లి వారి స్వహస్తాలతో సైనిక సోదరుల చేతికి ఈ రాఖీలు కడుతున్నారు..’ అంటూ తన ప్రాజెక్ట్‌ గురించి పంచుకున్నారు రీతూ.

ఇలా సమాజానికి తాను చేసిన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులు అందుకున్నారు రీతూ. ఈ క్రమంలో ‘ఇంటర్నేషనల్‌ గ్లోరీ అవార్డ్‌’, ‘డివైన్‌ మిసెస్‌ ఇండియా’, ‘సోషల్‌ యాక్టివిస్ట్‌ ఆఫ్‌ గుజరాత్‌’, ‘విమెన్‌ లీడర్‌షిప్‌ అవార్డ్‌’.. వంటివి అందులో కొన్ని!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్