స్కర్ట్ వేసుకోవడానికి వీల్లేదన్నారు..!

ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుడితే ‘మళ్లీ కూతురేనా’ అని ఎగతాళి చేశారు. హాకీ స్టిక్‌ను పట్టుకుంటే ‘నీకెందుకే తల్లీ ఈ ఆటలు’ అని హేళన చేశారు. ఆడపిల్లలు పొట్టి దుస్తులు వేసుకోవడం మాకిష్టం లేదని మత పెద్దలు తిట్టిపోశారు. ఇప్పుడదే ఆడపిల్ల గోల్‌ కొడుతుంటే హేళన చేసిన నోళ్లే సంతోషంతో హర్షిస్తున్నాయి. తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు తమ అమ్మాయేనంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు.

Updated : 13 May 2022 14:57 IST

(Photo: Hockey India)

ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుడితే ‘మళ్లీ కూతురేనా’ అని ఎగతాళి చేశారు. హాకీ స్టిక్‌ను పట్టుకుంటే ‘నీకెందుకే తల్లీ ఈ ఆటలు’ అని హేళన చేశారు. ఆడపిల్లలు పొట్టి దుస్తులు వేసుకోవడం మాకిష్టం లేదని మత పెద్దలు తిట్టిపోశారు. ఇప్పుడదే ఆడపిల్ల గోల్‌ కొడుతుంటే హేళన చేసిన నోళ్లే సంతోషంతో హర్షిస్తున్నాయి. తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు తమ అమ్మాయేనంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. టోక్యోలో సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు మిడ్‌ఫీల్డర్‌ నిశా వార్సి గురించే ఇదంతా..

కెరీర్‌ ప్రారంభంలోనే ఒలింపిక్స్‌ అవకాశం!

హరియాణాలోని సోనిపట్‌కు చెందిన నిశా 2019లో జాతీయ జట్టులోకి అడుగుపెట్టింది. అయితే అప్పుడే కరోనా రంగ ప్రవేశం చేయడంతో పెద్దగా టోర్నమెంట్లు జరగలేదు. దీంతో ఆమెకు తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాలేదు. అయితే ఈ ఏడాది ఆరంభంలో అర్జెంటీనా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం దక్కించుకుంది. మెరుగైన ఆటతీరును ప్రదర్శించి టోక్యో బెర్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో కెరీర్‌ ప్రారంభంలోనే ఒలింపిక్స్‌ లాంటి ప్రపంచ క్రీడల్లో పాల్గొనే సువర్ణావకాశం దక్కించుకుందీ యంగ్‌ ప్లేయర్.

మళ్లీ కూతురేనా?

26 ఏళ్ల నిశాకు హాకీ అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. అయితే తనకు హాకీ స్టిక్‌ కొనిచ్చేటంత స్థోమత కూడా ఆమె కుటుంబానికి ఉండేది కాదు. తండ్రి సొహ్రాబ్ అహ్మద్ ఓ టైలర్‌. తల్లి మెహరూన్. వీరి మూడో సంతానమే నిశా. ఇద్దరు ఆడపిల్లల తర్వాత తను జన్మించినప్పుడు ‘మళ్లీ కూతురేనా? అంటూ బంధువులు హేళనగా మాట్లాడారట. ఇరుగుపొరుగువారు సొహ్రాబ్ కుటుంబాన్ని చూసి ‘ముగ్గురూ కూతుళ్లేనా’ అని జాలిపడ్డారట. అయితే సొహ్రాబ్‌ దంపతులు మాత్రం తమ ముగ్గురు కూతుళ్లను ఎంతో ప్రేమగా పెంచారు.

లెగ్గింగ్స్‌ వేసుకుని ఆడుతూ!

ఈ క్రమంలో హాకీ ఆడతానన్న నిశాను తండ్రి వ్యతిరేకించినా తల్లి మెహరూన్‌ కూతురును వెన్నుతట్టి ప్రోత్సహించింది. అయితే ఆడపిల్లలు స్కర్ట్‌ వేసుకోవడం ముస్లిం సంప్రదాయంలో లేదని మత పెద్దలు వారిని వ్యతిరేకించారు. అయితే తానెప్పుడూ సంప్రదాయాలకు వ్యతిరేకం కానంటూ లెగ్గింగ్స్ వేసుకుని ఆడేందుకు కోచ్‌ను ఒప్పించింది నిశా. టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఆమె లెగ్గింగ్స్‌ ధరించి ఆడడం విశేషం.

చలికాలంలో చాలా కష్టంగా అనిపించేది!

భారత మహిళల హాకీ జట్టుకు కామన్వెల్త్‌ పతకాన్ని అందించిన ప్రీతమ్‌ రాణి సివాచ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది నిశా. ఆమెతో పాటు మరో హాకీ ప్లేయర్‌ నేహా గోయల్‌ కూడా ఇక్కడే తర్ఫీదు పొందింది. ఈ క్రమంలో టైలర్‌గా పనిచేస్తున్న నిశా తండ్రి 2015లో పక్షవాతానికి గురయ్యాడు. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో మెహరూన్‌ ఇంటి బాధ్యతలను భుజానకెత్తుకుంది.. తన కూతురి కలను సాకారం చేసేందుకు ఓ ఫోమ్‌ ఫ్యాక్టరీలో కార్మికురాలిగా చేరింది. రోజూ ఉదయం 4 గంటలకే నిశాను అకాడమీలో వదిలిపెట్టి ఆ తర్వాత పనికి వెళ్లేది.

‘నాన్న ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోజూ ఉదయాన్నే నన్ను సైకిల్‌ మీద అకాడమీకి తీసుకెళ్లేవాడు. అమ్మ కూడా ఉదయాన్నే లేచి మాకు వండిపెట్టేది. అయితే నాన్న మంచాన పడ్డాక అమ్మే నాకు తోడయ్యింది. ఉదయాన్నే నాకు వండిపెట్టి అకాడమీలో వదిలిపెట్టేది. ఆ తర్వాత ఫ్యాక్టరీకి వెళ్లేది. మిగతా రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ చలికాలంలో మాత్రం ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా అనిపించేది’ అని తను పడిన ఇబ్బందులను గుర్తుకు తెచ్చుకుందీ హాకీ క్వీన్.

రైల్వేలో ఉద్యోగంతో ఊరట!

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆటపై ప్రేమను వదులుకోలేకపోయింది నిశా. ఈ క్రమంలో మొదట హరియాణా రాష్ట్ర స్థాయి జట్టులో చోటు సంపాదించింది. ఆ తర్వాత రైల్వేస్ టీంలో కూడా రెగ్యులర్‌ ప్లేయర్‌గా స్థానం సంపాదించుకుంది. 2018 నిశా జీవితంలో మరచిపోలేని ఏడాదని చెప్పుకోవచ్చు. రైల్వేస్ జట్టులో రెగ్యులర్‌గా ఆడడం వల్ల ఆమెకు రైల్వేలో ఓ మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఆమె కుటుంబానికి ఇది ఎంతో ఊరట కలిగించింది. అదే ఏడాది జాతీయ జట్టు నుంచి కూడా పిలుపు వచ్చింది. అయితే ఆస్పత్రిలో ఉన్న తండ్రిని వదిలిపెట్టి వెళ్లడానికి నిశా మొదట వెనకడుగు వేసింది.

ఇంటికి దూరంగా!

‘నాన్నను దీన పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్లడానికి నా మనసు అంగీకరించలేదు. అయితే మా మేనమామ నాకు అండగా నిలిచారు. నాన్నతో పాటు కుటుంబ బాధ్యతలను ఆయన చూసుకుంటానని నాకు హామీ ఇచ్చారు. శిక్షణ శిబిరానికి వచ్చిన తర్వాత కూడా నా మనసంతా ఇంటి వైపే ఉండేది. ముఖ్యంగా నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. ఆ సమయంలో తోటి సహచరులు నాకు అండగా నిలిచారు. అమ్మానాన్నల కష్టాలను తీర్చడానికి నాక్కూడా హాకీనే మార్గమని గట్టిగా నిశ్చయించుకున్నాను. అందుకే గత ఏడాదిన్నర కాలంగా ఇంటి ముఖం కూడా చూడకుండా శిక్షణ శిబిరంలోనే ఉండిపోయాను. ఆ తర్వాత ఒలింపిక్స్‌ కోసం టోక్యో వెళ్లిపోయాను. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించాక ఇంట్లో వారందరితో మాట్లాడాను. అమ్మానాన్నలతో పాటు బంధువులు కూడా నన్ను చూసి ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ యువ క్రీడాకారిణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్