మీ మొటిమలకు ఇవీ కారణం కావచ్చు!

మోము అందంగా కనిపించడానికి, సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి మనం రకరకాల క్రీములను వాడుతుంటాం. ముఖ్యంగా మొటిమలు తగ్గడానికి వివిధ రకాల సౌందర్య సాధనాల్ని మన బ్యూటీ కిట్‌లో చేర్చుకుంటాం. అయితే ఎన్ని క్రీములు వాడినా, ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఈ సమస్యను దూరం చేసుకోలేరు.

Published : 18 Jan 2022 21:18 IST

మోము అందంగా కనిపించడానికి, సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి మనం రకరకాల క్రీములను వాడుతుంటాం. ముఖ్యంగా మొటిమలు తగ్గడానికి వివిధ రకాల సౌందర్య సాధనాల్ని మన బ్యూటీ కిట్‌లో చేర్చుకుంటాం. అయితే ఎన్ని క్రీములు వాడినా, ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఈ సమస్యను దూరం చేసుకోలేరు. అందుకు కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు మనం రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా కారణమవుతాయంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ క్రమంలో మొటిమలకు దారి తీసే ఆ పొరపాట్లేంటి..? వాటిని సరిదిద్దుకునే విధానాలేంటి..? రండి.. తెలుసుకుందాం..

అలాగే పడుకోవద్దు..

అందంగా కనిపించడానికి చాలామంది అమ్మాయిలు మేకప్‌ను ఆశ్రయించడం సర్వసాధారణమే. అయితే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలూ లేకపోలేదు. ముఖ్యంగా రాత్రుళ్లు పడుకునేటప్పుడు కొంతమంది మేకప్ రిమూవ్ చేసుకోకుండానే బెడ్ ఎక్కేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై దురద, మంట.. వంటివి వస్తాయి. అంతేకాదు.. ఇలా రాత్రంతా మేకప్ ఉంచుకోవడం వల్ల ముఖంపై ఉన్న చర్మ రంధ్రాల్లో బ్యాక్టీరియా చేరి మొటిమలు వస్తాయి. కాబట్టి ఎంత అలసిపోయినప్పటికీ రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేసి పడుకోవడం శ్రేయస్కరం. అలాగే మేకప్ వేసుకునే బ్రష్‌లను సైతం ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం మర్చిపోవద్దు.

ప్రతిదీ శుభ్రంగా..

సాధారణంగా మొబైల్, ల్యాప్‌టాప్.. వంటి గ్యాడ్జెట్స్‌ని ఉపయోగిస్తున్నప్పుడు వాటిపై పేరుకున్న దుమ్ము, ధూళిని పెద్దగా పట్టించుకోం. కానీ వాటిపై చేరే బ్యాక్టీరియా మన చేతికి అంటుకొని.. దాంతో ముఖంపై తుడుచుకున్నప్పుడు అది మన చర్మం పైకి చేరుతుంది. ఇది కూడా ముఖంపై మొటిమలు రావడానికి ఓ కారణమే. అంతేకాదు మనకు కనబడని క్రిములు కూడా వీటిలో దాగుంటాయి. ఇలాంటివన్నీ ముఖంపై ఉండే చర్మ రంధ్రాల్లోకి చేరుకొని మొటిమలు, ఇతర చర్మ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మీ మొబైల్, ఇతర గ్యాడ్జెట్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కంప్యూటర్ కీబోర్డుని సైతం ఉపయోగించే ముందు బ్రష్‌తో క్లీన్ చేయాలి. వీటన్నింటితో పాటు మనం ముఖం ఆనించే దిండు కవర్లు కూడా తరచూ శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.

పదే పదే మారుస్తున్నారా?

మొటిమలు తొలగించుకోవడానికి మనం వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్ని వాడుతుంటాం. అయితే కొంతమంది తాము వాడే ప్రొడక్ట్ నచ్చక ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. ఇలా పదే పదే సౌందర్య సాధనాల్ని మారుస్తుంటారు కొంతమంది. అయితే అన్ని క్రీములు అందరి చర్మతత్వాలకు సరిపడవు. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో వీటివల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌కి మారేటప్పుడు ముందుగా ప్యాచ్ ట్రీట్‌మెంట్ ద్వారా అది మన చర్మానికి సరిపోతుందో, లేదో తెలుసుకుని ఆ తర్వాత ముఖానికి రాసుకోవడం మంచిది. ఇంకా చెప్పాలంటే ఓసారి సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడంలోనూ తప్పులేదు. ఈ గొడవంతా ఎందుకు అనుకునే వారు సహజసిద్ధమైన ఉత్పత్తుల్ని ఉపయోగించడం మంచిది.

ఫేస్ వాష్ అతిగా వద్దు

ముఖం ఫ్రెష్‌గా, అందంగా కనిపించాలని కొంతమంది తరచూ ఫేస్ వాష్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మంపై చేరే దుమ్ము తొలగిపోతుందని వారి భావన. అయితే ఇలా తరచూ ముఖం కడుక్కోవడం వల్ల చర్మ రంధ్రాల నుంచి వెలువడే నూనెలు పూర్తిగా తొలగిపోయి.. చర్మం పొడిబారిపోయి, గరుగ్గా తయారవుతుంది. అలాగే మొటిమలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి పదే పదే ముఖం శుభ్రపరచుకోవడం మంచిది కాదు. అలాగే ఇందుకు గాఢత తక్కువగా ఉన్న, చర్మతత్వానికి సరిపోయేలా ఉండే ఫేస్‌వాష్‌లను ఉపయోగించడమే ఉత్తమం.

కెఫీన్ కూడా ప్రమాదకరమే..

సాధారణంగా మనం తీసుకునే టీ, కాఫీల్లో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది అధికంగా తీసుకోవడం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. కెఫీన్ ఎక్కువైనట్లయితే చర్మం ముడతలు పడడం, పొడిబారడం, మొటిమలు, మచ్చలు రావడం.. వంటివి జరుగుతుంటాయి. అయితే ఇలాంటివి తగ్గించుకోవడానికి ఈ పానీయాలు తాగే ముందు మంచినీళ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది కూడా..!

చూశారుగా.. మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చర్మ ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తాయో..! కాబట్టి మీరూ వీటి విషయంలో ఇకముందు జాగ్రత్తగా వ్యవహరిస్తారు కదూ..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్