అలాంటి బంధాలకు దూరమైతేనే మంచిది!

జీవితంలో ప్రేమను, సంతోషాన్ని నింపాల్సిన అనుబంధాలు ఒక్కోసారి తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురిచేస్తాయి. అన్నివిధాలా మనల్ని కుంగదీసి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. అలాంటి సందర్భాలలో ఒక్కోసారి ఆ బంధం నుంచి శాశ్వతంగా.....

Published : 31 Jul 2022 19:01 IST

జీవితంలో ప్రేమను, సంతోషాన్ని నింపాల్సిన అనుబంధాలు ఒక్కోసారి తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురిచేస్తాయి. అన్నివిధాలా మనల్ని కుంగదీసి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. అలాంటి సందర్భాలలో ఒక్కోసారి ఆ బంధం నుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సి రావచ్చు.. మన తప్పు లేకపోయినా మానసిక వేదనను అనుభవించే కంటే.. ఇలాంటి విషపూరిత బంధం నుంచి తప్పుకోవడమే మంచిదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. తద్వారా పలు ప్రయోజనాలు కూడా చేకూరతాయంటున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

1) 'నీకు ఏ పనీ సరిగ్గా రాదు..', 'నువ్వు ఏమీ చేయలేవు..' ఇలా నిరుత్సాహం కలిగించే మాటలు చాలామంది దంపతులు/జంటల మధ్య మనం వింటూనే ఉంటాం. కాకపోతే కొందరు ఆ క్షణానికి మాత్రమే ఆ మాటలు అని, తర్వాత తమ తప్పు తెలుసుకొని సర్దుకుపోతే, ఇంకొందరు మాత్రం అదేపనిగా భాగస్వామిని విమర్శిస్తూనే ఉంటారు. ఒక్కోసారి ఈ విమర్శలు మనపై మనకు ఉండే నమ్మకాన్ని ప్రభావితం చేసి ‘మనం అసలు ఏమీ చేయలేమా?’, ‘మనకేమీ చేతకాదా?’ అనే సందేహంలో పడేస్తాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల నుంచి దూరం జరిగినప్పుడు ఈ తరహా విమర్శల నుంచి బయటపడడమే కాదు.. మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ప్రోది చేసుకొనే వీలు కూడా ఉంటుంది. గతంలో లాగా మిమ్మల్ని నియంత్రించాలనుకోవడం, చీటికీమాటికీ అనవసరంగా మిమ్మల్ని తిట్టడం లాంటి సమస్యలు కూడా ఉండవు.

2) గతంలో మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతున్నప్పుడు మీ భాగస్వామి భయాందోళనలకు గురై ఉండచ్చు. తనను వదిలి వెళ్తారేమో అని అతను ప్రతిక్షణం అభద్రతకు గురై మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండచ్చు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు మీకు ఉండవు. మీకు ఇష్టం వచ్చిన విధంగా మీ ఉన్నతికి బాటలు వేసుకోవచ్చు.

3) మీపై అనుమానపు నీడల సమస్య ఉండదు. అతని పరోక్షంలో మీరు ఏం చేస్తున్నారో అని ప్రతిక్షణం అతని అనుమానానికి లోనయ్యే ఇబ్బంది ఇప్పుడు ఉండదు. మీ ఆత్మాభిమానాన్ని చంపుకోనవసరం లేదు. అనుక్షణం మానసిక వేదన చెందాల్సిన పని లేదు.

4) ఒకరినొకరు పరస్పరం నియంత్రించుకోవడానికి ఉపయోగించిన సమయాన్ని మీ కెరీర్ అభ్యున్నతికి వినియోగించుకోండి. తద్వారా మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు మీరు తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమనిపిస్తే ఈ క్రమంలో నిపుణుల సహాయం కూడా తీసుకోవచ్చు.pe

5) ఒకరికొకరు తప్పులు వెతుక్కునే సమస్య ఇక ఉండదు. తద్వారా తప్పులు గుర్తుంచుకొని లెక్క పెట్టాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ఇది పరోక్షంగా మెదడుపై ఒత్తిడి పడకుండా చేస్తుంది.

6) మిమ్మల్ని మీరు ప్రేమించుకునే సౌలభ్యం దొరుకుతుంది. మిమ్మల్ని మీరు కొత్తగా అన్వేషించుకుంటారు. మీ గురించి మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. మీకంటూ కొన్ని ఇష్టాలను ఏర్పర్చుకోవడానికీ అవకాశం ఏర్పడుతుంది.

7) ఒక బంధంలో ఉన్నంతవరకు మనసుకు నచ్చిన పని చేయాలన్నా, నచ్చిన దుస్తులు వేసుకోవాలన్నా, మేకప్ చేసుకోవాలన్నా.. చాలా నిబంధనలు ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ బంధం నుంచి తప్పుకున్న తర్వాత ఇలాంటి అడ్డంకులు, నియమాలు ఏవీ మీపై ఉండవు. కాబట్టి మీకు నచ్చినట్లు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. ఈ క్రమంలో చక్కని కెరీర్‌కు బాటలు పరుచుకోవడం మాత్రమే కాదు. మీ ఆహార్యాన్ని సైతం అందుకు అనుగుణంగా మార్చుకోవచ్చు. తద్వారా మీరు ఎదగడమే కాదు.. మీలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుంది.

8) అలాగే ఇన్నాళ్లూ ఒకరితో మీ సంబంధ బాంధవ్యాల వల్ల ఒకవేళ మీరు మీ స్నేహితులకు దూరమైనా, జీవితంలో కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినా- ఇప్పుడు వాటిపైన మళ్లీ దృష్టి పెట్టండి. ఇన్నాళ్లూ పట్టించుకోని అంశాలపై పట్టుసాధించి, జీవితంలో కొత్త మార్పులకి శ్రీకారం చుట్టండి.

9) మీకు అచ్చిరాని అనుబంధం నుంచి బయటపడిన తర్వాత అందులో మీకు ఎదురైన చెడు అనుభవాలు గుర్తు చేసుకుంటూ, బాధపడుతూ కూర్చోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానికి బదులుగా ఆ బాధ నుంచి వీలైనంత త్వరగా తేరుకునేందుకు ప్రయత్నించండి. ఈ క్రమంలో మీ మనసుకు నచ్చిన పనులు చేస్తూ సాంత్వన పొందచ్చు.

10) ఒక విషపూరిత బంధం నుంచి బయటపడ్డాక ఇప్పుడు మీరు మీకు తగ్గ వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకాశం, స్వేచ్ఛ ఉంటుంది. మీ అభిరుచులను గౌరవించే, ఆసక్తులను ప్రోత్సహించే వ్యక్తిని ఎంచుకోవడంలోనూ తప్పు లేదంటున్నారు నిపుణులు. అయితే గత అనుబంధంలో ఎదురైన అనుభవాలు ఇప్పుడు పునరావృతం కాకుండా ఇద్దరూ ముందే ఓ అవగాహనకు రావడం మంచిది. తద్వారా ఎలాంటి సమస్యలూ ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్