Updated : 27/10/2021 18:29 IST

వాటిని కొనే ముందు లేబుల్ చదువుతున్నారా?

ఇంట్లో తయారుచేసుకునేవే కాదు.. బయట కొనే ఆహార పదార్థాల్లోనూ ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నారు చాలామంది. ఈ క్రమంలో వాటి తయారీలో వాడిన పదార్థాలు, వాటిలోని పోషక విలువల గురించి తెలుసుకోవడానికి ఫుడ్‌ లేబుల్ని ఆశ్రయించడం సహజమే! అయితే దాన్నేదో పైపైన చదివి చేతులు దులిపేసుకోవడం కాకుండా సునిశితంగా పరిశీలించాలంటున్నారు నిపుణులు. అప్పుడే వాటిలో అసలువేవో, నకిలీవేవో సులభంగా గుర్తుపట్టచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. దీని ద్వారా మనం దూరం పెట్టాల్సిన పదార్థాలేంటో కూడా మనకు అర్థమవుతుంది. మరి, ఇంతకీ ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలను కొనే ముందు వాటిపై ఉన్న లేబుల్‌ని చదివే క్రమంలో ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలో తెలుసుకుందాం రండి..

ప్రాసెసింగ్‌.. ఎక్కువా? తక్కువా?

ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి.. వాటిని ప్రాసెస్‌ చేసే క్రమంలో ప్రిజర్వేటివ్స్‌/ఫ్లేవర్స్‌ కలపడం మనకు తెలిసిందే! అయితే తక్కువ ప్రాసెస్‌ చేసిన పదార్థాల కంటే ఎక్కువ ప్రాసెస్‌ చేసిన పదార్థాల్లో పోషక విలువలు నశించిపోయి.. తద్వారా ఆరోగ్యానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. సెరల్స్‌, బ్రెడ్‌, శీతల పానీయాలు, ఛీజ్‌, ఫ్రైడ్‌ స్నాక్స్‌, కుకీస్‌, కేక్స్‌.. వంటివన్నీ ఎక్కువగా ప్రాసెస్‌ చేసినవే! కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల పోషకాలేవీ శరీరానికి అందకపోగా.. వీటిలోని అధిక చక్కెరలు, కొవ్వులు వివిధ రకాల అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మీరు ఎంచుకునే ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ తక్కువ ప్రాసెస్‌ చేసిందా? లేదంటే ఎక్కువ ప్రాసెస్‌ చేసిందా? అనేది లేబుల్‌లో ఉన్న ఆయా పదార్థాల్ని బట్టి తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.

అవి ఏ రూపంలోనైనా ఉండచ్చు!

పదార్థాల్ని కంటికి ఇంపుగా, రుచికరంగా తయారుచేయడానికి.. ప్రాసెస్‌ చేసే క్రమంలో ఎక్కువ మొత్తంలో చక్కెరలు, కొవ్వులు, ఉప్పు.. వంటి ప్రిజర్వేటివ్స్‌ వాడుతుంటారు. నిజానికి ఇవి మోతాదుకు మించినా అనారోగ్యకరమే అంటున్నారు నిపుణులు. మరి, వాటిని ఎలా గుర్తించాలంటే.. అది కూడా ఫుడ్‌ లేబుల్‌ చదివి తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

* చక్కెరను - బ్రౌన్ షుగర్‌, కేన్‌ షుగర్‌, క్యాస్టర్‌ షుగర్, కోకొనట్షుగర్‌, డేట్‌ షుగర్‌.. వంటి పేర్లతో లేబుల్‌పై గుర్తించచ్చు. అంతేకాదు.. కొన్ని పదార్థాల్లో దీన్ని గోల్డెన్‌ సిరప్‌, హై-ఫ్రక్టోస్‌ కార్న్‌ సిరప్‌, తేనె, మేపుల్‌ సిరప్‌, రైస్‌ బ్రాన్‌ సిరప్‌.. ఇలా సిరప్‌ రూపంలోనూ ఉపయోగిస్తుంటారు.

* ఉప్పుకి సంబంధించి- బేకింగ్‌ పౌడర్‌, గార్లిక్‌ సాల్ట్‌, ఆనియన్‌ సాల్ట్‌, రాక్‌ సాల్ట్‌, సీ సాల్ట్‌, సోడియం నైట్రేట్‌.. వంటి విభిన్న పేర్లను మనం ఆయా పదార్థాల Ingredients లేబుల్‌పై చూడచ్చు.

* ఇక కొవ్వుల విషయానికొస్తే - బటర్‌, పామ్‌ ఆయిల్‌, క్రీమ్‌, మయొనైజ్, సోర్‌ క్రీమ్‌, వెజిటబుల్‌ ఆయిల్స్‌, ఫ్యాట్స్‌, ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ పౌడర్.. మొదలైన పేర్లతో పేర్కొంటారు.

ముందు చూసి మోసపోవద్దు!

సాధారణంగా ప్యాక్‌కి వెనక వైపు లేబుల్‌ ఉంటుంది. అయితే కొన్నింటికి ముందు భాగంలోనే దీన్ని ప్రచురిస్తారు. చూడగానే ఇది కంటికి కనిపిస్తుంది.. ‘మెరిసేదంతా బంగారం కాదన్న’ట్లు.. ముందు లేబుల్‌ ఉన్న ప్యాకింగ్స్‌ అన్నీ ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వినియోగదారుల్ని తప్పు దోవ పట్టించడానికి అందులో వాడని పదార్థాల్ని కూడా ఈ లేబుల్‌లో పొందుపరిచే అవకాశాలున్నాయంటున్నారు.

అంతేకాదు.. ఆయా పదార్థాల తయారీలో వాడిన ముడి సరుకుల్ని మోతాదును బట్టి అవరోహణ క్రమంలో (ఎక్కువ నుంచి తక్కువకు) లేబుల్‌పై ప్రచురిస్తారు. ఈ క్రమంలో చక్కెరలు, కొవ్వులు.. వంటివి ఎక్కువ మోతాదులో ఉండేవి తొలిస్థానాల్లో ఉంటే మాత్రం వాటిని ఎంచుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇక మొదటి రెండు మూడు పదార్థాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా అందులో వాడిన పదార్థాలన్నీ ఎంత మోతాదులో ఉన్నాయో సునిశితంగా పరిశీలించడం కూడా ముఖ్యమే!
ఇక ముడి పదార్థాల జాబితా లేబుల్‌పై చాంతాడంత ఉన్నా ఆ ప్యాకేజ్‌డ్‌ ఆహార పదార్థం బాగా ప్రాసెస్‌ చేసిందని, అనారోగ్యపూరితమైందని గుర్తించాలట!

లోగో చూసి కొనండి!

సూపర్‌ మార్కెట్‌కి వెళ్లినప్పుడు ప్యాక్‌ చేసిన పదార్థాల్లో ఏదైనా నచ్చితే.. అన్నింటికంటే ముందు దాని ధరెంతో చూస్తాం.. ఆ తర్వాత దాని పరిమాణం, వెజ్‌/నాన్‌వెజ్‌, తయారుచేసిన తేదీ, ఎక్స్‌పైరీ తేదీ.. ఇవన్నీ పరిశీలించాకే ఆఖరుగా ఫుడ్‌ లేబుల్‌ చూడడం చాలామందికి అలవాటు! అంతేకాదు.. కొంతమంది ప్యాక్‌పై ‘Pure Organic’ అని రాసున్నా మరో ఆలోచన లేకుండా దాన్ని కొనేస్తుంటారు. నిజానికి అలా రాసున్నా అది పూర్తి సహజసిద్ధమైన/ప్రాసెస్‌ చేయని పదార్థం అని చెప్పలేమంటున్నారు నిపుణులు. అలా పైపైన చూసి మోసపోకుండా.. కొన్ని లోగోల ద్వారా అసలు ఉత్పత్తేదో తెలుసుకోవచ్చంటున్నారు. Jaivik Bharat (FSSAI), FSSAI, Agmark, ISI Mark.. వంటి లోగోల్ని పరిశీలించి అది నాణ్యమైన ఉత్పత్తే అని పసిగట్టేయచ్చట!

గుడ్డిగా నమ్మేయొద్దు!

కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలు అందులో ఎంత మోతాదులో వాడినా.. అది పూర్తి హెల్దీ అనుకుంటాం.. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు..

* ‘మల్టీగ్రెయిన్‌’ అని ఉంటే అందులో అన్ని రకాల ధాన్యాలు వాడారు కదా.. ఆరోగ్యానికి మంచిదే అన్న భావన మన మదిలో మెదులుతుంది. నిజానికి అన్ని ధాన్యాలు ఇందులో వాడచ్చు.. లేదంటే ఒకే ధాన్యంతో ఈ మొత్తం ఉత్పత్తిని తయారుచేసి ఉండచ్చు. కాబట్టి ఏయే ధాన్యాలు ఎంత మోతాదులో వాడారో లేబుల్‌పై సునిశితంగా చదవాలి.

* కొన్ని ప్యాక్స్‌పై ‘లైట్‌’ అన్న పదాన్ని మనం గమనించచ్చు. అంటే.. అందులో క్యాలరీలు, ఇతర అనారోగ్యకరమైన పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయని దాని అర్థం. నిజానికి ఇలా ఎక్కువగా ప్రాసెస్‌ చేసే క్రమంలో కొవ్వులు/క్యాలరీలే కాదు.. వాటిలోని పోషకాలు కూడా పూర్తిగా నశించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ పదాన్ని గుడ్డిగా నమ్మేయొద్దంటున్నారు నిపుణులు.

* No Added Sugars అని మరికొన్ని పదార్థాల లేబుల్‌పై మనం చూడచ్చు. అంటే రిఫైన్డ్‌ షుగర్‌ (వైట్‌ షుగర్‌)ని ఇందులో వాడలేదని దీని అర్థం. అలాగని చక్కెర ప్రత్యామ్నాయాల్నీ ఇందులో వాడి ఉండచ్చు కదా అని అనుమానించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు.

* Fruit Flavoured.. ఇలా రాసున్నంత మాత్రాన రుచి కోసం అందులో పండ్లను కలపచ్చు.. కలపకపోవచ్చట!

కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని.. ప్యాక్‌ చేసిన పదార్థాల్ని కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సరైందేదో తెలుసుకోవడానికి పైన చెప్పినట్లుగా వాటిపై ఉన్న లోగోను పరిశీలించడం, ప్యాక్‌ చేసిన తేదీ/గడువు తేదీ.. వంటివి పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ఒకవేళ ఈ విషయంలో ఏ సందేహం ఉన్నా నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.


Advertisement

మరిన్ని