జీన్స్ పాతబడకుండా..!

రమ్య ఎంతో ఇష్టపడి ఐసీబ్లూ జీన్స్ కొనుక్కుంది. అయితే ఆరు నెలలు తిరక్కుండానే.. అది పాతదానిలా తయారైంది. ఇక చేసేదేమీ లేక దాన్ని పక్కన పడేసి మరోటి కొనుక్కోవడానికి సిద్ధమైంది. జీన్స్ విషయంలో ఇలాంటి సమస్య మీరు కూడా ఎన్నోసార్లు....

Published : 08 Jul 2023 17:27 IST

రమ్య ఎంతో ఇష్టపడి ఐసీబ్లూ జీన్స్ కొనుక్కుంది. అయితే ఆరు నెలలు తిరక్కుండానే.. అది పాతదానిలా తయారైంది. ఇక చేసేదేమీ లేక దాన్ని పక్కన పడేసి మరోటి కొనుక్కోవడానికి సిద్ధమైంది. జీన్స్ విషయంలో ఇలాంటి సమస్య మీరు కూడా ఎన్నోసార్లు ఎదుర్కొనే ఉంటారు కదా..! ఇలా తక్కువ సమయంలోనే జీన్స్ పాడవడానికి కారణం.. దాన్ని సరిగ్గా ఉతక్కపోవడమే. మిగిలిన వస్త్రాలతో పోలిస్తే.. జీన్స్ మెటీరియల్ దళసరిగా ఉంటుందని వాటిని ఎక్కువసేపు నానబెట్టడం, బ్రష్‌తో గట్టిగా రుద్దడం.. లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల జీన్స్ చిరిగిపోవడం, రంగు వెలిసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇలా జరగకుండా.. జీన్స్ ఎక్కువ కాలం మన్నాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..

కొన్న నాలుగైదు నెలలకే కొన్ని రకాల జీన్స్ ప్యాంట్లు పూర్తిగా రంగు వెలిసిపోతాయి. దీనికి కారణం వాటిని తిరగేయకుండా ఉతికి ఎండలో ఆరేయడమే. కాబట్టి జీన్స్‌ను ముందుగా ఉల్టా తీసి నానబెట్టి.. అలాగే ఉతికి ఆరేయాలి. అప్పుడే జీన్స్ రంగు మారకుండా ఉంటుంది.

ఒక్కోసారి జీన్స్ ఉతికినప్పుడు దాని ఆకారం మారిపోయి.. మడతపెట్టడానికి వీలవదు. జిప్స్, బటన్స్ ఓపెన్ చేసి ఉతకడమే దీనికి కారణం. అలాకాకుండా జిప్స్, బటన్స్‌ని తీయకుండా అలాగే ఉంచి వాష్ చేయడం ద్వారా జీన్స్ ఆకారంలో మార్పు రాకుండా చూసుకోవచ్చు.

మనం ఏ దుస్తులు కొన్నా వాటిని ఎలా ఉతకాలి, ఇతర జాగ్రత్తలకు సంబంధించిన విషయాలు దుస్తుల లోపలి వైపు ఉన్న ఓ వైట్ ట్యాగ్‌పై ఉంటుంది. వాటిని పాటించడం ద్వారా జీన్స్ పాడవకుండా జాగ్రత్తపడచ్చు.

వాషింగ్ మెషీన్‌లో జీన్స్‌ని ఉతికే సమయంలో చాలామంది వేడినీటి వాష్‌ని ఎంచుకుంటారు. జీన్స్ బాగా శుభ్రమవుతుందనే భావనతోనే ఇలా చేస్తుంటారు. అయితే వేడి నీరు తగలడం వల్ల డెనిమ్ పాడైపోయి.. చిరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కోల్డ్ జెంటిల్ వాష్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.

డెనిమ్‌తో తయారైన వస్త్రాలను ఉతికిన తర్వాత ఎండలో ఆరేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల జీన్స్ త్వరగా ఆరిపోతుంది. కానీ.. వేడి ఎక్కువగా తగిలితే జీన్స్ ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. పైగా రంగు కూడా వెలిసిపోతుంది. అందుకే వాటిని నీడలోనే ఆరేయాలి. దీనివల్ల మెటీరియల్ ఎక్కువ కాలం మన్నుతూ ఎప్పటికీ కొత్తదానిలాగే కనిపిస్తుంది.

అలాగని నీడలోనే జీన్స్ ఆరబెడితే.. పూర్తిగా ఆరడానికి కనీసం రెండురోజులైనా పట్టచ్చు. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా తక్కువ సమయంలోనే దాన్ని ఆరిపోయేలా చేయచ్చు. ఇందుకోసం కాటన్ టవల్‌లో జీన్స్‌ని చుట్టి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే టవల్ డెనిమ్ వస్త్రంలోని నీటిని ఎక్కువగా పీల్చుకుంటుంది. ఆ తర్వాత నీడలో ఆరేస్తే సరిపోతుంది. చేతితో ఉతికినప్పుడు ఈ చిట్కా పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

ఒకవేళ డ్రయర్‌లో ఆరబెడుతున్నట్త్లెతే.. సగం సైకిల్ పూర్తయిన తర్వాత బయటకు తీసి నీడలో ఆరేయాలి.

డెనిమ్ వస్త్రాలను డ్రైక్లీనింగ్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు మన్నేలా చేసుకోవచ్చు.

కొంతమంది జీన్స్‌ని ఉతికేటప్పుడు బాగా శుభ్రపడతాయనే ఉద్దేశంతో.. బ్లీచ్ వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అవి రంగు కోల్పోయి పాతవాటిలా తయారవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్