బేరియాట్రిక్ సర్జరీ తర్వాత బరువు అదుపులో ఉండాలంటే..!

ఎత్తుకు తగ్గ బరువున్నప్పుడే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటాం. కానీ అనారోగ్యపూరిత జీవనవిధానం తక్కువ సమయంలోనే చాలామందిని ఊబకాయులుగా మారుస్తోంది. తద్వారా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఇక ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోయే సరికి.. శస్త్రచికిత్సల్ని (బేరియాట్రిక్‌ సర్జరీ - బరువు తగ్గించే ఆపరేషన్లు) ఆశ్రయిస్తుంటారు కొందరు.

Published : 19 Feb 2022 17:41 IST

ఎత్తుకు తగ్గ బరువున్నప్పుడే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటాం. కానీ అనారోగ్యపూరిత జీవనవిధానం తక్కువ సమయంలోనే చాలామందిని ఊబకాయులుగా మారుస్తోంది. తద్వారా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఇక ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోయే సరికి.. శస్త్రచికిత్సల్ని (బేరియాట్రిక్‌ సర్జరీ - బరువు తగ్గించే ఆపరేషన్లు) ఆశ్రయిస్తుంటారు కొందరు. అయితే ఈ ఆపరేషన్‌ తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని  పాటించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అప్పుడే సర్జరీ నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు బరువూ అదుపులో ఉంటుందని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ప్రొటీన్‌ ముఖ్యం!

కండరాల సామర్థ్యాన్ని పెంచి బరువును  అదుపులో ఉంచడంలో ప్రొటీన్ కీలకం. అందుకే బేరియాట్రిక్‌ సర్జరీ తర్వాత ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే పదార్థాల్ని మెనూలో చేర్చుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజుకు కనీసం 60 గ్రాముల ప్రొటీన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్లు, మాంసం, చేపలు, బీన్స్‌, వెన్న తొలగించిన పాలు, పెరుగు.. వంటి వాటిలో ప్రొటీన్‌ ఉంటుంది. ఇక మరీ అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు ప్రొటీన్‌ సప్లిమెంట్లు, పౌడర్లు, పానీయాలు.. వంటివి కూడా తీసుకోవచ్చు.

ఇలా తినాలి!

కొంతమందికి రోజంతా ఏదో ఒక పదార్థం తినే అలవాటుంటుంది. అయితే బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు ఇలా చేయడం సరికాదంటున్నారు నిపుణులు. రోజుకు మూడుసార్లు మాత్రమే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఓ ముద్ద తక్కువగా తింటే ఆయాస పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే భోజనం కూడా గబగబా తినేయకుండా నెమ్మదిగా నమిలి తినడం వల్ల కడుపు నిండుగా అనిపించి.. వికారం, వాంతి వంటి సమస్యలు తలెత్తవు.

10-10 రూల్!

బేరియాట్రిక్‌ సర్జరీ తర్వాత అన్ని పదార్థాలు అందరికీ పడకపోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే నిపుణులు సూచించిన ఆహార నియమాలు పాటించడం వల్ల ఇతర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. ఈ క్రమంలో కొత్త పదార్థాలు అలవాటు చేసుకోవాలనుకున్నా.. ముందు కొద్ది మొత్తంలో తీసుకొని అది శరీరానికి పడుతుందో లేదో చెక్‌ చేసుకోవడం మంచిది. అలాగే కొవ్వులు, చక్కెరల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలో 10-10 రూల్‌ పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. అంటే ఒక సర్వింగ్‌లో 10 గ్రాముల కంటే తక్కువ కొవ్వులు, చక్కెరలు ఉండేలా చూసుకుంటే మేలు.

ఇవి వద్దు!

బరువు తగ్గించే శస్త్ర చికిత్సల్లో భాగంగా జీర్ణాశయం పరిమాణం తగ్గిపోతుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే మనం తీసుకునే ఆహారం మోతాదును సైతం తగ్గించాల్సి ఉంటుంది. అలాగే త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు, పానీయాల్ని తీసుకుంటూ కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అధిక చక్కెరలు, నూనె పదార్థాలు, అరగడానికి ఎక్కువ సమయం పట్టే రెడ్‌ మీట్‌.. వంటి వాటికి దూరంగా ఉండాలి.

వీటితో పాటు నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయడం, నిర్ణీత వ్యవధుల్లో బరువు చెక్‌ చేసుకోవడం, సర్జరీ నుంచి త్వరగా కోలుకోవడానికి మందులు వాడడం.. వంటివి కూడా బేరియాట్రిక్‌ సర్జరీ తర్వాత బరువును అదుపులో ఉంచుకోవడానికి మార్గాలే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్