పేదరికాన్ని జయించి కుస్తీ పోటీలకు వెళ్తోంది!

పేదరికమనేది ప్రతిభకు అడ్డు కాదు.. పట్టుదలకు శ్రమ తోడవ్వాలే కానీ ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించవచ్చు. ఇలాంటి మాటలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది 14 ఏళ్ల చంచలా కుమారి. జార్ఖండ్‌లోని ఓ మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి.. తాజాగా ప్రపంచ కుస్తీ పోటీలకు ఎంపికైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జార్ఖండ్‌ క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.

Updated : 24 Jun 2021 20:31 IST

Image for Representation

పేదరికమనేది ప్రతిభకు అడ్డు కాదు.. పట్టుదలకు శ్రమ తోడవ్వాలే కానీ ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించవచ్చు. ఇలాంటి మాటలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది 14 ఏళ్ల చంచలా కుమారి. జార్ఖండ్‌లోని ఓ మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి.. తాజాగా ప్రపంచ కుస్తీ పోటీలకు ఎంపికైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జార్ఖండ్‌ క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.

 

 

మహేంద్ర సింగ్‌ ధోనీ (క్రికెట్‌), దీపికా కుమారి(ఆర్చరీ), అసుంత లక్రా(హాకీ).. ఇలా ఎందరో క్రీడా దిగ్గజాలను అందించిన ఘనత జార్ఖండ్‌కే దక్కుతుంది. కానీ ఆ రాష్ట్రం నుంచి రెజ్లింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాళ్లెవరూ లేరు. ఈ లోటును భర్తీ చేస్తూ ప్రపంచ కుస్తీ పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించనుంది చంచల. 40 కేజీల సబ్‌ జూనియర్‌ కేటగిరీ విభాగంలో ఆమె పోటీ పడనుంది. ప్రపంచ కుస్తీ పోటీల్లో ఈ విభాగంలో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించనున్న తొలి క్రీడాకారిణి ఈ అమ్మాయే కావడం విశేషం. జులై 19-25 మధ్య హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో ‘వరల్డ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌’ పోటీలు జరగనున్నాయి.

మా పేదరికమే తనకు వరమైంది!

చంచలది రాంచీ సమీపంలోని హొత్వార్‌ అనే ఓ మారుమూల గిరిజన ప్రాంతం. తండ్రి నరేంద్రనాథ్‌ పాహన్‌ ఓ చిన్నపాటి రైతు. అప్పుడప్పుడు ప్లంబింగ్‌ పనులకు కూడా వెళ్తుంటారు. తల్లి మైనో దేవి గృహిణి. వారికి చంచలతో పాటు మొత్తం నలుగురు సంతానం.

‘నా కూతురు బాగా చదివేది. నాకు కూడా తనను ఉన్నత చదువులు చదివించాలనుండేది. కానీ మా ఆర్థిక స్థోమత అందుకు సహకరించలేదు. అందుకే తనను ఏదైనా ప్రభుత్వ గురుకుల/రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పిద్దామనుకున్నాను. అయితే అంతకుముందే జార్ఖండ్‌ స్టేట్ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ సొసైటీ (JSSPS) సెలక్షన్‌ ట్రయల్స్‌కు హాజరైంది. అందులో సత్తా చాటి సీటు సంపాదించింది. అక్కడ చేరాక మా అమ్మాయిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కుస్తీ పోటీల్లో ప్రతిభ చాటింది. ‘ఎప్పుడో ఒకసారి కచ్చితంగా ఇండియా తరఫున ఆడతాను’ అని నిత్యం మాతో అంటూ ఉండేది. ఇప్పుడు ఆ మాటను నిజం చేస్తూ అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తోంది నా కూతురు.. అని చెప్పడం మాకెంతో గర్వంగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే మా పేదరికమే తనకు వరంగా మారిందనుకుంటున్నా. రెజ్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా చేసిందనుకుంటున్నా..’ అని అంటారు చంచల తండ్రి.

ఈ స్థాయికి ఎదుగుతుందనుకోలేదు!

మరోవైపు చంచల తల్లి పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతోంది. ‘నా కూతురు బాగా చదివేది. అయినా అప్పుడప్పుడు నాతో పాటు పొలం పనులకు వచ్చేది. తను ఈ స్థాయికి చేరుకుంటుందని మేం అసలు ఊహించలేదు. మా అమ్మాయి మమ్మల్ని గర్వపడేలా చేసింది’ అంటారామె.

అ‘చంచల’మైన ఆత్మ విశ్వాసంతో!

చంచల లాంటి పేద క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జార్ఖండ్‌ ప్రభుత్వం, సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (సీసీఎల్‌) సంయుక్తంగా జార్ఖండ్‌ స్టేట్ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ సొసైటీ (JSSPS)ని ఏర్పాటుచేశాయి. అక్కడి నుంచే శిక్షణ పొందిన చంచల జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. 2017లో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా (SGFI)లో రజతం సాధించిన ఈ యంగ్‌ సెన్సేషన్‌..  ఆ తర్వాత వరుసగా రెండుసార్లు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. సబ్‌ జూనియర్‌ నేషనల్‌ మీట్‌ 2020-21 పోటీల్లోనూ కాంస్య పతకం సొంతం చేసుకుంది. అదే ఆత్మవిశ్వాసంతో ఇటీవల దిల్లీలో జరిగిన సబ్‌ జూనియర్ రెజ్లింగ్‌ పోటీల్లోనూ సత్తా చాటింది. తద్వారా ప్రపంచ కుస్తీ పోటీలకు అర్హత సాధించింది.

పోషకాహారం లేక ఇబ్బంది పడ్డాను!

‘మా కుటుంబం నుంచి విదేశాలకు వెళుతున్న మొదటి వ్యక్తిని నేనే. అంతర్జాతీయ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ గతేడాది లాక్‌డౌన్‌లో నేను బాగా ఇబ్బంది పడ్డాను. జేఎస్‌ఎస్‌పీఎస్‌ శిక్షణా శిబిరాన్ని మూసేసి క్రీడాకారులందరినీ ఇంటికి పంపేశారు. కానీ ప్రాక్టీస్‌ కొనసాగించేందుకు మా ఇంట్లో ఎలాంటి సదుపాయాలు లేవు. ఒంటరిగానైనా ప్రాక్టీస్‌ చేద్దామంటే కనీసం మ్యాట్‌ కూడా ఉండేది కాదు. పేదరికం కారణంగా మా ఇంట్లో సరైన పోషకాహారం కూడా ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో జేఎస్‌ఎస్‌పీఎస్‌ నిర్వాహకులు, కోచ్‌లు నాకు అండగా నిలిచారు. వారి సహాయంతో ఆన్‌లైన్‌లోనే శిక్షణ తీసుకున్నాను. మళ్లీ ఫామ్‌ అందుకున్నాను’ అని తన కష్టాలను మరోసారి గుర్తుకు తెచ్చుకుందీ యంగ్‌ సెన్సేషన్‌.

పతకంతో తిరిగి రావాలి!

చిన్న వయసు నుంచీ పేదరికంతో సతమతమవుతూ ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపికైన చంచలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభినందనల జల్లు కురుస్తోంది. పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తున్నారు. ప్రపంచ కుస్తీ పోటీల్లో విజయం సాధించి పతకంతో తిరిగి రావాలని ఆశీర్వదిస్తున్నారు.
ఆల్‌ ది బెస్ట్‌ చంచల!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్