close
Updated : 25/01/2022 18:49 IST

సంచలన తీర్పులకు కేరాఫ్‌ అడ్రస్..!

(Photo: Instagram)

అడుగడుగునా పురుషాధిపత్యం కనిపించే పాకిస్థాన్‌ వంటి దేశంలో మహిళలు రాణించడం, ఉన్నత పదవులు అధిరోహించడమంటే కలలో మాటే అనుకుంటాం. అయితే సుప్రీం కోర్టుకు తొలి మహిళా జడ్జిగా ఎంపికై ఆ కలను నిజం చేశారు జస్టిస్ ఆయేషా మాలిక్. మత ఛాందసవాదం ఎక్కువగా ఉండే పాకిస్థాన్ వంటి దేశంలో ఇంతటి ఉన్నత పదవికి ఎంపికై చరిత్ర సృష్టించారు ఆయేషా.

సుప్రీం కోర్టు జడ్జిగా జస్టిస్‌ ఆయేషా అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకునేందుకు పాకిస్థాన్‌ జ్యుడీషియల్‌ కమిషన్ ఇప్పటివరకు రెండుసార్లు సమావేశమైంది. ఆ దేశంలోని ఐదు హైకోర్టుల్లో పనిచేస్తోన్న చాలామంది న్యాయమూర్తుల కంటే జస్టిస్ ఆయేషా జూనియర్ కావడంతో గతంలో పాక్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, పాకిస్థాన్ బార్ కౌన్సిల్ ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాయి. అయితే ఛీఫ్‌ జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ ఐదు ఓట్ల మెజార్టీతో ఆయేషా అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయంతో పార్లమెంటరీ కమిటీ కూడా ఇటీవలే ఏకీభవించింది. ఫలితంగా ఆయేషా మాలిక్ సుప్రీం కోర్టుకు తొలి మహిళా జడ్జిగా ఎంపికయ్యారు.

బ్రిలియంట్‌ స్టూడెంట్!

ప్యారిస్‌, న్యూయార్క్‌, లండన్‌లలో స్కూలింగ్‌ పూర్తి చేసుకున్న ఆయేషా.. కరాచీలోని ‘ప్రభుత్వ కామర్స్, ఎకనమిక్స్‌ కళాశాల’లో కామర్స్‌ విభాగంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. లాహోర్‌లోని ‘పాకిస్థాన్‌ లా కాలేజీ’లో న్యాయ విద్య అభ్యసించారు. ‘హార్వర్డ్‌ లా స్కూల్‌’ నుంచి LLM పూర్తి చేసిన ఆయేషా.. తన ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక London H.Gammon Fellowship (1998-1999 లో) దక్కించుకున్నారు.

అంచెలంచెలుగా ఎదిగిన వైనం!

చదువు పూర్తయ్యాక న్యాయ సహాయకురాలిగా కెరీర్‌ ప్రారంభించారు ఆయేషా. ఆపై RIAA Law Firmలో సీనియర్‌ అసోసియేట్‌గా కొన్నేళ్లు పనిచేశారు. ఈ సంస్థ లాహోర్‌ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తోన్న సమయంలోనే.. దీని ‘కార్పొరేట్‌-లిటిగేషన్‌ డిపార్ట్‌మెంట్’కు నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2012లో లాహోర్‌ హైకోర్ట్‌ న్యాయమూర్తిగా పదవి చేపట్టారు ఆయేషా. ఇక తాజాగా సుప్రీం కోర్టు తొలి మహిళా జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయేషా జూన్ 2031 దాకా ఈ పదవిలో కొనసాగుతారు. ఆ సమయానికి ఆమెకు 65 ఏళ్లు నిండుతాయి.. కాబట్టి పాక్‌ సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉంటారు. అంతేకాదు.. సుప్రీంకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టే అవకాశాలూ లేకపోలేదు. 

సంచలన తీర్పులకు కేరాఫ్‌గా..!

* క్రమశిక్షణ, చిత్తశుద్ధికి మారుపేరైన ఆయేషా.. తన దేశంలోని పలు కీలక రాజ్యాంగ సమస్యలపై నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఆస్తుల ప్రకటనకు సంబంధించి, చెరకు రైతులకు చెల్లింపులు, పాక్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ అమలు.. వంటి పలు అంశాలకు సంబంధించిన తీర్పులు వెలువరించారామె.

* మహిళా హక్కులు, మహిళా సాధికారత, లింగ సమానత్వం, మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించి ఎప్పటికీ న్యాయానిదే విజయమని చాటిచెప్పారు.

* అత్యాచార బాధితులకు కన్యత్వ పరీక్షలు రద్దు చేస్తూ గతేడాది ఆమె వెలువరించిన తీర్పు ఆ దేశ న్యాయ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిందని చెప్పచ్చు. ‘నిందితులపై చర్యలు తీసుకోవడం మాని.. బాధితురాలిని ఇలా అనుమానించడం అమానవీయ పద్ధతి’ అంటారామె.

* 2019లో లాహోర్‌లో కొత్తగా ఏర్పాటైన ‘మహిళా న్యాయమూర్తుల రక్షణ కమిటీ’కి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు జస్టిస్‌ ఆయేషా. మహిళా న్యాయమూర్తులకు ఎదురవుతోన్న పలు సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవడానికి లాహోర్‌ హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి ఈ కమిటీని ఏర్పాటుచేశారు.

* బాలికలు-మహిళల సమానత్వం, న్యాయం కోసం ప్రారంభించిన ‘ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విమెన్‌ జడ్జెస్‌ (IAWJ)’లో భాగస్వామురాలయ్యారు.

* ఇలా కేవలం న్యాయవాదిగానే కాదు.. బోధకురాలిగానూ మారారు ఆయేషా. బ్యాంకింగ్ లా, కమర్షియల్ లా.. వంటి అంశాలపై వివిధ లెక్చర్లు కూడా ఇచ్చారామె.

* పంజాబ్‌ జ్యుడీషియల్‌ అకాడమీ బోర్డు కోసం కోర్టు ప్రక్రియలలో లింగ సమానత్వం అనే అంశంపై ఓ కోర్సు కూడా అభివృద్ధి చేశారు ఆయేషా. అలాగే పర్యావరణ చట్టాలపై ఓ హ్యాండ్‌బుక్‌ కూడా రూపొందించారు.

* సమాజ సేవికగానూ మన్ననలందుకున్నారీ లేడీ జడ్జ్‌. పేదరిక నిర్మూలన, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారామె. అంతేకాదు.. SOS ప్రాజెక్ట్‌లో భాగంగా లాహోర్‌లోని స్కూల్‌ విద్యార్థులకు ఆంగ్ల భాష, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

* ప్రస్తుతం ఇటు వృత్తిలో విజయవంతంగా కొనసాగుతూనే.. అటు గృహిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతల్నీ సమర్థంగా నిర్వర్తిస్తున్నారీ సూపర్‌ విమెన్.


Advertisement

మరిన్ని