ఎక్కడా వెనకడుగు వేయలేదు.. ఈ ఐజీ!
పోలీసు ఉద్యోగమనేది కేవలం పురుషుల కోసమే.. ఇందులో మహిళలు రాణించలేరనే భావన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ భావన అధికంగా ఉంటుంది. అయినా, ఈ ధోరణిని అధిగమించి కొంతమంది మహిళలు పోలీసులుగా రాణిస్తూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతుంది అస్సాంకి చెందిన వయలెట్ బారువా.
(Photo: Twitter)
పోలీసు ఉద్యోగమనేది కేవలం పురుషుల కోసమే.. ఇందులో మహిళలు రాణించలేరనే భావన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ భావన అధికంగా ఉంటుంది. అయినా, ఈ ధోరణిని అధిగమించి కొంతమంది మహిళలు పోలీసులుగా రాణిస్తూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతుంది అస్సాంకి చెందిన వయలెట్ బారువా. పోలీసు శాఖలో మహిళలు అతి తక్కువగా ఉండే అస్సాంలో డీఎస్పీగా కెరీర్ ఆరంభించిన వయలెట్ తాజాగా ఐజీగా పదోన్నతి పొందారు. తద్వారా రాష్ట్రంలోనే ఐజీ ర్యాంక్ సాధించిన మొదటి మహిళగా నిలిచారు. మరి ఆ విశేషాలేంటో చూద్దామా...
అన్నిట్లోనూ మొదటి మహిళే...!
అస్సాంకి చెందిన వయలెట్ బారువా 1992లో అస్సాం పోలీస్ ఫోర్స్‌లో డీఎస్పీగా తన కెరీర్‌ని ఆరంభించారు. ఆ తర్వాత ఎస్పీ, డీఐజీ, ఐజీగా పదోన్నతులు పొందారు. ఇలా చేపట్టిన ప్రతి హోదాలో మొదటి మహిళగా నిలిచిన ఘనత దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌లో కోక్రాఝార్ జిల్లా డీఐజీగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆమె పలు జిల్లాలకు ఎస్పీగా సేవలందించారు. తాజాగా అస్సాం ప్రభుత్వం ఆమెకు ఐజీగా పదోన్నతి కల్పించింది. ఆమె 2022, జనవరి 1 నుంచి ఐజీగా సేవలు అందించనున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఏ పోస్టింగ్ ఇచ్చినా ఏ పని అప్పజెప్పినా ఎప్పుడూ ‘నో’ చెప్పలేదు. అప్పజెప్పిన పనిని తిరస్కరించండం అనేది నా విధానం కాదు. అందుకే నా సర్వీస్లో ఎక్కువ శాతం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి దూరంగా పనిచేశాను’ అని చెప్పుకొచ్చారు.
మనమే ముందుకు రావాలి!
అస్సాం పోలీసు విభాగంలో మహిళల శాతం చాలా తక్కువ. అక్కడ కేవలం ఆరు శాతం మంది మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. ఈ అంశంపై మాట్లాడుతూ ‘ప్రతి చోటా లింగ సమానత్వం పెరుగుతోంది. అయితే అందుకు అనుసరించాల్సిన పద్ధతులు ఎంతో ముఖ్యం. అలాగే ఇందులో వ్యక్తిగత భాగస్వామ్యం కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. క్షేత్రస్థాయిలో పనిచేయాలనే నిర్ణయాన్ని నా అంతట నేనే తీసుకున్నా. ఈ క్రమంలో నేను ఎలాంటి అవరోధాలను ఎదుర్కోలేదు. ఈ రోజుల్లో చాలామంది మహిళలు పోలీసు ఉద్యోగంలో చేరడానికి ముందుకు వస్తున్నారు. కానీ, ఈ సంఖ్య ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను’ అని వివరించారు.
రెండు రాష్ట్రపతి పతకాలు...
అస్సాంలో తరచుగా వరదలు వస్తుంటాయి. అలాగే ఈ ప్రాంతంలో అల్లర్లు, ఆందోళనలు కూడా ఎక్కువే. ఇలాంటి నేపథ్యంలో మహిళా పోలీసులు విధులు నిర్వర్తించడం అంత సులభమేమీ కాదు. అయినా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించి ఇలాంటి విపత్తులను వయలెట్ ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. అలాగే అక్రమ రవాణాకు గురైన కొంతమంది పిల్లలను ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో కాపాడారు. తన సేవలకు గుర్తింపుగా ఆమె రాష్ట్రపతి నుంచి రెండుసార్లు పతకాన్ని దక్కించుకున్నారు. మిలిటెంట్లతో సైతం ధైర్యంగా పోరాడి, డేరింగ్ పోలీసాఫీసరుగా పేరు తెచ్చుకున్న ఈమెకు ఇద్దరు పిల్లలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.