ఇంటి కాలుష్యాన్ని తగ్గిద్దామిలా..!

బయటి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఇల్లే సురక్షితమైన ప్రదేశం అనుకుంటాం. ఈ క్రమంలోనే ఇంటి వాతావరణాన్ని సంరక్షించుకోవడానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తుంటాం. అయితే నిజానికి ఇల్లూ కాలుష్యానికి మినహాయింపేమీ కాదంటున్నారు నిపుణులు.

Published : 02 Dec 2021 15:41 IST

బయటి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఇల్లే సురక్షితమైన ప్రదేశం అనుకుంటాం. ఈ క్రమంలోనే ఇంటి వాతావరణాన్ని సంరక్షించుకోవడానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తుంటాం. అయితే నిజానికి ఇల్లూ కాలుష్యానికి మినహాయింపేమీ కాదంటున్నారు నిపుణులు. ఇంట్లోని దుప్పట్లు, కార్పెట్లు, కర్టెన్లు, పెంపుడు జంతువులు, వంటగది వాయువులు, వాడుకునే ఉపకరణాలు, ఆఖరికి పెంచుకునే మొక్కలు కూడా కాలుష్య కారకాలే అని చెబుతున్నారు. తద్వారా ఆస్తమా, చర్మవ్యాధులు, తుమ్ములు, దగ్గులు, ఆయాసం, అలర్జీలు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు.. వంటి అనారోగ్యాల బారిన పడక తప్పదు. అందుకే వీటి పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. మరి, ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’ సందర్భంగా ఇంటి కాలుష్యాన్ని తగ్గించడానికి నిపుణులు సూచిస్తోన్న మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

శుభ్రం చేద్దాం..

వంట సోడా, వెనిగర్‌.. సహజ క్లెన్సర్లు. శానిటైజర్లతోపాటు ఒక మగ్గులో చెంచా వెనిగర్‌ వేసి.. ఈ మిశ్రమంతో ఇల్లంతా తుడవాలి. వెనిగర్‌ బయో క్లీనర్‌గా పని చేస్తుంది. బ్యాక్టీరియాని చంపేస్తుంది. రిఫ్రిజిరేటర్‌లో ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే బూజు పోగవుతుంది. దీన్ని నిర్మూలించడానికి చిన్న గిన్నెలో వెనిగర్‌ వేసి ఫ్రిజ్‌లో ఓ మూలన పెడితే చాలు. చీమలు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు సహజంగానే కాలుష్య వాహకాలు. బయటి కాలుష్యాన్ని ఇల్లంతా వ్యాపింపజేస్తాయి. వీటిని అరికట్టడానికి వంట సోడా అక్కడక్కడా చల్లాలి.

వీటిని అతిగా వాడొద్దు..

ఇల్లంతా సువాసనభరితంగా ఉండాలని కొందరు కృత్రిమ ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు వాడుతుంటారు. ఇవి బెంజీన్‌, హైడ్రోకార్బన్‌ వంటి వాటిని వాతావరణంలోకి విడుదల చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. తద్వారా కళ్లు, ముక్కు, గొంతుపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఊపిరితిత్తులపైనా ఈ రసాయనాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి.

వెలుతురు ముఖ్యం..

ఇంట్లోకి ధారాళంగా వెలుతురు వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. రోజుకి నాలుగైదు గంటలైనా సూర్యరశ్మి ఇంట్లో నేరుగా పడేలా చేయాలి. దీంతో ఒంటికి ‘డి’ విటమిన్‌ అందడమే కాదు.. కర్టెన్లు, ఇతర వస్తువులపై పేరుకుపోయిన కొన్ని రకాల బ్యాక్టీరియా, బూజు నశిస్తుంది. విడిచిన దుస్తుల్లోని చెమట, గదిలోని తేమ ఆరిపోతుంది. వంటగదిలో పోపులు వేసినప్పుడు వెలువడే ఘాటైన వాయువులు బయటికి పోతాయి.

ఆ కొవ్వొత్తులు వద్దు..

సువాసనలు, వెలుతురు కోసం వెలిగించే కొవ్వొత్తులను చాలా వరకు గపారఫిన్‌ అనే పెట్రోలియం ఉత్పత్తులతో తయారుచేస్తారు. ఇవి వాతావరణంలోకి విష రసాయనాలు వెదజల్లుతాయి. వీటికి బదులు తేనెటీగల మైనం నుంచి తయారు చేసినవి వాడితే మేలు. సోయా, కాటన్‌, వుడ్‌, కోకోనట్‌.. వంటి ఉత్పత్తులతో చేసినవైనా మంచివే.

బొగ్గుతో భళా..

కట్టెల బొగ్గు (చార్‌కోల్‌) సహజసిద్ధమైన ప్యూరిఫయర్‌గా పని చేస్తుంది. పలుచని వస్త్రంతో తయారుచేసిన సంచిలో కొన్ని బొగ్గు ముక్కలు వేసి గదిలో ఒక మూలన పెట్టాలి. ఇది వాతావరణంలోని తేమ, దుమ్మూ-ధూళి, సూక్ష్మక్రిములను లాగేస్తుంది. మూణ్నాలుగు రోజులకోసారి దాన్ని ఎండలో పెట్టి మళ్లీ వాడుకోవచ్చు. వీటిని ఫ్లవర్‌ వేజ్‌ల్లోనూ వేసుకోవచ్చు. రావి చెట్టు బెరడును కాల్చితే వచ్చే బొగ్గునూ ఇలా వాడొచ్చు. మోదుగు చెట్టు బొగ్గు సైతం బాగా పని చేస్తుంది. సైంధవ లవణం అని పిలిచే పింక్‌ సాల్ట్‌ గడ్డను ఒక పింగాణీ పాత్రలో పెట్టి ఇంట్లో ఓ మూలన ఉంచాలి. సూక్ష్మక్రిములు, కాలుష్య కారకాలు, మనం వదిలిన గాలిని అది పీల్చుకుంటుంది. గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది.

మొక్కలు అతిగా వద్దు..

కొందరు ఇంటి నిండా మొక్కలు పెంచేస్తుంటారు. మొక్కలు రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయనే విషయం మరవద్దు. పామ్‌, గన్నేరు చెట్లు వంటివి ఇంట్లో పెంచొద్దు. తులసి లాంటి ఒకట్రెండు మొక్కలకే పరిమితం కావాలి.

ధూపంతో ఆరోగ్యం దేదీప్యం..

సాలవృక్షం నుంచి తీసిన జిగురుతో వారంలో ఒకట్రెండు రోజులు ధూపం వెలిగిస్తే మంచిది. అలా చేసిన ప్రతిసారీ తలుపులు తెరిచి పెట్టాలి. లోపల ఉండే తేమ, దుర్వాసన, బ్యాక్టీరియా పోతుంది. కర్పూరానికి పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ జత చేసి, నెయ్యితో కలిపి వెలిగిస్తే గదిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. యూకలిప్టస్‌ నూనె సహజసిద్ధమైన ప్యూరిఫయర్‌. దీపం వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి ఒకట్రెండు చెంచాల యూకలిప్టస్‌ తైలం వేయాలి. వేప బెరడు, వేప నూనెకి కాలుష్యాన్ని తగ్గించే శక్తి ఉంటుంది. అందులో ఉండే నిమోడిన్‌ అనే పదార్థం నైట్రస్‌ ఆక్సైడ్‌ని పారదోలుతుంది. ప్రమిదతో దీపం పెట్టి పైన గిన్నెలో కొద్దిగా వేప నూనె వేస్తే బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి చనిపోతాయి.

వీటితో పాటు ఇంట్లో వాడే ఫ్యాబ్రిక్స్‌, ఉపకరణాలు, వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. అలాగే ఇంట్లో పెంపుడు జంతువులుంటే వాటి విషయంలోనూ పరిశుభ్రత పాటించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్