Published : 30/01/2022 08:46 IST

పిల్లల మెదడు చురుగ్గా మారాలంటే...

పిల్లల మానసిక వికాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చిన్నప్పట్నుంచీ కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వాళ్ల మెదడు ఎంతో చురుగ్గా మారుతుంది. మరి అవేంటంటారా?

* చిన్నారులతో కలిసి ఆడడం వల్ల వాళ్ల మెదడు ఉత్తేజితమవుతుంది. చేతివేళ్లతో లెక్కించడం లాంటివి ఆడుతూ నేర్పించాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అని అడిగి ఒకటి మమ్మీ, రెండు డాడీ, మూడు బుజ్జి ఇలా... చేతివేళ్లను చూపించాలి. దీంతో వాళ్లకు ఎలా లెక్కించాలో తెలుస్తుంది.

* నాలుగైదు ఆటవస్తువులు ఒకచోట ఉంచి వాటిని లెక్కించడం నేర్పాలి. ఒక్కోటి పక్కకు తీసి వన్, టూ,... ఇలా చెప్పాలి.

* వాళ్లతో కలిసి చదవడమూ ముఖ్యమే. దీనికోసం రంగుల పుస్తకాలను ఎంచుకోవాలి. పెద్ద బొమ్మలు ఉంటే మరీ మంచిది. అందులోని పాత్రల చిత్రాలు చూపుతూ వాటి గురించి వివరించాలి. ఆ పాత్రలో లీనమై హావభావాలు ఒలికిస్తే పిల్లలు దాని గురించి సులువుగా అర్థం చేసుకోగలరు. నీతి కథలను ఎంచుకోవడం ద్వారా వాళ్లలో అప్పటి నుంచే మంచిపై స్పృహ పెరుగుతుంది.

* కేవలం టైం పాస్ కోసం కాకుండా వాళ్లలో విజ్ఞానాన్ని పెంచే ఆటవస్తువులు, బొమ్మలు కొనివ్వాలి. ఆ వస్తువుల ద్వారా ఆటలాడుకోవడంతో పాటు చిన్న చిన్న లెక్కలు మొదలైన వాటిపైన వారికి అవగాహన కలిగేలా ఉండాలి.

* చిన్నారులకు స్పర్శ ఎంతగానో మేలు చేస్తుంది. రోజులో కనీసం మూడు సార్లు వాళ్ల బాడీ మొత్తం మసాజ్ చేయండి. వారెంతగానో ఉత్తేజితమవుతారు.

* ఇంట్లో మంచి వాతావరణం ఉండడమూ ముఖ్యమే. అవకాశం ఉంటే ఆడుకోవడానికి వారికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించండి. వాళ్లకిష్టమైన బొమ్మలు అందులో ఉంచండి. ఏవిధమైన ఇబ్బంది లేకుండా చూడండి.

* మాట్లాడడం వచ్చిన తర్వాత చిన్న చిన్న రైమ్స్ చెప్పి వాళ్లతో పాడించండి. దీనివల్ల పదాలను సులువుగా పలకడం అలవాటవుతుంది.

* వెరైటీ రుచుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అందించండి. కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఏ పండు తింటే ఎలాంటి లాభమో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి.

* ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం అందించరాదు. వీటికి ప్రత్యామ్నాయం ఏదీ లేదు. అంతేకాదు పిల్లల మానసిక వికాసంలో తల్లిపాలు ఎంతో కీలకమని పరిశోధనలు తెలుపుతున్నాయి.

* నడక నేర్చిన తర్వాత ఆరుబయట లేదా పార్క్‌లో నెమ్మదిగా పరిగెత్తించండి. మీరు ముందు నడుస్తూ మిమ్మల్ని పట్టుకోమని చెప్పండి. రోజూ ఇలా చేయడం వల్ల వాళ్లలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది.

* వాళ్లు బాగా ఏడుస్తున్నప్పుడు, అల్లరి చేసినప్పుడు వారిపైన గట్టిగా అరవకూడదు. అంతచిన్న వయసు పిల్లలను భయపెట్టడం ఏమాత్రం మంచిది కాదు. ఏడవడానికి ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి తప్ప భయపెట్టడం పిల్లల వికాసానికి ప్రతిబంధకమవుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని