ఇంట్లో కాలుష్యం.. ఇలా తగ్గించచ్చు!

బయటి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఇల్లే సురక్షితమైన ప్రదేశం అనుకుంటాం. ఈ క్రమంలోనే ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి పలు చిట్కాలు పాటిస్తుంటాం. అయితే నిజానికి ఇల్లూ కాలుష్యానికి మినహాయింపేమీ కాదంటున్నారు నిపుణులు.

Published : 18 Nov 2023 20:01 IST

బయటి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఇల్లే సురక్షితమైన ప్రదేశం అనుకుంటాం. ఈ క్రమంలోనే ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి పలు చిట్కాలు పాటిస్తుంటాం. అయితే నిజానికి ఇల్లూ కాలుష్యానికి మినహాయింపేమీ కాదంటున్నారు నిపుణులు. ఇంట్లోని దుప్పట్లు, కార్పెట్లు, కర్టెన్లు, పెంపుడు జంతువులు, వంటగదిలో వెలువడే వాయువులు, వాడుకునే ఉపకరణాలు, ఆఖరికి పెంచుకునే మొక్కలు కూడా కాలుష్య కారకాలే అని చెబుతున్నారు. తద్వారా దగ్గు, ఆస్తమా, అలర్జీలు, చర్మవ్యాధులు.. ఇలా వివిధ సమస్యలు తప్పవంటున్నారు. అందుకే వీటి పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. మరి, ఇంటి కాలుష్యాన్ని తగ్గించడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

అతిగా వాడొద్దు..

ఇల్లంతా సువాసనభరితంగా ఉండాలని కొందరు కృత్రిమ ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు వాడుతుంటారు. ఇవి బెంజీన్‌, హైడ్రోకార్బన్‌.. వంటి రసాయనాల్ని వాతావరణంలోకి విడుదల చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. తద్వారా కళ్లు, ముక్కు, గొంతుపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల పైనా ఈ రసాయనాలు ప్రతికూల ప్రభావం చూపుతాయట!

ఆ మొక్కలే!

కొందరు ఇంటి నిండా మొక్కలు పెంచేస్తుంటారు. మొక్కలు రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయనే విషయం మరవద్దు. తులసి లాంటి కొన్ని మొక్కలే ఇంట్లో పెంచుకోవడం మంచిది. అలాగే కాలుష్యాన్ని అరికట్టే మొక్కలకూ ప్రాధాన్యమివ్వాలి.

గాలి, వెలుతురు..

వీలైనంత వరకు ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. సూర్యరశ్మి ఇంట్లో నేరుగా పడేలా చేయాలి. ఫలితంగా గదుల్లో తేమ, చెమ్మ వంటివేవైనా ఉంటే తొలగుతాయి. హానికారక వాయువులు బయటకు వెళ్లిపోతాయి.

వీటితో..

వెనిగర్‌ బయో క్లీనర్‌గా పని చేస్తుంది. ఇల్లు తుడిచే మిశ్రమంలో బయట దొరికే క్లీనర్స్‌కు బదులుగా దీన్ని కలపచ్చు.

చీమలు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు సహజంగానే కాలుష్య వాహకాలు. ఇవి బయటి కాలుష్యాన్ని ఇల్లంతా వ్యాపింపజేస్తాయి. వీటిని అరికట్టడానికి వంట సోడా అక్కడక్కడా చల్లాలి.

వీటితో పాటు వంటగదిని, ఇంట్లో వాడే ఉపకరణాలు, కర్టన్లు.. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. అలాగే ఇంట్లో పెంపుడు జంతువులుంటే వాటి విషయంలోనూ పరిశుభ్రత పాటించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్