కరోనా వేళ ఇల్లు కొంటున్నారా? అయితే ఇవి గుర్తు పెట్టుకోండి!

తమకంటూ ఓ సొంతిల్లు ఉండాలని, భవిష్యత్తంతా ఎలాంటి చీకూ చింతా లేకుండా హాయిగా గడపాలనేది ప్రతి మహిళ కల. ఈ క్రమంలో- సహజంగానే ముందుచూపుతో వ్యవహరించే మహిళలు ఈ కరోనా సమయంలో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి, ఓ విలువైన ఆస్తి తమ పేరిట ఉండాలని బలంగా కోరుకుంటున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి.

Published : 15 Jun 2021 19:35 IST

తమకంటూ ఓ సొంతిల్లు ఉండాలని, భవిష్యత్తంతా ఎలాంటి చీకూ చింతా లేకుండా హాయిగా గడపాలనేది ప్రతి మహిళ కల. ఈ క్రమంలో- సహజంగానే ముందుచూపుతో వ్యవహరించే మహిళలు ఈ కరోనా సమయంలో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి, ఓ విలువైన ఆస్తి తమ పేరిట ఉండాలని బలంగా కోరుకుంటున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. చాలామంది మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం ఒక కారణమైతే; ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకులు వడ్డీ రేట్లు భారీగా తగ్గించడం మరో కారణంగా చెప్పచ్చు. అయితే ఇది మంచి ఆలోచనే అయినా.. ఈ కరోనా వేళ తమ సొంతింటి కలను సాకారం చేసుకునే విషయంలో పలు అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే ఇటు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడంతో పాటు; అటు భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, ఈ కరోనా వేళ ఇల్లు కొనే ముందు గుర్తుంచుకోవాల్సిన ఆ విషయాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
కరోనా శారీరకంగా, మానసికంగా మనకు చేటు చేసినప్పటికీ.. భవిష్యత్తు గురించి మరింత అలర్ట్‌గా, సవాళ్లను ఎదుర్కొనే విధంగా మనల్ని తీర్చిదిద్దిందని చెప్పచ్చు. ఈ క్రమంలో ఆర్థికంగా మనం ఎన్నో పాఠాల్ని నేర్చుకున్నాం.. దేనికెంత ఖర్చు చేయాలి? అవసరమైన-అనవసరమైన ఖర్చులేంటి? భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బంది పడకూడదంటే పాటించాల్సిన పొదుపు-మదుపు సూత్రాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో మనకు ఒక అవగాహన వచ్చింది.


తమకంటూ సొంత ఆస్తి ఉండాలని..!
ఈ క్రమంలో- కొంతమంది మహిళలు కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినా; మరికొంతమంది ఆర్థికంగా స్థిరపడిన మహిళలు మాత్రం సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఇదే సరైన తరుణంగా భావిస్తున్నారని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 77 శాతం మంది మహిళలు భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లొచ్చినా ఇబ్బంది పడకుండా ఉండేందుకు తమకంటూ ఓ సొంతిల్లు ఉండాలని ఈ కలను సాకారం చేసుకుంటుంటే.. 23 శాతం మంది మహిళలు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి చొరవ చూపుతున్నట్లు వెల్లడైంది. ఇలా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే మహిళలకు అటు ఆస్తి విలువ పెరగడంతో పాటు ఇంటి అద్దె కూడా వస్తుందని.. ఇలా వారికి రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.


అవసరానికి మించి వద్దు!
ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించి ఎందరో మహిళల సొంతింటి కలను నిజం చేస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలు కూడా ఇల్లు కొనడానికి ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఫ్లాట్‌ లేదా స్థలం కొనడానికి రుణం తీసుకునేటప్పుడు మన జీతం, అక్కడి భూమి విలువను బట్టి బ్యాంకులు మనకు ఎంత లోన్‌ ఇవ్వాలో నిర్ణయిస్తాయి. బ్యాంకు నుంచి వచ్చే రుణాన్ని మినహాయిస్తే మిగిలిన సొమ్ముని మనమే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో మనకొచ్చే జీతభత్యాలను బట్టి ఒకవేళ ఎక్కువ రుణమొచ్చే అవకాశమున్నా అవసరానికి మించి తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. లేకపోతే అనవసరంగా వడ్డీ చెల్లించాల్సి రావచ్చంటున్నారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ కలిసి లోన్‌ కడుతున్నట్లయితే వారికొచ్చే జీతంలో నెలనెలా గృహ రుణం ఎంత కట్‌ అవుతుంది? మిగిలిన డబ్బు నుంచి దేనికెంత ఖర్చుపెట్టాలో ఒక నిర్ణయానికొస్తే.. ఇంటి అవసరాలు, ఖర్చులపై ఒక స్థిరమైన అవగాహన ఏర్పడుతుంది. దాని ప్రకారం భవిష్యత్తులో పొదుపు ప్రణాళికలు వేసుకోవచ్చు.
ఈ క్రమంలో- ఇల్లు కొనాలన్న ఆలోచన మీ భవిష్యత్‌ ప్రణాళికల్లో ఉన్నప్పుడు అందుకు ముందు నుంచే కొంత డబ్బు పొదుపు చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు ఇల్లు కొనే నాటికి ఆ గృహ విలువలో కనీసం 30 శాతం డబ్బైనా మీ వద్ద ఉండాలట! 


ఒకటికి రెండుసార్లు పరిశీలించి..!
అపార్ట్‌మెంట్లో ఫ్లాట్‌ కొన్నా లేదంటే ఇండిపెండెంట్‌ ఇల్లు కొన్నా.. దానికి సంబంధించిన లీగల్‌ డీడ్‌/డాక్యుమెంట్‌ (ప్రాపర్టీ ఓనర్‌షిప్‌కు సంబంధించిన చట్టపరమైన దస్తావేజు), ఇతర ధ్రువపత్రాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొంతమంది  బిల్డర్లు/రియల్టర్లు డబుల్‌ రిజిస్ట్రేషన్లు చేయడం, అసైన్డ్‌ భూముల్ని అంటగట్టడం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీటి విషయాల్లో న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో మీ డాక్యుమెంట్లన్నీ ముందుగా వారికి చూపించి.. అవి సరైనవని తేలితేనే ముందుకెళ్లడం మంచిది. అలాగే మీకు తెలిసిన బిల్డర్‌ ఎవరైనా ఉంటే వారి దగ్గర్నుంచే నేరుగా ఫ్లాట్‌ కొంటే కమిషన్‌ చెల్లించే అవసరం ఉండదు. ఇలా డబ్బు ఆదా అవుతుంది. అలాకాకుండా రియల్‌ ఎస్టేట్‌ గురించి సరైన అవగాహన లేనివారు, మాకు తెలిసిన బిల్డర్‌ ఎవరూ లేరు అనుకున్నప్పుడు సంబంధిత నిపుణులను సంప్రదిస్తే కాస్త డబ్బు ఖర్చైనా ఇల్లు కొనే విషయంలో చక్కటి సలహాలు పొందచ్చు.


ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా..
ఇల్లు కొన్నా, కట్టించుకున్నా.. మనకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్న స్థలంలోనే ఇముడుతున్నాయా? లేదా? అనేది చూసుకోవడం కూడా ముఖ్యమే! ఇల్లంటే సాధారణంగా లివింగ్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌, పెద్దలు-పిల్లలకు విడివిడిగా పడకగదులు, బాత్‌రూమ్స్‌, బాల్కనీ.. ఇవన్నీ సర్వసాధారణమే! అయితే కరోనా వంటి ప్రతికూల పరిస్థితులొచ్చినప్పుడు ఇంటి నుంచి పనిచేయడానికి వీలుగా ఆఫీస్‌ క్యాబిన్ కోసం ఓ ప్రత్యేక గది కేటాయించుకోవడం లేదంటే మీ గదిలోనే అందుకు ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవడానికి వీలుగా వారికోసం అవసరమయ్యే సౌకర్యాలను కూడా అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు రియల్టర్లు కూడా ఇల్లు కట్టేటప్పుడే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, ఐసొలేషన్.. మొదలైన వాటి కోసం ప్రత్యేక సదుపాయాలు ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. కాబట్టి ఇల్లు/ఫ్లాట్‌ కొనుగోలు చేసే ముందే మీరు అనుకున్న సౌకర్యాలన్నీ అందులో ఉన్నాయో, లేదో ఓసారి చూసుకోండి.


ఆ సౌకర్యాలున్నాయా?!
మన ఆరోగ్యం విషయంలో ఏ క్షణం ఏ అవసరమొస్తుందో తెలియదు. ఉదాహరణకు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రులు దగ్గర్లో లేని వారు ఈ ట్రాఫిక్‌ను దాటి ఆస్పత్రికి చేరడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం రోజూ వార్తల్లో చూసే ఉంటాం. అలాగే ట్రాఫిక్ జామ్స్ వల్ల గర్భిణులు, ఇతర అనారోగ్యాలతో బాధపడే వారు సైతం ఆస్పత్రులకు చేరుకోవడం గగనమవుతుంది. కాబట్టి ఇల్లు కొనే ముందు మన భవిష్యత్‌ ఆరోగ్య అవసరాల్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు ఇల్లు/ఫ్లాట్‌ కొనే చుట్టుపక్కల దగ్గర్లో ఆస్పత్రులేమైనా ఉన్నాయా? అనే విషయం కూడా ఆరా తీయాల్సిందే. అలాగే పిల్లల స్కూల్స్, కాలేజీల గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి ధర తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో మరీ నగర శివార్లలో, జనావాసం తక్కువగా ఉండే చోట ఇల్లు తీసుకుంటే ఈ రెండు విషయాల్లో ఇబ్బంది పడాల్సి రావచ్చు.

ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో అటు ఆర్థికంగా ఇబ్బంది రాకుండా, ఇటు భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని కొత్త ఇంటిని ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకున్నారుగా! ఈ క్రమంలో- ఈ అంశానికి సంబంధించి మీ వ్యక్తిగత అనుభవాలు, సూచనలు, సలహాలు ఏవైనా ఉన్నట్లయితే ‘వసుంధర’ వెబ్‌సైట్ వేదికగా పంచుకోండి. అవి మరెంతోమందికి ఉపయోగపడవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్