నన్ను చూసి అమ్మాయిలు ధైర్యం చేయాలి!

పైలట్‌గా మారి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని కలలు కనే అమ్మాయిల చుట్టూ ఎన్నో ఆంక్షలు! మరోవైపు STEM (science, technology, engineering, mathematics) వంటి రంగాల్లో పురుషాధిపత్యమే రాజ్యమేలుతోంది. దీంతో ఇలాంటి అరుదైన రంగాల్లో రాణించాలనుకునే ఎంతోమంది యువతుల కలలు ఊహలుగానే మిగిలిపోతున్నాయి. ఇదిగో ఇలాంటి ధోరణినే మార్చాలని కంకణం కట్టుకుంది 19 ఏళ్ల జరా రూథర్‌ఫర్డ్‌.

Published : 06 Aug 2021 19:22 IST

(Photo: Instagram)

పైలట్‌గా మారి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని కలలు కనే అమ్మాయిల చుట్టూ ఎన్నో ఆంక్షలు! మరోవైపు STEM (science, technology, engineering, mathematics) వంటి రంగాల్లో పురుషాధిపత్యమే రాజ్యమేలుతోంది. దీంతో ఇలాంటి అరుదైన రంగాల్లో రాణించాలనుకునే ఎంతోమంది యువతుల కలలు ఊహలుగానే మిగిలిపోతున్నాయి. ఇదిగో ఇలాంటి ధోరణినే మార్చాలని కంకణం కట్టుకుంది 19 ఏళ్ల జరా రూథర్‌ఫర్డ్‌. శాస్త్రసాంకేతిక రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగేందుకు.. వారిని ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రపంచ యాత్రకు సిద్ధమవుతోందామె. అమ్మాయిలు ఒంటరిగానైనా ప్రపంచాన్ని చుట్టిరాగల సమర్థులు అని నిరూపించడానికే ఈ సాహసయాత్రకు పూనుకున్నానని చెబుతోంది జరా.

జరా రూథర్‌ఫర్డ్‌.. 19 ఏళ్ల ఈ బెల్జియన్‌-బ్రిటిష్‌ యువతికి వ్యోమగామి కావాలనేది చిన్ననాటి కల. తల్లిదండ్రులిద్దరూ పైలట్లు కావడంతో ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహం తోడైంది. అయితే తనొక్కర్తే ఇలా ఎదగడం కాకుండా.. STEM వంటి అరుదైన రంగాల్లో అమ్మాయిల్ని ప్రోత్సహించాలనుకుంటోందామె. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ప్రపంచమంతా చుట్టి రావాలని ప్లాన్ చేసుకుంది.

వారిలో ఆ ధైర్యం నింపడానికే!

ప్రస్తుతం గణితంలో ఎ- లెవెల్ (అడ్వాన్స్‌డ్ లెవెల్) పూర్తి చేసిన జరా.. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదవాలని తన తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే శాస్త్రసాంకేతిక రంగాల్లో అమ్మాయిలకు ప్రోత్సాహం కరువవుతోందని.. ఈ మూసధోరణిని అమ్మాయిలంతా బద్దలుకొట్టాలని కోరుకుంటోంది.

‘ఎప్పటికైనా వ్యోమగామి కావాలనేది నా కల. అమ్మానాన్నలిద్దరూ పైలట్లు కావడంతో.. వాళ్లను చూసి లక్ష్యం దిశగా నాలో కసి మరింతగా పెరిగింది. నాలాగే ఎంతోమంది అమ్మాయిలు శాస్త్రసాంకేతిక రంగాల్లోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వివక్ష, పురుషాధిపత్యం, తగిన ప్రోత్సాహం లేకపోవడం.. వంటివన్నీ వారి కలలకు అడ్డుపడుతున్నాయి. వీటన్నింటినీ బద్దలుకొట్టి అమ్మాయిలు ధైర్యంగా ముందుకు రావాలి. వాళ్లలో ఆ ధైర్యం నింపడానికే ఒంటరిగా ప్రపంచమంతా చుట్టి రావాలని నిర్ణయించుకున్నా. నన్ను చూసి ‘జరాలా నేను కూడా ఏదో ఒక రోజు నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటా’ అని ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటే నేను తీసుకున్న ఈ నిర్ణయానికి సార్థకత లభించినట్లే!’ అంటోందీ టీనేజీ అమ్మాయి.

52 దేశాలు.. 51 వేల కిలోమీటర్లు..!

గతేడాదే పైలట్‌ లైసెన్స్‌ పొందిన జరా.. తన సొంత విమానం ‘షార్క్‌ అల్ట్రా లైట్‌ ప్లేన్‌’లో ప్రపంచమంతా చుట్టి రానుంది. ఇందుకు ఆగస్టు 11న ముహూర్తం ఖరారు చేసుకుంది. రెండు సీట్లున్న ఈ విమానం చాలా తేలికైనది. ఒకవేళ ఇంజిన్‌ విఫలమైనా, ఇతరత్రా సాంకేతిక సమస్యలు తలెత్తినా.. విమానం ల్యాండింగ్‌ వేగం తగ్గి, త్వరగా ల్యాండయ్యే ప్రత్యేకత దీని సొంతం. ఇలాంటి లైట్ వెయిట్‌ విమానంలో ప్రపంచంలోని సుమారు 52 దేశాలకు, 51 వేల కిలోమీటర్లు ప్రయాణించనుందీ బెల్జియం టీన్.
‘నాకు 14 ఏళ్ల వయసున్నప్పట్నుంచే విమానం నడపడంలో శిక్షణ తీసుకుంటున్నా. గతేడాది పైలట్‌ లైసెన్స్‌ కూడా సంపాదించా. నా నిర్ణయం చెప్పినప్పుడు అమ్మానాన్న కాస్త భయపడినా.. ఆ తర్వాత నన్ను ప్రోత్సహించారు. మూడు నెలల పాటు సాగే నా ఈ సాహసయాత్ర బ్రెజిల్‌ రాజధాని బ్రసెల్స్‌ నుంచి ఆగస్టు 11న ప్రారంభం కానుంది. అక్కడ్నుంచి అట్లాంటిక్‌, గ్రీన్‌ల్యాండ్‌, కెనడా, దక్షిణ అమెరికా, అలస్కా, రష్యా, ఇండోనేషియా మీదుగా సాగుతూ తిరిగి యూరప్‌ చేరుకుంటా. మధ్యమధ్యలో ఆయా దేశాల్లో ఆగుతూ అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్ని తెలుసుకుంటా. అక్కడి ప్రజలతో మమేకమవుతా.. సురక్షితంగా ఈ యాత్రను పూర్తి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. ఈ ప్రయాణం గురించి నా మనసులో కాస్త నెర్వస్‌నెస్‌ ఉన్నా.. ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్న ఆతృత నన్ను నిలువరించట్లేదు..’ అంటోంది జరా.

ఆ రికార్డును తిరగరాస్తుందా?!

ఇక తన సాహసయాత్ర కోసం తన పేరెంట్స్‌పై ఆధారపడకుండా స్పాన్సర్ల సహకారంతో స్వయంగా నిధులు సమీకరించుకుంటోందీ టీనేజర్‌. తాను అనుకున్నట్లుగానే అన్నీ సవ్యంగా జరిగి ఈ సాహసయాత్రను పూర్తి చేస్తే.. ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన అతిపిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కుతుంది జరా. అంతేకాదు.. మైక్రోలైట్‌ ప్లేన్‌లో ఒంటరిగా ఈ సాహసయాత్ర చేసిన కీర్తినీ మూటగట్టుకోనుంది. ఈ క్రమంలో తన పేరు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కాలని దానికి అనుగుణంగానే తన రూట్‌ మ్యాప్‌ను సైతం రూపొందించుకుందామె. ఇక గతంలో మహిళల్లో ఈ రికార్డు 30 ఏళ్ల అమెరికన్‌ మహిళ షాయెస్టా వెయిజ్ పేరిట ఉంది.. ఆ రికార్డును తిరగరాసేందుకు ఉవ్విళ్లూరుతోందీ బెల్జియం టీన్‌. ఇలా కేవలం తన యాత్రతో టీనేజీ అమ్మాయిల్లో స్ఫూర్తి నింపడమే కాదు.. వారిని స్టెమ్‌ రంగాల దిశగా ప్రోత్సహించడానికి నిధులు సైతం సమీకరిస్తోంది జరా. ఇక మరోవైపు స్నీకర్స్‌ షూ బిజినెస్‌ కూడా చేస్తోంది.

మరి, జరా లక్ష్యం నెరవేరాలని, ఆమె ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ జరా!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్