close
సినిమా రివ్యూ

రివ్యూ: సవ్యసాచి

రివ్యూ: సవ్యసాచి

చిత్రం: స‌వ్య‌సాచి 
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్, ఆర్.మాధ‌వ‌న్, భూమిక, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు.
స‌ంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ఛాయాగ్ర‌హ‌ణం: యువ‌రాజ్‌
క‌ళ‌: రామ‌కృష్ణ‌
పోరాటాలు: రామ్‌ల‌క్ష్మ‌ణ్‌
నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, ర‌విశంక‌ర్.వై, మోహ‌న్ చెరుకూరి(సివిఎం)
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: చ‌ందూ మొండేటి. 
సంస్థ: మైత్రి మూవీ మేకర్స్ 
విడుదల: 2 -11- 2018

ప్రేమ‌క‌థ‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోతుంటారు నాగ‌చైత‌న్య. ఆయ‌న‌కి విజ‌యాలు ప్రేమ‌క‌థ‌ల రూపంలోనే వ‌చ్చాయి. కానీ కొత్త‌ద‌నం కోసం వీలు కుదిరిన‌ప్పుడల్లా త‌న శైలికి భిన్నమైన యాక్ష‌న్ క‌థ‌ల్ని చేస్తుంటారు. ఈసారి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న మార్క్ క‌థాంశంతో ‘సవ్య‌సాచి’ చేశారు. ‘కార్తికేయ‌’తో మంచి క‌థ‌కుడిగా గుర్తింపు పొందిన చందు మొండేటి ‘ప్రేమ‌మ్’ త‌ర్వాత... మ‌ళ్లీ త‌న‌కి ఇష్ట‌మైన క‌థతో ‘స‌వ్య‌సాచి’ చేశాడు. గర్భంలోనే ఇద్దరు కవలలు ఒకరిగా కలిసిపోతే ఏమవుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర‌మిది. మాధ‌వ‌న్ ఇందులో కీల‌క పాత్ర పోషించ‌డంతో సినిమాపై ఆస‌క్తి, అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఈ కాన్సెప్ట్‌, కాంబినేషన్‌ రేకెత్తించిన ఆస‌క్తి సినిమాలోనూ క‌నిపించిందా? ‘స‌వ్య‌సాచి’గా నాగ‌చైత‌న్య ఎలా ఉన్నాడు? ఆయ‌న‌కి ఈ చిత్రంతో ఎలాంటి ఇమేజ్ ల‌భించింది? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకుందాం పదండి... 
క‌థేంటంటే: విక్ర‌మ్ ఆదిత్య (నాగ‌చైత‌న్య‌) వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు తీసే ఓ ద‌ర్శ‌కుడు. ఆరేళ్ల కింద‌ట కాలేజీలో చిత్ర (నిధి అగర్వాల్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒక‌రికొకరు ద‌గ్గ‌ర‌య్యే క్ర‌మంలోనే దూర‌మ‌వుతారు. ఆరేళ్ల త‌ర్వాత అనుకోకుండా మ‌ళ్లీ క‌లుసుకుంటారు. విక్ర‌మ్ ఆదిత్య వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో పుట్టిన వ్య‌క్తి. అత‌నిలో మ‌రో మ‌నిషి కూడా ఉంటాడు. భావోద్వేగానికి గురైనా, ఎక్కువ సంతోషం క‌లిగినా ఎడ‌మ చేతి వైపున ఉంటూ స్పందిస్తుంటాడు ఆ రెండో మ‌నిషి. ఒక‌రిలో ఇద్ద‌రున్నారు కాబ‌ట్టే త‌ల్లి ఒకరి పేరు విక్ర‌మ్‌గా, మ‌రొక‌రి పేరు ఆదిత్య‌గా పిలుస్తుంటుంది. ప్రేయ‌సికి మ‌ళ్లీ ద‌గ్గ‌రై ఆనందంగా గ‌డుపుతున్న స‌మ‌యంలోనే విక్ర‌మ్ ఆదిత్య అక్క శ్రీదేవి (భూమిక‌) ఇంట్లో బాంబు పేలుతుంది. బావ చ‌నిపోగా, త‌న‌కి ఎంతో ఇష్ట‌మైన అక్క కూతురు మ‌హాల‌క్ష్మి కిడ్నాప్‌కి గుర‌వుతుంది. ఇంత‌కీ ఆ బాంబు పేలుడు వెన‌క ఎవ‌రున్నారు? కిడ్నాప్‌కి గురైన అక్క కూతురు మహాల‌క్ష్మిని విక్ర‌మ్ ఆదిత్య ఎలా ర‌క్షించాడు? ఎడ‌మ చేతిలో ఉన్న ఆదిత్య ఎలా సాయం చేశాడు? ఈ క‌థ‌లో అరుణ్ (మాధ‌వ‌న్ ) ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ: సవ్యసాచి

ఎలా ఉందంటే: ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఇది. వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ల‌క్ష‌ణాల్ని, దాంతో త‌లెత్తే స‌మ‌స్య‌ల్ని చ‌ర్చిస్తూ క‌థ మొద‌ల‌వుతుంది. అయితే ఎత్తుగ‌డ‌లో ఉన్నంత ఆస‌క్తి ఆ త‌ర్వాత మాయమ‌వ‌డ‌మే ఈ సినిమాకి మైన‌స్‌గా మారుతుంది. ఒక‌రిలో ఇద్ద‌రున్నార‌నే విష‌యాన్ని ప‌రిచ‌యం చేయ‌డం మిన‌హా ప్ర‌థ‌మార్ధంలో కథేమీ ఉండ‌దు. ఒకొక్క పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ, క‌థని సాదాసీదాగా ముందుకు తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. క‌ళాశాల నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ, విక్ర‌మ్ ఆదిత్య‌... చిత్ర‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌లోనూ కొత్త‌ద‌నం ఏమీ లేదు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించే స‌న్నివేశాలు కూడా కృత‌కంగా అనిపిస్తాయి. నాగ‌చైత‌న్య‌, వెన్నెల‌కిషోర్‌, స‌త్య త‌దిత‌రులు చేసిన సంద‌డి అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుందంతే. క‌థ అమెరికాకి వెళ్లాక అక్క‌డ ష‌క‌ల‌క శంక‌ర్ చేసే హంగామా ఆకట్టు‌కుంటుంది. అది కూడా కాసేపే.

ద్వితీయార్ధంలోనే సినిమా అస‌లు క‌థలోకి వెళుతుంది. బాంబు పేలుడు సంఘ‌ట‌న‌, అక్క కూతురు కిడ్నాప్ విష‌యం వెలుగులోకి వ‌చ్చాక దాని వెన‌క కార‌ణాల్ని విశ్లేషిస్తూ క‌థానాయ‌కుడు ముందుకు సాగుతాడు. మైండ్ గేమ్ త‌ర‌హా క‌థ‌నం మొద‌ల‌వుతుంది. అయితే ఈ మైండ్ గేమ్‌లో కొత్త‌ద‌నం కానీ, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు కానీ లేక‌పోవ‌డంతో స‌న్నివేశాలు ఎక్క‌డా ర‌క్తిక‌ట్టించ‌వు. క్లైమాక్స్‌కి ముందు వ‌చ్చే స‌న్నివేశాలే కాస్త అల‌రిస్తాయి. విక్ర‌మ్ ఆదిత్య కుటుంబాన్ని టార్గెట్ చేయ‌డం వెన‌క కార‌ణాలు, అరుణ్ పాత్ర‌లో మాధ‌వ‌న్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు, అక్క‌డ వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌ని వాడిన విధానం ఆకట్టు‌కుంటుంది. అభిమానుల్ని, మాస్ ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలు అక్క‌డ‌క్క‌డా జోడించిన‌ప్ప‌టికీ క‌థ‌ని ఆక‌ట్టుకునేలా చెప్ప‌డంలో మాత్రం లోటుపాట్లు క‌నిపిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్‌ల అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. నిధి అగ‌ర్వాల్ తెర‌పై క‌నిపించిన విధానం చాలా బాగుంది. ఆమె అందానికి మంచి మార్కులు ప‌డ‌తాయి. భూమిక చిన్న పాత్ర‌లో క‌నిపిస్తుందంతే. వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్, సుద‌ర్శ‌న్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. తాగుబోతు ర‌మేష్ పాత్ర కొత్త‌గా ఉంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయిని పెంచాయి. యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం, కీర‌వాణి సంగీతం సినిమాపై మంచి ప్రభావం చూపించాయి. స్వ‌త‌హాగా ర‌చ‌యిత అయిన ద‌ర్శ‌కుడు చందూ మొండేటి క‌థ, మాట‌లు చాలా బాగున్నాయి. అయితే ఆ క‌థ‌ని అదే స్థాయిలో తెర‌పైకి తీసుకురావ‌డంలో మాత్రం త‌డ‌బాటుప‌డ్డారు.

రివ్యూ: సవ్యసాచి

బ‌లాలు
+ క‌థ‌
+ న‌టీన‌టులు
+ ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు
- ప్ర‌థ‌మార్ధ క‌థ‌నం

చివ‌రిగా: ఒక్క‌డిలో ఇద్ద‌రి క‌థ.. ‘సవ్యసాచి’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.