‘అంతఃపురం’ చేయనందుకు బాధేసింది!
వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ రమ్యకృష్ణ. ఒకప్పుడు స్టార్హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్నా... తన కెరీర్లో వచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఇప్పటికీ తెరమీద అదే కరిష్మాను కొనసాగిస్తోంది. ‘రిపబ్లిక్’, ‘రొమాంటిక్’లలో నటించి... త్వరలో ‘లైగర్’, ‘బంగార్రాజు’లలో కనిపించనున్న రమ్యకృష్ణ తన మనసులోని ముచ్చట్లను పంచుకుంటోందిలా..
సినిమాల్లోకి రావాలనుకోలేదు
ఓ ప్రముఖ డాన్సర్‌గా ఎదగాలన్న కోరికతో చిన్నప్పుడే నాకు కూచిపూడి, భరతనాట్యం నేర్పించింది అమ్మ. సినిమాల్లోకి వెళ్తే తేలికగా గుర్తింపు వస్తుందనీ, మరిన్ని డాన్స్ ప్రదర్శనలు ఇవ్వొచ్చనీ అమ్మకు ఎవరో చెప్పడంతో ఇటువైపు వచ్చా. ఆ తరువాత డాన్స్ ప్రదర్శనలు పోయి, సినిమాలే నా ప్రపంచం అయ్యాయి. అంతేతప్ప నేనసలు సినిమాల్లోకి రావాలనుకోలేదు.
తీరిక దొరికితే...
మా బాబు రిత్విక్తో గడిపేందుకు ప్రయత్నిస్తా. ఏం వండాలనేది ప్లాన్ చేసుకుంటా. ఇంకాస్త ఎక్కువగా వర్కవుట్లు చేస్తా.
రిత్విక్ విమర్శిస్తాడు
మా అబ్బాయి నా సినిమాలు చూడటమే కాదు నా నటననూ విమర్శిస్తుంటాడు. ఆ కామెంట్లు విన్నప్పుడు వాడికన్నా కృష్ణవంశీ విమర్శలే కొంత నయం అనిపిస్తుంటుంది.
కృష్ణవంశీ అవకాశం ఇవ్వనన్నారు
పెళ్లికిముందు నేను కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చంద్రలేఖ’ చేశా. పెళ్లయిన కొత్తల్లో - ‘శ్రీఆంజనేయం’లో నటించా. ఆ షూటింగ్ సమయంలో తను నాకు డైలాగులు వివరిస్తుంటే నవ్వొచ్చేది. అది చూశాక ఇంకెప్పుడూ తన సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వనని చెప్పేశారు. ఇకముందైనా ఇస్తారో లేదో చూడాలి.
చెప్పులు విసిరారట
నాకు గుర్తింపు తెచ్చిన పాత్రల్లో ‘నరసింహ’లోని నీలాంబరి ఒకటి. రజనీసార్ పక్కన హీరోయిన్గా కాకుండా ప్రతినాయిక పాత్ర అనేసరికి కాస్త దిగులుపడ్డా. సౌందర్య పాత్ర నాకు వస్తే బాగుండేదని అనుకుంటూనే అయిష్టంగానే షూటింగ్ పూర్తిచేశా. సినిమా విడుదలైన మొదటిరోజు అనుకుంటా... మా చెల్లెలు ఓ థియేటర్‌కు వెళ్లింది. అక్కడ తెరమీద నేను కనిపించగానే అందరూ చెప్పులు విసరడం మొదలుపెట్టారట. అది విన్నాక నా కెరీర్ అయిపోయిందని భయపడ్డా కానీ వారం, పదిరోజులయ్యాక నా పాత్రకే మంచిపేరు వచ్చిందని తెలిసి ఆనందించా.
దణ్ణం పెట్టేవారు
‘అమ్మోరు’ మంచి గుర్తింపు తెస్తుందని ఆ సినిమా చేస్తున్నప్పుడు అనుకోలేదు. ఆ సినిమా విడుదలైన కొన్నిరోజులకు ఏదో షూటింగ్లో ఉన్నా. కొందరు మహిళలు వచ్చి గబగబా నా కాళ్లకు దణ్ణం పెట్టడం మొదలుపెట్టారు.
ఐరన్‌లెగ్ అనేవారు
సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నాది ఐరన్‌లెగ్ అనేవారు. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన ‘అల్లుడుగారు’ హిట్ కావడంతో నాకు అవకాశాలు వరసకట్టాయి. అదేవిధంగా తమిళంలో నాకు బ్రేక్ ఇచ్చింది దర్శకుడు కె.ఎస్.రవికుమార్. వీళ్లద్దరి రుణం తీర్చుకోలేను.
అంతఃపురంలో సౌందర్యలా...
చాలామంది హీరోయిన్లు నీలాంబరి లాంటి పాత్రను చేయాలని కలలు కంటే నేను మాత్రం అంతఃపురంలో సౌందర్యలాంటి పాత్ర వస్తే బాగుండని ఇప్పటికీ అనుకుంటా. ఆ పాత్రను నాకు ఇవ్వనందుకు కాస్త బాధపడ్డాను కూడా.
తనే నాకు ఆదర్శం
మొదటినుంచీ నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఆదర్శంగా తీసుకుంటా. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నిలదొక్కుకుని ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనం చూశాక తనకి వీరాభిమానిని అయ్యా. నేను ఆమెను కలవలేదు కానీ... జయలలిత పాత్రను క్వీన్ రూపంలో నేను చేసినందుకు ఆనందంగా అనిపించింది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్