11 మంది.. ఒకేచోట పని చేస్తూ.. ఒకేసారి తల్లి కాబోతున్నారు!

ఈ ప్రపంచంలో ఎంతోమంది మహిళలు ఒకేసారి గర్భం ధరించడం, ఒకే రోజు/ ఒకే సమయంలో పిల్లలకు జన్మనివ్వడం సహజం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన మహిళల విషయంలో ఇలా జరగడం వింటూనే ఉంటాం. కానీ ఒకే చోట,  ఒకే విభాగంలో కలిసి......

Published : 15 May 2022 10:42 IST

(Photo: Instagram)

ఈ ప్రపంచంలో ఎంతోమంది మహిళలు ఒకేసారి గర్భం ధరించడం, ఒకే రోజు/ ఒకే సమయంలో పిల్లలకు జన్మనివ్వడం సహజం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన మహిళల విషయంలో ఇలా జరగడం వింటూనే ఉంటాం. కానీ ఒకే చోట,  ఒకే విభాగంలో కలిసి పని చేసే ఎక్కువ మంది మహిళలు దాదాపుగా ఒకేసారి గర్భం ధరించడం చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అసాధారణ విషయం అమెరికా మిస్సౌరీలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది ఆ ఆస్పత్రి స్టాఫ్‌ ఇప్పుడు గర్భిణులుగా ఉన్నారు. నెలల వ్యవధిలోనే వీరంతా తమ బిడ్డలకు జన్మనివ్వబోతున్నారు. ఇదంతా ఆ ఆస్పత్రి నీళ్ల ప్రభావమేమో అని నెటిజన్లు చమత్కరిస్తుంటే.. దానికి ఈ కాబోయే అమ్మలు ఏం సమాధానమిస్తున్నారో తెలుసుకుందాం రండి..

అమెరికా మిస్సౌరీలోని లిబర్టీ ఆస్పత్రి పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. ఇందుకు కారణం.. అక్కడి 11 మంది మహిళా సిబ్బంది నెలల వ్యవధిలో ఒకేసారి గర్భం ధరించడం. వీరిలో 10 మంది నర్సులు, ఒక డాక్టర్‌ ఉన్నారు. ప్రస్తుతం ప్రసూతి విభాగంలో పనిచేస్తోన్న వీరంతా నెలలు నిండుతున్నా రెట్టింపు ఉత్సాహంతో విధులకు హాజరవుతున్నారు.

ఇలా ప్రత్యేకంగా నిలిచాం!

వీరిలో ఒక నర్సు డెలివరీ డేట్‌ మే 27న ఉండగా, మిగతా వారంతా జులై-నవంబర్‌ మధ్యలో తమ పిల్లలకు జన్మనివ్వనున్నారు. అంతేకాదు.. మిగతా పది మందిలో ఇద్దరి డెలివరీ డేట్‌ కూడా ఒకటే కావడం గమనార్హం. అయితే ఇలా ఒకే చోట ఇంత మంది గర్భం ధరించడం చాలా అరుదు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడం, వీరంతా గర్భంతో దిగిన ఫొటోను ఆస్పత్రి సోషల్‌ మీడియా  ఖాతాలో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

ఈ క్రమంలో చాలామంది నెటిజన్లు.. ‘మీ ఆస్పత్రి నీళ్లలో ఏం మహిమ ఉందో? అందరూ ఇలా ఒకేసారి గర్భం ధరించారు!’ అని చమత్కరిస్తున్నారు. అయితే దీనికి ఓ నర్సు స్పందిస్తూ.. ‘ఆస్పత్రి నీళ్లు కాదు.. మా బాటిల్‌ నీళ్లు.. మేమంతా ఎవరింటి నుంచి వాళ్లు వాటర్‌ బాటిల్ తెచ్చుకుంటాం!’ అంటూ సమాధానమిచ్చింది. ‘నిజంగా ఇది కాకతాళీయమే! ఒకే యూనిట్‌కు చెందిన మేమంతా ఇలా ఒకేసారి గర్భం ధరించడంతో ప్రత్యేకంగా నిలిచాం..’ అంటూ తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతోన్న డాక్టర్‌ అన్నా చెప్పుకొచ్చారు.

గతంలోనూ ఇలా!

ఇలాంటి ఆసక్తికర సంఘటనలు గతంలోనూ పలుచోట్ల చోటు చేసుకున్నాయి.

* 2019లో ఒహాయో లోని ‘మియామీ వ్యాలీ ఆస్పత్రి’లో ప్రసూతి, డెలివరీ విభాగాలకు చెందిన 11 మంది నర్సులు ఒకేసారి గర్భం ధరించిన విషయం అప్పట్లో వైరల్‌గా మారింది. ‘ఒకే ఆస్పత్రిలో పనిచేయడం, ఒకరికొకరు అండగా నిలవడం, ఒకేసారి గర్భం ధరించడం, నెలల వ్యవధిలో బిడ్డల్ని కనడం.. ఇవన్నీ మాకు మధురానుభూతులే!’ అంటూ మురిసిపోయారీ నర్సమ్మలు.

* యూఎస్‌ పోర్ట్‌ల్యాండ్‌లోని ‘Maine Medical Center’ లో 2019లో తొమ్మిది మంది నర్సులు ఒకేసారి గర్భం ధరించి వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. ఒకరి డెలివరీ సమయంలో మిగతా వాళ్లంతా విధుల్లో కొనసాగుతూ.. వాళ్ల ప్రసవాల్నీ ఓ వేడుకలా జరుపుకొన్నారు.

* 2018లో అమెరికా అండర్సన్‌ హాస్పిటల్‌లోని ప్రసూతి విభాగంలో ఒకేసారి 8 మంది మహిళా స్టాఫ్‌ గర్భం ధరించి ప్రత్యేకంగా నిలిచారు. వీళ్లంతా ప్రసవానంతరం తమ చిన్నారులతో ఫొటోలకు పోజివ్వడం, దాన్ని ఆస్పత్రి యాజమాన్యం తమ సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేయడంతో అప్పుడు ఆ వార్త తెగ హల్‌చల్‌ చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్