వాళ్ల కోసం.. ప్రేమతో పచ్చళ్లు తయారు చేస్తూ..!

కోట్లాది మందితో కన్నీరు పెట్టించినట్లే... కరోనా మహమ్మారి ఆమెనూ కన్నీటి సంద్రంలో ముంచేసింది. ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాలు పంచుకున్న భర్తను కబళించింది. ఆస్పత్రిలో కళ్లెదుటే భర్తను పోగొట్టుకున్న ఆమె... పక్కనే ఉన్న మరికొందరి కరోనా బాధితుల కష్టాలను కళ్లారా చూసింది. అదే... వారి కోసం తన వంతు ఏదైనా సాయం చేయాలన్న తలంపును తీసుకొచ్చింది.

Published : 27 Aug 2021 19:35 IST

(Photo: Instagram)

కోట్లాది మందితో కన్నీరు పెట్టించినట్లే... కరోనా మహమ్మారి ఆమెనూ కన్నీటి సంద్రంలో ముంచేసింది. ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాలు పంచుకున్న భర్తను కబళించింది. ఆస్పత్రిలో కళ్లెదుటే భర్తను పోగొట్టుకున్న ఆమె... పక్కనే ఉన్న మరికొందరి కరోనా బాధితుల కష్టాలను కళ్లారా చూసింది. అదే... వారి కోసం తన వంతు ఏదైనా సాయం చేయాలన్న తలంపును తీసుకొచ్చింది.

కరోనాతో భర్తను కోల్పోయి!

దిల్లీకి చెందిన ఉషాగుప్తా వయసు ప్రస్తుతం 87 ఏళ్లు. ఆమె భర్త రాజ్‌కుమార్‌ ఇంజినీర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వీరి ముగ్గురు కూతుళ్లు డాక్టర్లుగా దిల్లీలోనే స్థిరపడ్డారు. ఉష-రాజ్‌కుమార్‌లది సుమారు 60 ఏళ్ల దాంపత్య బంధం. అయితే వీరి అన్యోన్యతను చూసి కరోనాకు కూడా కళ్లు కుట్టాయేమో... కొన్ని నెలల క్రితం ఆలుమగలిద్దరూ కరోనా బారిన పడగా... రాజ్‌కుమార్‌ శాశ్వతంగా ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. దిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో 27 రోజుల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆయన ఆక్సిజన్‌ కొరతతో కన్ను మూశారు. ఇది ఉషను తీవ్రంగా కలచివేసింది.

పచ్చళ్ల వ్యాపారంతో!

ఆస్పత్రిలో రాజ్‌కుమార్‌తో పాటు ఎంతోమంది కరోనా బాధితుల కష్టాలను దగ్గరుండి గమనించారు ఉష. ఆక్సిజన్‌, మందులు, ఇతర సదుపాయాల లేమితో వారు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. కరోనా రోగుల కుటుంబాలకు ఏదైనా తన వంతు సహాయం చేయాలని తలంచారు. కుకింగ్‌లో తనకు కొద్దిపాటి అనుభవం ఉండడంతో పచ్చళ్లు, చట్నీల వ్యాపారం ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించడం మొదలుపెట్టారు.

‘Pickled With Love’..!

ఈ ఏడాది జులైలో ‘Pickled With Love’ పేరుతో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించారు ఉష. మొదట తన బంధువులు, స్నేహితులకు వీటిని పంపించగా, అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి నెలలోనే 200 బాటిల్స్ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆర్డర్ల సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. దిల్లీ నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, కేరళ నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి. ఇలా పచ్చళ్లు, చట్నీల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్నంతా కొవిడ్‌ బాధితుల కుటుంబాలకే వెచ్చిస్తున్నారు ఉష. ఇప్పటివరకు సుమారు 65 వేల మంది కరోనా రోగులకు ఆపన్నహస్తం అందించానని చెబుతారామె.

యుద్ధం మధ్యలో ఉన్నామనిపించింది!

‘నేను, నా భర్త ఆస్పత్రిలో చేరినప్పుడు మా చుట్టూ అన్నీ ప్రతికూల పరిస్థితులే కనిపించాయి. ఆక్సిజన్‌ కొరతతో రోగులు అల్లాడిపోతున్నారు. మేం యుద్ధం మధ్యలో నిలబడి ఉన్నామనిపించింది. నా భర్తకు కూడా రెండుసార్లు ఆక్సిజన్‌ అవసరమొచ్చింది. మొదటిసారి ఆయన ప్రాణాలు దక్కినా రెండోసారి మాత్రం ఆ అదృష్టం లేకపోయింది. మా ఆయన మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నన్ను నేను కోల్పోయాననిపించింది. కొన్నిరోజుల పాటు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మా వారిలాగే ఆస్పత్రిలో మరికొందరు రోగులు ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతుండడం నాకు గుర్తుకు వచ్చింది. దీంతో పాటు మిగిలిన నా జీవితాన్ని ఏదైనా సామాజిక ప్రయోజనం కోసం వినియోగించాలనుకున్నాను. అప్పుడే నా మనవరాలు రాధికాబాత్రా ఓ ఎన్‌జీవో నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నా ఆశయం గురించి తనకు చెప్పాను. అయితే ఆమె డైరెక్టుగా డబ్బులు తీసుకునేందుకు తిరస్కరించింది.’

వేలాదిమందికి ఆపన్న హస్తం!

‘పచ్చళ్లు, చట్నీల వ్యాపారం చేయాలని నా మనవరాలే నాకు సలహా ఇచ్చింది. నాకు కూడా ఈ ఐడియా నచ్చింది. అయితే ఈ మలి వయసులో సాధ్యమేనా? అని సందేహమొచ్చింది. కానీ రాధిక నాకు తోడుగా నిలిచింది. నేను పచ్చళ్లు, చట్నీలు తయారుచేస్తే... బాటిల్స్‌ ఆర్డర్‌ చేయడం, లోగో ప్రింటింగ్‌ తదితర మార్కెటింగ్‌ వ్యవహారాలన్నీ నా మనవరాలే చూసుకుంది. మొదట 3 రకాల పచ్చళ్లు తయారుచేసి విక్రయించగా...మొదటి నెలలోనే 200 బాటిళ్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి. ముఖ్యంగా ‘ఖట్టా ఆమ్’ (పుల్లని మామిడి), గ్రేటెడ్‌ మ్యాంగో (తురిమిన మామిడి), గులాబీ మీఠా అచార్‌, చింతపండు పచ్చళ్లను మళ్లీ మళ్లీ కావాలంటున్నారు.’

అలసిపోయినా సరే..

‘ఈ బిజినెస్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో ఇప్పటివరకు 65 వేల మంది కుటుంబాలకు ఆర్థికసాయం చేశాం. కొంతమంది దాతలు, స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా మాకు సహాయం అందుతోంది. వృద్ధాప్య సమస్యల కారణంగా పచ్చళ్లు తయారుచేసే సమయంలో ఒళ్లు నొప్పులు బాగా వేధిస్తుంటాయి. తీవ్రంగా అలసిపోతుంటాను. అందుకే పెయిన్‌కిల్లర్లు వేసుకుని మరీ పచ్చళ్లు తయారుచేస్తుంటాను. ఎందుకంటే ఇది కేవలం వ్యాపారమే కాదు... కొన్ని వేలమంది ప్రాణాలు, ఆశలు దీనితో ముడిపడి ఉన్నాయి. నా ప్రాణం ఉన్నంతవరకు ఇలా సహాయపడుతూనే ఉంటాను’ అని అంటున్నారు ఉష.

కుకింగ్‌లో ఎంతో అనుభవమున్న ఉష ‘Indian Vegetarian Cuisine’ అనే పుస్తకాన్ని రచించారు. అదేవిధంగా పచ్చళ్లు, చట్నీల తయారీలో మహిళలకు శిక్షణ అందించేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్