Momo Mami: అందుకే ఈమె చేసే మోమోస్ అంటే అంత క్రేజు!

బయట దొరికే పదార్థాల్లో చాలా వరకు ప్రిజర్వేటివ్స్‌ కలుపుతుంటారు. ఎందుకంటే అవి నెలల తరబడి నిల్వ ఉండాలి కాబట్టి! కానీ ఇలాంటి రసాయనాలతో పని లేకుండా సహజసిద్ధమైన పదార్థాలతోనే ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండే ఆహార పదార్థాల్ని తయారుచేస్తున్నారు....

Published : 15 Jun 2022 20:18 IST

(Photos: Instagram)

బయట దొరికే పదార్థాల్లో చాలా వరకు ప్రిజర్వేటివ్స్‌ కలుపుతుంటారు. ఎందుకంటే అవి నెలల తరబడి నిల్వ ఉండాలి కాబట్టి! కానీ ఇలాంటి రసాయనాలతో పని లేకుండా సహజసిద్ధమైన పదార్థాలతోనే ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండే ఆహార పదార్థాల్ని తయారుచేస్తున్నారు డార్జిలింగ్‌కు చెందిన మాస్టర్‌ చెఫ్‌ అదితీ మదన్‌. హిమాలయ ప్రాంతాల్లో అత్యంత ఆదరణ పొందిన దాదాపు 35 విభిన్న రకాల ఆహార పదార్థాల్ని ఈ తరహాలో తయారుచేసి ఆహార ప్రియుల మనసు దోచుకుంటున్నారు. అంతేనా.. తన వ్యాపారంతో కోట్లకు పడగెత్తారామె. ముఖ్యంగా ఆమె తయారుచేసే మోమోస్‌ రుచికి ఫిదా అయిన ‘ఇండియా మాస్టర్‌ చెఫ్‌’ న్యాయనిర్ణేతలు ‘మోమో మామీ’గా ఆమెకు కితాబునివ్వడం విశేషం. నిజానికి తొమ్మిదేళ్ల క్రితం ఉద్యోగిగా ఉన్న అదితికి చెఫ్‌గా మారాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ జర్నీలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలేంటో? మనమూ తెలుసుకుందాం రండి..

లక్ష్యం అది కానప్పుడు.. చేసే ఉద్యోగం కూడా అసంపూర్ణంగానే అనిపిస్తుంటుంది. డార్జిలింగ్‌కు చెందిన అదితీ మదన్‌దీ ఇలాంటి పరిస్థితే! చదువు పూర్తి కాగానే జపనీస్‌ భాషపై పట్టు సాధించి.. ఈ భాష నేర్పడంలోనే 12 ఏళ్లు గడిపిన ఆమె.. ఎప్పటికైనా చెఫ్‌గానే స్థిరపడాలని నిర్ణయించుకుంది. విభిన్న రకాల వంటకాలు చేయడంలో ఆమెకు ఆమే సాటి అని చెప్పచ్చు. ఈ మక్కువతోనే ఉద్యోగాన్ని వదిలేసి.. 2013లో నిర్వహించిన ‘మాస్టర్‌చెఫ్‌ ఇండియా సీజన్‌-3’లో పాల్గొంది అదితి.

అలా ‘మోమో మామీ’గా!

హిమాలయ ప్రాంతానికి చెందిన ఆమె అక్కడ ఆదరణ పొందిన, ప్రత్యేకమైన వంటకాల్ని దేశవ్యాప్తం చేయాలని నిర్ణయించుకుంది. అయితే అది కూడా ఎలాంటి ప్రిజర్వేటివ్స్‌ వాడకుండా సహజసిద్ధమైన పద్ధతుల్లోనే నెలల పాటు నిల్వ ఉండేలా అందరికీ చేరువ చేయాలనేది తన ఆలోచన. ఇదే ఆలోచనతో మాస్టర్‌చెఫ్‌ కార్యక్రమానికి హాజరైందామె. ఈ క్రమంలో ఆమె పాకశాస్త్ర ప్రావీణ్యం, సరికొత్త ఐడియాలజీ.. ఆ కార్యక్రమ న్యాయ నిర్ణేతలు, చెఫ్‌లు అయిన సంజీవ్‌ కపూర్‌, వికాస్‌ ఖన్నా, కునాల్‌ కపూర్‌లకు నచ్చాయి. దీంతో వికాస్‌ ఖన్నా అదితికి ‘మోమో మామీ’గా కితాబునిచ్చారు. ఇక అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదామె. తన ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి ఎన్నో పరిశోధనలు చేశారు.. సహజసిద్ధంగా ఆహార పదార్థాల్ని ప్రిజర్వ్‌ చేయడమెలాగో ఓ చిన్నపాటి అధ్యయనమే చేశారామె. ఇలా మొత్తానికి తన ‘ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ (పదార్థాల్ని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడం)’ వ్యాపారాన్ని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి.. 2016లో ‘బ్లూపైన్‌ ఫుడ్స్‌’ సంస్థ పేరుతో ప్రారంభించారు అదితి.

నాలుగుతో మొదలుపెట్టి..!

మోమోస్‌, స్ప్రింగ్‌ రోల్స్‌తో పాటు మరో రెండు ఆహార పదార్థాలతో తన వ్యాపారాన్ని ప్రారంభించానంటున్నారు అదితి. ‘వంటకాల కోసం స్థానికంగా లభించే సరుకులు, వ్యవసాయోత్పత్తుల్నే వాడుతున్నాం. మొదట్లో మోమోస్‌, స్ప్రింగ్‌ రోల్స్‌తో పాటు మరో రెండు వెరైటీల్ని తయారుచేశాం. ప్రస్తుతం 35 రకాల వంటకాలు మా కిచెన్‌లో తయారవుతున్నాయి. రోజూ కొత్తగా ఏం చేయాలనే దానిపైనే మా టీమ్‌ కసరత్తులు చేస్తుంటుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్‌ వాడకుండా సహజసిద్ధమైన పదార్థాలతోనే మా ఉత్పత్తులు తయారవుతున్నాయి.. అలాగే నాణ్యత, రుచిలో కూడా అస్సలు రాజీ పడం. పైగా అన్నీ సహజపదార్థాలే కాబట్టి ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి.. వీటిలో పోషక విలువలు కూడా ఎక్కువే!’ అంటున్నారీ మాస్టర్‌ చెఫ్.

లక్షల నుంచి కోట్లకు పడగెత్తి..!

గత ఆరేళ్లుగా తన వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు అదితి. తొలుత తాను పొదుపు చేసుకున్న సుమారు రూ. 5 లక్షలతో వ్యాపారం ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 3.5 కోట్ల టర్నోవర్‌ను అందుకుంటున్నారు. ఇలా లాభాల్నే కాదు.. పాకశాస్త్రంలో తన సృజనాత్మకత, తాను తయారుచేసే విభిన్న వంటకాలతో ప్రజాదరణనూ సొంతం చేసుకుంటున్నారామె. అందుకే మొన్నామధ్య ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా.. కొంతమంది పెట్టుబడిదారులు ఆమె కంపెనీలో రూ. 75 లక్షల పెట్టుబడులు పెట్టారు. ఇలా ఓవైపు తన వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు నడిపించడమే కాదు.. తన నైపుణ్యాలతో మరికొంతమంది ఔత్సాహిక మహిళల్నీ ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారామె.

తన సక్సెస్‌కు గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులు అందుకున్నారు అదితి. ‘మనసులోని తపనను ఎప్పటికీ వదిలిపెట్టద్దు. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటే ఎలాంటి రంగంలోనైనా రాణించచ్చు..’ అంటూ తన మాటలతోనూ ఈతరం మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారీ హిమాలయన్‌ ఆంత్రప్రెన్యూర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్