ఆ వ్యసనాలను ఓడించి.. ప్రపంచ రికార్డులు సాధించింది!

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతికూల సమయం ఉంటుంది.. దాన్ని అధిగమించినప్పుడే జీవితాన్ని గెలవగలం.

Published : 25 Apr 2022 18:51 IST

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతికూల సమయం ఉంటుంది.. దాన్ని అధిగమించినప్పుడే జీవితాన్ని గెలవగలం. దక్షిణాఫ్రికాకు చెందిన అంబర్‌ ఫిల్లరీ జీవితమూ ఇందుకు మినహాయింపు కాదు. పదిహేనేళ్ల ప్రాయంలోనే డిప్రెషన్‌తో ఆత్మహత్య ప్రయత్నాల దాకా వెళ్లిన ఆమె.. ఇప్పుడు ఐస్‌ స్విమ్మర్‌గా ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే ఆమె నమోదు చేసిన గిన్నిస్‌ రికార్డే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఎలాంటి డైవింగ్‌ సూట్‌, ఫ్లిప్పర్స్‌ ధరించకుండా.. ఊపిరి బిగబట్టి మంచు నీటిలో అత్యంత ఎక్కువ దూరం ఈత కొట్టిన మహిళా స్విమ్మర్‌గా చరిత్రకెక్కిందామె. ఇలాంటి రికార్డులు ఆమెకు కొత్త కాదు.. గతంలోనూ పలు రికార్డులు ఆమె సాహసానికి దాసోహమన్నాయి. మరి, ఒకప్పుడు తన వ్యసనాలతో జీవితాన్నే ముగించుకోవాలనుకున్న ఫిల్లరీ.. ఈతలో తారస్థాయికి ఎలా చేరుకోగలిగింది..? తెలుసుకోవాలంటే ఆమె కథ చదవాల్సిందే!

మనకుండే కొన్ని ఆరోగ్య సమస్యలే మనల్ని పెడదోవ పట్టిస్తుంటాయి. కొన్ని వ్యసనాలకు మనల్ని బానిస చేస్తుంటాయి. అంబర్‌ ఫిల్లరీ కూడా ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొంది. పదిహేనేళ్ల ప్రాయంలో అనొరెక్సియా, బులీమియా, డిప్రెషన్‌తో సతమతమైన ఆమె.. కొన్నేళ్ల పాటు రీహ్యాబిలిటేషన్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. వీటి నుంచి బయటపడడానికి ఒకానొక దశలో తాగుడుకు బానిసైంది.. మోతాదుకు మించి మందులు వేసుకునేది.. క్షణికావేశంలో కొన్ని సార్లు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశానంటోందామె.


మోడువారిన జీవితంలో..!

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే తన భర్త లియోనార్డ్‌ను కలిసింది ఫిల్లరీ. ఇద్దరి మధ్య అనుబంధం సజావుగానే సాగినా.. తాగుడుకు బానిసైన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో కొన్నాళ్లకు కన్నుమూశాడు. దీంతో ఆమె జీవితం మరింత అంధకారంలోకి వెళ్లిపోయింది. ఈ డిప్రెషన్‌లోనే కొన్నేళ్లు జీవచ్ఛవంలా రోజులు గడిపిన ఆమె.. ఎలాగైనా తన జీవితంలో అలుముకున్న చీకట్లను తొలగించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ప్రపంచయాత్రకు పూనుకుంది. ఒకరకంగా ఇదే తనలోని తపనేంటో తెలుసుకునేలా చేసిందని చెబుతోంది ఫిల్లరీ.

‘ఆరోగ్య సమస్యలతో వివిధ వ్యసనాలకు బానిసై కుంగుబాటుతో ఉన్న నా జీవితంలోకి నా భర్త లియోనార్డ్‌ వెలుగులా ప్రవేశించారు. అయితే కొన్నాళ్లకే ఆయన పోవడంతో మళ్లీ నా జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. అయితే ఈసారి ప్రతికూలతల్ని ఎదుర్కోవాలనుకోలేదు. ఏదేమైనా నా జీవితానికి ఓ అర్థాన్ని వెతుక్కోవాలనుకున్నా. ఇందులో భాగంగానే ప్రపంచయాత్ర చేపట్టా. వివిధ దేశాలు తిరిగా. ఈ క్రమంలోనే ఫ్రీ-డైవింగ్‌ (ఊపిరి బిగబట్టి ఈత కొట్టడం) నాకు పరిచయమైంది. తక్కువ రోజుల్లోనే ఈ సాహస క్రీడ నా మనసుకెంతో దగ్గరైంది..’ అని చెబుతోందీ ఆఫ్రికన్‌ స్విమ్మర్‌.


నీటితో నాది ప్రత్యేకమైన బంధం!

ప్రతి ఒక్కరి జీవితానికి ఓ పరమార్థం ఉన్నట్లే.. జీవితంలోని ప్రతికూలతల్ని ఎదిరించి ప్రస్తుతం తాను జీవించి ఉన్నానంటే అది ఫ్రీ-డైవింగ్‌ కోసమేనేమో అంటోంది ఫిల్లరీ. నీటితో ఒక రకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్న ఆమె.. ఈత కొడుతున్నంత సేపు చెప్పలేనంత ఆనందానికి, ఉద్వేగానికి గురవుతానంటోంది. ఇలా ఈ సాహస క్రీడపై నానాటికీ మక్కువ పెంచుకున్న ఫిల్లరీ.. ఇందులో రాణించడానికి స్థానిక స్విమ్మింగ్‌ పూల్‌లో ఊపిరి బిగబట్టి ఎక్కువ సేపు ఈత కొట్టేలా శిక్షణ తీసుకుంది.. ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో వ్యాయామాలు చేసింది.. శరీరం ఫ్లెక్సిబుల్‌గా, చురుగ్గా కదలడానికి పరుగును తన రొటీన్‌లో భాగం చేసుకుంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే బద్దలు కొట్టాలన్నట్లు శిక్షణ అనంతరం ఏకంగా గిన్నిస్‌ బుక్‌ ప్రపంచ రికార్డుకే గురి పెట్టిందీ స్విమ్మింగ్‌ లవర్‌.

ఓడినా.. పట్టు వదలక..!

ఓటమే గెలుపుకి తొలి మెట్టు అనే సిద్ధాంతాన్ని నమ్ముతానంటోంది ఫిల్లరీ. అందుకే 2019లో ప్రపంచ రికార్డు కోసం విఫలయత్నం చేసినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకే సాగింది.. కానీ వెనకడుగు మాత్రం వేయలేదామె. ఈసారి పట్టుబట్టి ప్రయత్నించింది.. ఫలితంగా 2020లో నార్వేలో నిర్వహించిన ఫ్రీ-డైవింగ్‌ ఈవెంట్లో మంచు అడుగున 70 మీటర్ల (229.6 అడుగులు) పాటు ఈది.. ఫిన్స్‌ (ఈతకొట్టేటప్పుడు కాళ్లకు ధరించే ఫ్లిప్పర్స్‌), డైవింగ్‌ సూట్‌ ధరించకుండా అత్యంత దూరం ఊపిరి బిగబట్టి ఈత కొట్టిన మహిళగా తొలిసారి గిన్నిస్‌ రికార్డు సృష్టించింది ఫిల్లరీ. ఇక ఇటీవలే మరో సందర్భంలో ఇదే తరహాలో 90 మీటర్లు (295 అడుగుల 3 అంగుళాలు) ఈత కొట్టి.. తన గత రికార్డును తానే బద్దలుకొట్టింది. అంతేకాదు.. నీటి అడుగున ఊపిరి బిగబట్టి అత్యంత దూరం నడిచిన మహిళగానూ మరో రికార్డు ఫిల్లరీ పేరిట ఉంది. ఇటీవలే ఆమె సాధించిన కొత్త రికార్డుకు సంబంధించిన అంశాలను గిన్నిస్‌ బుక్‌ వారు తాజాగా తమ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తూ.. ‘జీవితంలోని ప్రతికూలతల్ని ఎదుర్కొనే వారందరికీ ఫిల్లరీనే ఆదర్శం!’ అంటూ ఆమె ప్రతిభను కొనియాడారు.


ఇలా ఓవైపు ఫ్రీ-డైవింగ్‌ సాహస క్రీడలో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోన్న ఫిల్లరీ.. మరోవైపు మోటివేషనల్‌ స్పీకర్‌గానూ కొనసాగుతోంది. తనలా జీవితంలో ప్రతికూలతల్ని ఎదుర్కొంటోన్న ఎంతోమందిని తన మాటలతో ఉత్సాహపరుస్తోంది. వారి జీవితానికి ఓ పరమార్థం చూపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్