ఆమె ఇల్లే ఓ గ్రంథాలయం!

అకౌంట్‌లో డబ్బు కాస్త ఎక్కువగా కనిపిస్తే.. దుస్తులు, గ్యాడ్జెట్స్‌.. వంటి వాటిపైన వెచ్చిస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన క్యాత్లీన్‌ నీల్‌ గేర్‌ అనే రచయిత్రి మాత్రం ఇందుకు భిన్నం. ఇలాంటి విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయడం వృథా అంటోందామె. అందుకే పెద్ద మొత్తంలో పొదుపు చేసుకున్న....

Updated : 21 Feb 2023 16:03 IST

(Photos: Twitter)

అకౌంట్‌లో డబ్బు కాస్త ఎక్కువగా కనిపిస్తే.. దుస్తులు, గ్యాడ్జెట్స్‌.. వంటి వాటిపైన వెచ్చిస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన క్యాత్లీన్‌ నీల్‌ గేర్‌ అనే రచయిత్రి మాత్రం ఇందుకు భిన్నం. ఇలాంటి విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయడం వృథా అంటోందామె. అందుకే పెద్ద మొత్తంలో పొదుపు చేసుకున్న డబ్బుతో, తన భర్తతో కలిసి ఇంట్లోనే ఓ పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసింది. పదులు, వందలు కాదు.. వేల కొద్దీ పుస్తకాల్ని తన వ్యక్తిగత లైబ్రరీలో భాగం చేసింది. అరల్లో అందంగా పేర్చిన వేలాది పుస్తకాలతో.. అచ్చం బయటి గ్రంథాలయాన్ని తలపిస్తోన్న తన లైబ్రరీ ఫొటోను ఇటీవలే ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిందామె. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ఒక్క రోజైనా ఆ గ్రంథాలయంలో గడపాల’ని ఉవ్విళ్లూరుతున్నారు. పుస్తకాలపై తనకున్న అనిర్వచనీయమైన ప్రేమే తనతో గ్రంథాలయం ఏర్పాటుచేయించిందంటోన్న క్యాత్లీన్‌ గురించి, ఆమె గ్రంథాలయం గురించి కొన్ని విశేషాలు మీకోసం..!

క్యాత్లీన్‌.. అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత్రి, పురావస్తు శాస్త్రవేత్త. క్యాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన ఆమె.. క్యాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తిచేసింది. ఆపై జెరూసలెంలోని హెబ్రూ యూనివర్సిటీలో పురావస్తు శాస్త్ర విభాగంలో కొన్నాళ్ల పాటు పనిచేసింది. తాను డిగ్రీ చదివిన క్యాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్న క్యాత్లీన్‌.. అమెరికన్‌ ఇండియన్ల చరిత్రపై పీహెచ్‌డీ చేసింది.

పర్యటనల స్ఫూర్తితో..!

క్యాత్లీన్‌ తల్లిదండ్రులిద్దరికీ రచనల్లో అనుభవం ఉంది. ఆమె తండ్రి 50కి పైగా చిన్న చిన్న కథలు రాశారు.. మరోవైపు తల్లీ స్థానిక వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా విధులు నిర్వర్తించింది. ఇలా వీరిద్దరి స్ఫూర్తితో క్యాత్లీన్‌కూ చిన్న వయసు నుంచే రచనలంటే ఆసక్తి పెరిగింది. ఇక సెలవు రోజుల్లో, ఖాళీ సమయాల్లో తన పేరెంట్స్‌ ఆమెను పురావస్తు తవ్వకాలు జరిపే ప్రదేశాలకు, మ్యూజియంలకు ఎక్కువగా తీసుకెళ్లేవారట! ఇలాంటి పర్యటనలు తనకు మరపురాని మధురానుభూతుల్ని మిగల్చడమే కాదు.. పదేళ్ల వయసులోనే పురావస్తు తవ్వకాల్లో భాగమయ్యే అరుదైన అవకాశాన్నీ అందించాయని చెబుతున్నారు క్యాత్లీన్‌. ‘నాటి కాలానికి చెందిన మనుషులు, వాళ్ల చరిత్ర గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత నాలో చిన్ననాడే మొదలైంది. ఇక హెబ్రూ యూనివర్సిటీలో పురావస్తు శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నప్పుడు పురావస్తు శాస్త్రానికి సంబంధించి కొన్ని పుస్తకాలు చదివాను. ఇక వ్యోమింగ్‌, క్యాన్సస్, నెబ్రస్కా.. తదితర రాష్ట్రాల్లో అమెరికా సాంస్కృతిక వారసత్వంపై నేను చేసిన పరిశోధనలకు గుర్తింపుగా రెండుసార్లు ప్రత్యేక సాఫల్య పురస్కారం అందుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చారామె.

రచయిత్రిగా పేరుప్రఖ్యాతులు..!

పురావస్తు శాస్త్ర పరిశోధనలు, దానికి సంబంధించిన పుస్తకాలు చదివే క్రమంలో రచనలపై మరింత పట్టు పెంచుకున్న క్యాత్లీన్.. ఆ తర్వాతి కాలంలో తన పూర్తి సమయాన్ని రచనలకు కేటాయించారు. ఈ క్రమంలో పురావస్తు శాస్త్రం, చరిత్ర.. వంటి విభాగాల్లో వందలాది పుస్తకాలు రాశారు. వీటితో పాటు పిల్లల పుస్తకాలు, కాల్పనిక కథలు, ఫ్యాంటసీ కథలు.. వంటివీ రచించారామె. ఆమె భర్త మైఖేల్‌ గేర్‌ కూడా పురావస్తు శాస్త్రవేత్త, నవలా రచయిత. ఆయనతో కలిసి మరికొన్ని పుస్తకాలు రచించారు క్యాత్లీన్‌. వీటిలో ఇద్దరూ కలిసి రాసిన 50కి పైగా నవలలూ ఉన్నాయి. ఇలా తన రచనలతో ఆ దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రతిబింబిస్తూ.. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన రచయిత్రిగా పేరుతెచ్చుకున్నారామె. రచనలు, పురావస్తు శాస్త్ర విభాగాల్లో తన సేవల్ని గుర్తించిన యూఎస్‌ కాంగ్రెస్‌ క్యాత్లీన్‌ను.. ‘స్పెషల్ కంగ్రెషనల్‌ రికగ్నిషన్’ సర్టిఫికెట్ అందించి గౌరవించింది. ఇక తాను రాసిన ‘మేజ్‌ మాస్టర్‌’ అనే పుస్తకం ఉత్తమ సైన్స్‌ ఫిక్షన్‌ నవలగా ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ అవార్డు’ గెలుచుకుంది. మరోవైపు ఈ దంపతులిద్దరూ కలిసి రచించిన నవలలు వారికి మరిన్ని ఉన్నత పురస్కారాలను తెచ్చిపెట్టాయి.

పే....ద్ద లైబ్రరీ!

పుస్తకాలు రాయడమే కాదు.. చదవడమన్నా క్యాత్లీన్‌, మైఖేల్‌ దంపతులకు మక్కువ ఎక్కువే! వాళ్లు ఇంట్లో ఏర్పాటుచేసుకున్న గ్రంథాలయమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సాధారణంగా పుస్తకాలు చదవడం ఆసక్తి ఉన్న వారు ఇంట్లో చిన్నపాటి ప్రదేశంలో ఓ మినీ లైబ్రరీని ఏర్పాటుచేసుకుంటుంటారు. కానీ బయటి గ్రంథాలయమంత పెద్ద గ్రంథాలయాన్ని తమ ఇంట్లో ఏర్పాటుచేసుకున్నారు గేర్‌ దంపతులు. తాము సంపాదించిన డబ్బును విలాసాల కోసం ఖర్చు చేయడం వృథా అని భావించే వీళ్లు.. ఆ డబ్బును ఈ లైబ్రరీ నిర్మాణం కోసం వెచ్చించారు. పదులు, వందలు కాదు.. ఏకంగా 32 వేల పైచిలుకు పుస్తకాలను ఈ గ్రంథాలయంలో.. అందమైన అరల్లో అమర్చిందీ జంట. ఇందులో వాళ్లు రాసిన పుస్తకాలతో పాటు.. తామిద్దరూ ఇష్టపడి సేకరించిన బుక్స్‌ కూడా ఉన్నాయి. ఇలా తమ అభిరుచులకు అనుగుణంగా ఏర్పాటుచేసుకున్న లైబ్రరీకి సంబంధించిన ఫొటోల్ని ఇటీవలే సోషల్‌ మీడియాలో పంచుకున్నారు క్యాత్లీన్. ఇంత పెద్ద గ్రంథాలయాన్ని చూసిన నెటిజన్లు.. ‘అద్భుతంగా ఉంది.. ఇలాంటి లైబ్రరీలో ఒక్క రోజైనా గడపాలనిపిస్తోంది..’, ‘బ్యూటిఫుల్‌ లైబ్రరీ’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ పే....ద్ద లైబ్రరీ కాస్తా వైరల్‌గా మారింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్