ఫుడ్ డెలివరీ గర్ల్‌గా మారి తనే ఇంటికి పెద్ద కొడుకైంది!

డాక్టర్‌ కావాలనుకున్న ఆమె ఆశయానికి కరోనా అడ్డుకట్ట వేసింది. ఉన్నత చదువులు చదవాల్సింది పోయి ఉపాధి కోసం వెంపర్లాడేలా చేసింది. కుటుంబ పోషణ కోసం ఫుడ్ డెలివరీ గర్ల్‌గా మారి తనే ఇంటికి పెద్ద కొడుకు అయింది.

Published : 15 Jun 2021 14:33 IST

Image for Representation

డాక్టర్‌ కావాలనుకున్న ఆమె ఆశయానికి కరోనా అడ్డుకట్ట వేసింది. ఉన్నత చదువులు చదవాల్సింది పోయి ఉపాధి కోసం వెంపర్లాడేలా చేసింది. కుటుంబ పోషణ కోసం ఫుడ్ డెలివరీ గర్ల్‌గా మారి తనే ఇంటికి పెద్ద కొడుకు అయింది.
ఆశయాన్ని పక్కనపెట్టి!
కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లాక్‌డౌన్‌తో ఎంతోమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. దీంతో చాలామంది విద్యార్థులు తమ చదువులను పక్కనపెట్టి పనుల్లోకి వెళుతున్నారు. తమ కుటుంబానికి ఆర్థిక చేయూతనివ్వడం కోసం వివిధ రకాల ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒడిశాలోని కటక్‌కు చెందిన 18 ఏళ్ల విష్ణుప్రియ స్వెయిన్‌ది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం 12వ తరగతి చదువుతోన్న ఆమె ఎలాగైనా డాక్టర్‌ కావాలని కలలు కంది. కానీ కరోనా కారణంగా.. డ్రైవర్‌గా పనిచేస్తోన్న తన తండ్రి ఉద్యోగం పోవడం, పూట గడవడం కూడా కష్టం కావడంతో తన ఆశయాన్ని పక్కన పెట్టేసింది. ముగ్గురు కూతుళ్లలో పెద్దమ్మాయి అయిన ఆమె కుటుంబ బాధ్యతలను తన భుజాలకెత్తుకుంది.


తండ్రి బైక్‌ నడపడం నేర్చుకుని!
ఈ క్రమంలో తన తండ్రి దగ్గరున్న బైక్‌ నడపడం నేర్చుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత జొమాటో ఫుడ్‌ డెలివరీ కంపెనీలో డెలివరీ ఏజెంట్‌గా చేరింది. కటక్‌ జిల్లాలో జొమాటోలో పనిచేస్తోన్న ఏకైక ఫుడ్‌ డెలివరీ గర్ల్ తనే కావడం విశేషం. 
‘ప్రస్తుతం నేను ఇంటర్‌ చదువుతున్నాను. డాక్టర్‌గా పేదలకు సేవ చేయాలన్నది నా కల. అయితే కరోనా కారణంగా మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అందుకే ఇలా డెలివరీ గర్ల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. నాకు తెలిసి ఏ పనీ తక్కువ కాదు. కష్టాల్లో ఉన్న నా కుటుంబానికి ఆర్థికంగా తోడు నిలవాలనే ఈ ప్రయత్నమంతా. అమ్మానాన్న ఆనందంగా ఉండాలి. నా ఇద్దరు చెల్లెళ్ల చదువులు కూడా కొనసాగాలి. ప్రస్తుతానికి ఇవే నా లక్ష్యాలు’ అంటోంది విష్ణుప్రియ.
నైట్‌షిఫ్టుల్లో కష్టమే కానీ..!
నిత్యం బైక్‌పై తెలియని అడ్రస్‌లు వెతుక్కుంటూ ప్రయాణించడం, ప్రత్యేకించి అర్ధరాత్రి వేళల్లో ఫుడ్‌ డెలివరీలు చేయాలంటే అబ్బాయిలే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటిది పగలు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతూనే రాత్రివేళల్లో ఫుడ్‌ డెలివరీ గర్ల్‌గా విధులు నిర్వర్తిస్తోంది విష్ణుప్రియ.


‘వీలైనంత వరకు పగటి వేళల్లోనే డ్యూటీకి వెళతాను. అయితే అప్పుడప్పుడూ ఆన్‌లైన్‌ క్లాసులుండడంతో నైట్‌షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తోంది. రాత్రివేళల్లో విధులు అంటే కొంచెం కష్టంగానే ఉంటోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదకర సంఘటనలు ఎదురుకాలేదు’ అని చెబుతోందీ డేరింగ్‌ గర్ల్.
ఆమె నా పెద్ద కొడుకు!
ఇలా ఇంటి బాధ్యతలను భుజాలకెత్తుకున్న విష్ణుప్రియకు టైలరింగ్‌ పనులు చేస్తూ తోడుగా నిలుస్తోంది ఆమె తల్లి. ‘మాకు ముగ్గురూ ఆడపిల్లలే. ఇంతకుముందు నా పెద్ద కూతురు పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. అంతో ఇంతో ఆదాయం వచ్చేది. కానీ కరోనా కారణంగా పిల్లలు కూడా రావడం మానేశారు. దీంతో ఇలా ఫుడ్‌ డెలివరీ గర్ల్‌గా చేరాల్సి వచ్చింది. ఇలా కూతురే కొడుకులా ఇంటి బాధ్యతల్ని మోస్తోంది. అందుకే తనని మా పెద్ద కొడుకులా భావిస్తున్నాం’ అని ఆ మాతృమూర్తి చెప్పుకొచ్చింది.


మహిళల సంఖ్య పెరుగుతోంది!
సాధారణంగా ఫుడ్ డెలివరీ చేసే వారిలో మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ విధులు నిర్వర్తిస్తున్న అమ్మాయిల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. విష్ణుప్రియలా మరెంతోమంది అమ్మాయిలు, మహిళలు స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థల్లో డెలివరీ గర్ల్స్‌గా చేరుతున్నారు. ఈ క్రమంలో ఈ రంగంలో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పచ్చు. ఒక నివేదిక ప్రకారం 2018 నాటికి దేశ వ్యాప్తంగా సుమారు 40 వేల మంది మహిళలు వివిధ ఫుడ్‌ డెలివరీ సంస్థల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్నారు. 2019 జూన్‌ చివరి నాటికి ఆ సంఖ్య 67,900కు చేరుకుంది. కరోనా పరిస్థితులు రాకపోయి ఉంటే 2021 నాటికి ఈ సంఖ్య 75 వేలకు చేరేదని ఆ రిపోర్టు అంచనా వేసింది. ౯-౫ జాబ్స్‌తో పోల్చితే పని వేళల్లో ఎక్కువ సౌలభ్యం, మంచి జీతం ఉండడంతో ఎక్కువమంది మహిళలు ఈ ఉద్యోగాలను ఎంచుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్