‘లోకనాయకుడి’ని స్టైలిష్‌గా చూపిస్తోంది!

తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైంది. తమిళ బుల్లితెరతో పాటు వెండితెరపై సత్తా చాటుతోన్న మొత్తం 18 మంది నటీనటులు, సింగర్లు, యాంకర్లు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే వీరందరి కన్నా కమలే ఈ గ్రాండ్‌ ప్రీమియర్‌ షోలో ప్రత్యేకాకర్షణగా నిలిచారు.

Published : 12 Oct 2021 18:34 IST

(Photo: Instagram)

తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైంది. తమిళ బుల్లితెరతో పాటు వెండితెరపై సత్తా చాటుతోన్న మొత్తం 18 మంది నటీనటులు, సింగర్లు, యాంకర్లు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే వీరందరి కన్నా కమలే ఈ గ్రాండ్‌ ప్రీమియర్‌ షోలో ప్రత్యేకాకర్షణగా నిలిచారు. స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇలా ఆరుపదుల వయసులోనూ లోకనాయకుడు ఇంత అందంగా, స్టైలిష్‌గా కనిపించడానికి కారణమెవరో తెలుసా?.. ప్రముఖ సెలబ్రిటీ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అమృతా రామ్.

ఆ రహస్యం తనే!

కేవలం ఈ సీజన్‌లోనే కాదు... గత సీజన్లలోనూ కమల్‌ తన ఆహార్యంతో ఆకట్టుకున్నారు. దుస్తులు, గెటప్‌ల పరంగా ఒక్కో సీజన్‌కు ఒక్కో స్టైల్‌ను ఫాలో అవుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇలా బిగ్‌బాస్‌లోనే కాదు గత కొన్నేళ్లుగా కమల్‌ నటిస్తోన్న సినిమాలన్నింటికీ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది అమృత. సినిమా కథలకు తగ్గట్టుగా మన లోకనాయకుడిని ముస్తాబు చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటోంది. కేవలం కమల్‌నే కాదు ఆయన అందాల తనయ శ్రుతి హాసన్‌, నివేదా పేతురాజ్‌, ఐశ్వర్యా రాజేష్‌, నిత్యామేనన్‌, రాధిక, ధనుష్‌ తదితర ప్రముఖ నటీనటుల కాస్ట్యూమ్స్‌ బాధ్యతలను కూడా అమృతే దగ్గరుండి చూసుకుంటోంది.

యాంకర్‌ టు సెలబ్రిటీ కాస్ట్యూమ్‌ డిజైనర్!

చెన్నైకు చెందిన అమృత కెరీర్‌ ప్రారంభంలో కొన్ని టీవీ షోలు, ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరించింది. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో న్యూయార్క్‌ వెళ్లి ‘ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ’ లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసింది. కోర్సు పూర్తయిన వెంటనే ఇండియాకు తిరిగొచ్చింది. 2012లో ‘మూగమూడి (తెలుగులో మాస్క్‌)’ సినిమాతో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మొదటిసారి తన అదృష్టం పరీక్షించుకుంది. సూపర్‌ హీరో డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపుతో పాటు మరిన్ని సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. తెలుగులో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాలకు పని చేసింది. 2018లో విడుదలైన ‘వడ చెన్నై’ సినిమా అమృతను మరో మెట్టు ఎక్కించింది. 1977-2007మధ్య చెన్నైలో జరిగిన అండర్‌ వరల్డ్‌ పాలిటిక్స్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా హీరో ధనుష్‌కు ఆమె డిజైన్‌ చేసిన కాస్ట్యూమ్స్‌ పలువురి మెప్పు పొందాయి. ‘కౌన్‌ బనేగా కరోడ్పతి’ స్ఫూర్తితో కొన్ని నెలల క్రితం తమిళంలో ‘కోటీశ్వరి‘ అనే ప్రోగ్రాం ప్రారంభమైంది. సీనియర్ నటి హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి కూడా అమృతే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది.

మార్పులు వద్దన్నారు!

2010లో జరిగిన ఓ కార్యక్రమం కోసం కమల్‌కు మొదటిసారిగా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసింది అమృత. తనను అందంగా, స్టైలిష్‌గా చూపించడంలో అమృత పడిన శ్రమ లోకనాయకుడిని మెప్పించింది. ఆ తర్వాత తన సినిమా ఫంక్షన్లు, టీవీ షోలకు సంబంధించి తన కాస్ట్యూమ్‌ బాధ్యతలన్నీ ఆమెకే అప్పగించాడు.

‘నేను కమల్‌ సర్‌కు మొదటిసారి కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. అయితే నా పనిపై నాకు బాగా నమ్మకముంది. ఆయనకు ఏ లుక్‌ బాగుంటుందో, అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో నాకు బాగా అవగాహన ఉంది. అయితే ఎందుకైనా మంచిదని ముందుగానే ఆయనతో చర్చించాను. ఆహార్యంలో మార్పులేమైనా చేయాలా? అని అడిగాను. కానీ ఆయన నో చెప్పారు. ఇక ‘విశ్వరూపం 2’ సినిమా ప్రమోషన్ల కోసం నేను రూపొందించిన కాస్ట్యూమ్‌ కమల్‌ను బాగా ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీలోని పలువురి ప్రముఖులు ఫోన్‌ చేసి మరీ నన్ను అభినందించారు..’

అది నా అదృష్టం!

‘నేను కమల్ సర్‌తో నాలుగేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్నాను. ఈ క్రమంలోనే ఆయన కూతురు శ్రుతితో కూడా నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇలా సీనియర్, జూనియర్‌ హాసన్‌లతో కలిసి పనిచేయడం నాకు మాత్రమే దక్కిన గొప్ప అదృష్టం. ఈ తండ్రీ కూతుళ్లతో పనిచేయడం ఎంతో సులభం. ఎందుకంటే వారికేం కావాలో స్పష్టంగా తెలుసు. పని విషయంలో ఎంతో నిజాయతీగా వ్యవహరిస్తారు. నా వర్క్‌ బాగుంటే ఎలాంటి భేషజాలు లేకుండా మెచ్చుకుంటారు. వర్కవుట్‌ కాకపోతే ‘ఏం కాదులే’ అని వెన్నుతడతారు..’

‘బిగ్‌బాస్‌’ సవాళ్లతో కూడుకున్నది!

‘సినిమాలు, ఫంక్షన్లను పక్కన పెడితే ‘బిగ్‌బాస్‌’ లాంటి రియాలిటీ షోలకు పనిచేయడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఎందుకంటే ఇది ఒక రోజులో జరిగే ప్రోగ్రాం కాదు. కొన్ని వారాల పాటు జరుగుతూనే ఉంటుంది. అలా అని మళ్లీ మళ్లీ అవే స్టైల్స్‌ను రిపీట్‌ చేస్తే షోపై ఆసక్తి తగ్గుతుంది. అందుకే ప్రతివారం ఒక కొత్త స్టైల్‌ను పరిచయం చేస్తాం. దుస్తుల విషయంలో మరింత వైవిధ్యం పాటిస్తాం. గత బిగ్‌బాస్‌ సీజన్‌లో కమల్ ధరించిన ఖాదీ దుస్తులకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈసారి కూడా కమల్‌ ఖాదీ దుస్తులతోనే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే ట్రెండ్‌కు తగ్గట్టుగా అందులో చాలా మార్పులు చేశాం. ఇవి కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి..’

భారతీయ వస్త్రధారణకే ప్రాధాన్యం!

‘నేను అన్ని రకాల దుస్తులను ఇష్టపడతాను. కానీ భారతీయ వస్త్రధారణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే ఇండియన్‌ డ్రస్‌ కల్చర్‌లో ఉన్న వైవిధ్యం మరెక్కడా ఉండదు. వస్త్రధారణలో ఒక్కో రాష్ట్రం ఒక్కో సంప్రదాయం పాటిస్తుంది. ఇది నాకెంతో నచ్చుతుంది. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ‘ఫ్యాషన్‌ డిజైనింగ్‌’ ఒక వేదిక లాంటిది. అందులో నేను భాగమైనందుకు చాలా అదృష్టవంతురాలిని..’

కెమెరా ముందు వర్క్‌ చేయాలనుకుంటున్నా!

‘ప్రస్తుతం నా ప్రాజెక్ట్స్‌ విషయానికొస్తే... శ్రుతి హాసన్‌ ‘సలార్‌’తో పాటు నివేదా పేతురాజ్‌ నటిస్తోన్న ఓ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాను. అదేవిధంగా త్వరలోనే ఓ కొత్త ప్రాజెక్టుపై సంతకం చేయబోతున్నాను. అయితే అది దుస్తులు, డిజైనింగ్‌కి సంబంధించినది కాదు. ‘కెమెరాల ముందు చేసే పని. త్వరలోనే పూర్తి విషయాలు చెబుతా’ అంటోందీ ట్యాలెంటెడ్‌ స్టైలిస్ట్.

తమిళ సినిమాకు చెందిన నటుడు, కొరియోగ్రాఫర్‌ రామ్జీని వివాహం చేసుకుంది అమృత. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ బాధ్యతలతో పాటు తన భర్త నిర్వహిస్తోన్న ‘డ్యాన్స్‌ స్కూల్‌’ బాధ్యతలను కూడా ఆమె చూసుకుంటోంది. గతేడాది ‘ఇండియన్‌-2 (భారతీయుడు 2)’ సినిమా సెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న అమృత అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్