Updated : 01/12/2021 18:22 IST

HIV Survivor: ‘హెచ్‌ఐవీ’ ఉందని చెప్పుకోవడానికి అస్సలు సిగ్గుపడను!

(Image for Representation)

మందులు, మాకులకు లొంగని హెచ్‌ఐవీ సోకిందంటే ఇక జీవితం ముగిసినట్లే అనుకుంటారు.. ఇలాంటి జబ్బు తమకుందని నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని నాలుగ్గోడలకే పరిమితమవుతుంటారు. జీవితాన్ని భారంగా మోస్తూ నిస్సారంగా రోజులు గడుపుతుంటారు. కానీ ఎయిడ్స్‌ బారిన పడినా జీవితాన్ని ఆస్వాదించచ్చని, ఎంతోమంది రోగుల్లో బతుకు పట్ల ఆశ చిగురింపజేయచ్చని జార్ఖండ్‌కు చెందిన జ్యోతి ధవళే నిరూపిస్తోంది.

చిన్న వయసు నుంచే అడుగడుగునా కష్టాల కడలిని దాటుకుంటూ వచ్చిన ఆమె.. వైవాహిక బంధంలోనైనా సుఖపడాలని ఆశపడింది. కానీ శాడిస్ట్‌ భర్త వేధింపులకు తోడు.. వైద్యుల నిర్లక్ష్యం ఆమెను హెచ్‌ఐవీ బారిన పడేలా చేసింది. నిజానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కోలుకోవడం చాలా కష్టమైన విషయం.. కానీ తాను మాత్రం విధికి తలవంచాలనుకోలేదు. తనలాంటి ఎంతోమంది హెచ్‌ఐవీ బాధితుల్లో వెలుగు నింపాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే మోటివేషనల్‌ స్పీకర్‌గా, కౌన్సెలర్‌గా, హెచ్‌ఐవీ కమ్యూనిటీకి గ్లోబల్‌ అంబాసిడర్‌గా.. ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోన్న ఆమె.. తన కష్టాల కథను ఇలా మన ముందుంచింది.

‘నాకు హెచ్‌ఐవీ ఉందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా’.. ఇదీ నా ఇన్‌స్టాగ్రామ్‌ బయో! మీరు ధైర్యమనుకోండి.. మరేదైనా అనుకోండి.. నేను మాత్రం ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పుకోవడానికి అస్సలు మొహమాటపడను. బహుశా.. చిన్నతనం నుంచి నేను ఎదుర్కొన్న కష్టాలే నన్ను ఇంత పవర్‌ఫుల్‌గా మార్చాయేమో అనిపిస్తుంది.

*****

నేను పుట్టిపెరిగిందంతా జార్ఖండ్‌ రాంచీలోనే! నాన్న ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసేవారు.. అమ్మ గృహిణి. అందరు పిల్లలాగా నా బాల్యం అంత ఆనందంగా ఏమీ సాగలేదు. మూడేళ్లకే ప్రమాదవశాత్తూ వినికిడి శక్తిని కోల్పోయా. దాంతో నాన్నలాగే ఎయిర్‌ఫోర్స్‌లోకి వెళ్లాలన్న నా ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఆ తర్వాత అమ్మానాన్నలు విడిపోవడం నా జీవితంలో మరో కుదుపు. అలా అమ్మ ప్రేమకు దూరమైన నన్ను సవతి తల్లి అక్కున చేర్చుకుంటుందని ఆశపడ్డా. కానీ అదీ జరగలేదు. తన మాటలతో, చేష్టలతో నన్ను మరింత హింస పెట్టేది. నన్ను గదిలో బంధించి కడుపు మాడ్చేది. అలా ఆ సమయంలో మూడు పూటలా తిండికి కూడా నోచుకోలేకపోయా. ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడం తప్ప వేరే దారి లేని ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నాకు అండగా ఉన్న వారెవరైనా ఉన్నారంటే అది నా చెల్లెలే!

వినికిడి శక్తి కోల్పోయినా ఇతరుల లిప్‌ మూమెంట్‌ని బట్టి వాళ్ల మనోభావాలు, మాటల్ని అర్థం చేసుకోవడం నేర్చుకున్నా. ఎదుటి వారికి ఏదైనా చెప్పాలనిపిస్తే రాతపూర్వకంగా ఆ విషయం తెలియజేసేదాన్ని. ఎందుకంటే వినికిడి లోపం కారణంగా కొన్ని కొన్ని పదాలు సరిగ్గా పలకలేకపోయేదాన్ని. ఇక ఎలాగోలా స్కూలింగ్‌ అయితే పూర్తిచేశా.. కానీ పైచదువులకు మాత్రం నోచుకోలేదు. ఆ సమయంలోనే ఒకబ్బాయితో నాకు పరిచయమైంది. అందం, అణకువ కలిగిన వాడు.. ఇన్నాళ్లూ ప్రేమకు దూరమైన నాకు అనురాగాన్ని పంచిస్తాడనుకున్నా.. మనసిచ్చి మనువాడా. మా ప్రేమకు గుర్తుగా కొన్ని రోజుల్లోనే గర్భం కూడా ధరించాను. త్వరలోనే నేను అమ్మను కాబోతున్నానన్న ఈ ఆనందం నన్ను నిలువనివ్వలేదు. ఇదే విషయాన్ని నా భర్తతో పంచుకుందామని ఎంతో సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్లాను. కానీ మంచితనం అనే ముసుగు వేసుకున్న అతని కపట ప్రేమేంటో నాకు అప్పుడు అర్థమైంది.

*****

‘నాకు పిల్లలొద్దు.. అబార్షన్‌ చేయించుకో’ అన్నాడు. నేను కూడదన్నా బలవంతంగా నా కడుపు తీయించాడు. ఇలా ఒకసారి, రెండుసార్లు కాదు.. రెండేళ్లలో ఏకంగా మూడుసార్లు నాకు గర్భస్రావం చేయించాడు. దీనికి తోడు నన్ను కొట్టేవాడు.. తిట్టేవాడు. నాకు ఇష్టం లేకపోయినా ఎన్నో సార్లు నన్ను లైంగిక బానిసలా వాడుకున్నాడు. కనీసం గర్భ నిరోధక సాధనాలు వాడమన్నా తనకిష్టం లేదనేవాడు.. ఈ క్రమంలోనే నాలుగోసారి గర్భం ధరించాను.. ఈసారి మాత్రం అబార్షన్‌కి నేను అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఈ సమయంలో నాకు తెలిసిన ఓ పిడుగు లాంటి వార్త నన్ను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. గత అబార్షన్ల కారణంగా, రక్త మార్పిడి సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో నాకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. ఆ సమయంలో నా బెంగంతా నా కడుపులో ఉన్న బిడ్డ గురించే! కానీ ఆ దేవుడి దయ వల్ల పుట్టిన బాబుకు హెచ్‌ఐవీ నెగెటివ్‌ వచ్చింది. ఇక ఏ భర్త అయితే నాకు పిల్లలు వద్దు అన్నాడో.. అతనే నా బాబును తనకిచ్చేయమని బలవంతపెట్టాడు.. అంతేకాదు.. తనకున్న వివాహేతర సంబంధం వల్ల బలవంతంగా విడాకుల కాగితంపై నాతో సంతకం కూడా పెట్టించాడు.

అంతేకాదు.. కోర్టులో ఇరువైపులా వాదోపవాదాలు విని తుది తీర్పు చెప్పడం పద్ధతి. కానీ నా విషయంలో అదీ జరగలేదు. అసలు నావైపు కథేంటో వినకుండానే నాకు విడాకులు మంజూరయ్యాయి. దీనికి తోడు పుట్టిన బిడ్డకు దూరమయ్యానన్న బాధ ఓవైపైతే.. ప్రసవానంతర ఒత్తిడి మరోవైపు.. ఇలా ఈ రెండింటి నడుమ ఓ పెద్ద మానసిక సంఘర్షణనే ఎదుర్కొన్నా. ఈ సమయంలో ఆర్థికంగా నా కాళ్లపై నేను నిలబడేందుకు ఉద్యోగం వెతుక్కున్నా. ఇలా నా మానసిక సమస్యల నుంచి బయటపడే క్రమంలోనే వివేక్‌ నా జీవితంలోకొచ్చాడు. ఆన్‌లైన్‌ చాటింగ్‌లో తను నాకు పరిచయమయ్యాడు. నేను తనని ఓ స్నేహితుడిగానే చూశా. కానీ తను నాలో ఓ ప్రేమికురాలిని చూశానన్నాడు. నేను హెచ్‌ఐవీ బాధితురాలిని.. ప్రేమ పెళ్లీ ఇవన్నీ కుదరదన్నాను. అయినా తను వినలేదు. ఇలా సుమారు ఆరు నెలలు గడిచిపోయాయి. ఆఖరికి నేను కూడా తన ప్రేమలో పడక తప్పలేదు.

*****

సాధారణంగా హెచ్‌ఐవీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏ కుటుంబమూ ముందుకు రాదు. కానీ వివేక్‌ తన ఫ్యామిలీని ఒప్పించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. నిజానికి నా జీవితంలో ఏదైనా మంచి విషయం, సంతోషకరమైన సందర్భం ఉందంటే.. అది వివేక్‌ను పెళ్లి చేసుకోవడమే! ఇన్ని కష్టాల తర్వాత దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతి తను! ఇక వివాహం తర్వాత నా జీవితమే మారిపోయింది.. నాకంటూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకునే అవకాశం దొరికింది. ఇందులో భాగంగానే నేను ఎంచుకున్న ఏకైక లక్ష్యం.. నాలాంటి హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితుల్లో జీవితంపై ఆశ కల్పించాలని! ఎయిడ్స్‌ వ్యాధి పట్ల ఈ సమాజంలో ఉన్న మూసధోరణులు, అపోహలు తొలగించాలని! ఈ క్రమంలో వివేక్‌ కూడా నాకు తోడయ్యాడు. ఇలా 2015లో హెచ్‌ఐవీ యాక్టివిస్ట్‌గా నా ప్రస్థానం ప్రారంభమైంది.

ఇన్నేళ్ల కాలంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాను. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో వేదికలపై ఎయిడ్స్‌ అవగాహనకు సంబంధించిన అంశాలపై ప్రసంగించాను. ఎంతోమంది బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చాను. అంతేకాదు.. రచయిత్రిగా మారి పుస్తకాలు కూడా రాశాను. ప్రస్తుతం ‘The Well Project – HIV’ అనే స్వచ్ఛంద సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నా. నా కృషికి గుర్తింపుగా ‘కరమ్‌వీర్‌ చక్ర (పసిడి)’ పురస్కారం నన్ను వరించింది.

*****

శరీరంలో ఇంత పెద్ద అనారోగ్యం పెట్టుకొని బయటికి ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది అడుగుతుంటారు. ఇలాంటి వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఉన్నంతలో మనం ధైర్యంగా, సంతోషంగా ఉంటే ఎలాంటి అనారోగ్యమైనా, ఎంత పెద్ద బాధైనా తోక ముడవాల్సిందే! అందుకే ఆ ధైర్యాన్నే నా బలంగా మార్చుకున్నా. దాన్ని మరో నలుగురికి పంచుతూ, నాకు చేతనైనంత సహాయం చేస్తూ.. నాలాంటి ఎంతోమంది బాధితులకు అండగా నిలుస్తున్నా. ఈ జీవితానికి ఇంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది?!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని