అడుగడుగునా అవరోధాల్ని జయించి డాక్టరైంది!

‘కలలు కంటే సరిపోదు.. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని నిజం చేసుకునే శక్తిసామర్థ్యాలను కూడగట్టుకోవాలి..’ అంటుంటారు మేధావులు. ముంబయికి చెందిన డాక్టర్‌ రోషన్‌ జవ్వాద్‌ కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది. పెద్దయ్యాక డాక్టర్‌ కావాలనుకున్న ఆమె కలల్ని అనుకోని ప్రమాదం కూలదోసింది.

Updated : 21 Sep 2021 18:39 IST

(Image for Representation)

‘కలలు కంటే సరిపోదు.. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని నిజం చేసుకునే శక్తిసామర్థ్యాలను కూడగట్టుకోవాలి..’ అంటుంటారు మేధావులు. ముంబయికి చెందిన డాక్టర్‌ రోషన్‌ జవ్వాద్‌ కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది. పెద్దయ్యాక డాక్టర్‌ కావాలనుకున్న ఆమె కలల్ని అనుకోని ప్రమాదం కూలదోసింది. అంగవైకల్యం తన చదువుకు అడ్డుపడినా అలుపెరుగని పోరాటం సాగించింది. బోన్‌ ట్యూమర్‌ రూపంలో మరోసారి విధి తనను వంచించాలని చూసినా వెరవలేదామె. ఇలా ఎన్నో అవరోధాలను ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగిన రోషన్‌ ఇటీవలే ఎండీ (డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌) పట్టా అందుకుంది. తన కలల తీరం చేరుకుంది. ఈ నేపథ్యంలో పేదల సంక్షేమమే తన ధ్యేయమంటోన్న ఈ ధీర స్ఫూర్తిదాయక జీవితాన్ని ఓసారి తరచి చూద్దాం..!

రోషన్‌ జవ్వాద్‌ షేక్‌.. కూరగాయల వ్యాపారం చేసే కుటుంబంలో పుట్టి పెరిగింది. తన తల్లిదండ్రులకు నలుగురు సంతానంలో ఒకరైన ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే! వాళ్లుండేది కూడా ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో ఓ చిన్న అద్దె ఇంట్లో! అయినా డాక్టర్‌ చదవాలన్న పెద్ద కోరికను చిన్నతనంలోనే తన మనసులో నింపుకుంది రోషన్‌. అందుకు తగినట్లుగానే స్కూల్‌ దశ నుంచే చదువులో మేటిగా రాణించేది. ఇలా తన కలల తీరంవైపు సాగిపోతోన్న ఈ ముంబయి అమ్మాయిని చూసి విధి ఓర్వలేకపోయింది. ఓ భయంకరమైన ప్రమాదం రూపంలో పగబట్టింది.

ప్రమాదంలో కాళ్లు కోల్పోయినా..!

పదో తరగతిలో 92.2 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రోషన్‌.. ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాయడానికి తన స్నేహితులతో కలిసి బాంద్రాకు వెళ్లింది. అయితే పరీక్ష ముగించుకొని రైలులో తిరుగు ప్రయాణమైన ఆమె.. ప్రమాదవశాత్తూ రైలులోంచి కింద పడిపోయింది. దీంతో రెండు కాళ్లను కోల్పోయింది. ఇక అక్కడ్నుంచి ఆమె కలల ప్రయాణంలో అడుగడుగునా కష్టాలే ఎదురొచ్చాయి. ఇంటర్మీడియట్‌ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి.. ఎంబీబీఎస్‌ ప్రవేశ పరీక్షలోనూ ఉత్తీర్ణురాలైంది. అయితే అంగవైకల్యం ఉందన్న నెపంతో సీటు ఇవ్వడానికి చాలా కళాశాలలు నిరాకరించాయి. నిజానికి గరిష్టంగా 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు మెడిసిన్‌ చదవడానికి అర్హులు. కానీ 86 శాతం వైకల్యంతో సీటు సంపాదించలేకపోయిన ఆమె.. ఎలాగైనా సీటు దక్కించుకోవడానికి ఓ పెద్ద న్యాయ పోరాటమే చేశానంటోంది.

న్యాయ పోరాటం చేశా!

‘డాక్టర్‌ కావాలనేది నా కల. ప్రమాదం కారణంగా అది కలగానే మిగిలిపోకూడదనుకున్నా. అందుకే నా వైకల్యం కారణంగా ఏ కళాశాలా నాకు సీటివ్వడానికి నిరాకరించినా నా ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. న్యాయ పోరాటం చేసైనా సీటు దక్కించుకోవాలని ముంబయి హైకోర్టును ఆశ్రయించా. ఈ క్రమంలో కోర్టు చుట్టూ పలుమార్లు తిరగాల్సి వచ్చింది. అయినా నిరాశ చెందలేదు. న్యాయస్థానం తీర్పుతో దీనికి ప్రతిఫలం దక్కింది. ఎట్టకేలకు నాకు సీటు లభించింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు..’ అంటూ చెప్పుకొచ్చింది రోషన్‌.

మళ్లీ అదే చేదు అనుభవం!

GS Medical College (KEM Hospital) నుంచి 2016లో ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ క్లాస్‌లో పాసైన రోషన్‌.. 2018లో పీజీ మెడికల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌లోనూ ఉత్తీర్ణురాలై అదే కళాశాలలో పాథాలజీ విభాగంలో ఎండీ (డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌) సీటు సంపాదించింది. అయితే ఈసారీ సీటు విషయంలో తొలిసారి ఎదురైన చేదు అనుభవమే పునరావృతమైందంటోందీ ముంబయి అమ్మాయి. ‘ఎండీ అడ్మిషన్‌ తీసుకునే క్రమంలోనూ 86 శాతం అంగవైకల్యం కారణంగా తొలిసారి ఎదురైన చేదు అనుభవమే మళ్లీ ఎదురైంది. అయితే వికలాంగుల అంగవైకల్యం గరిష్ట పరిమితి పెంచారని తెలుసుకొని ప్రవేశం కోసం మళ్లీ అప్లై చేశా. ఈసారి సీటు దక్కింది. ఇక ఎండీ రెండో ఏడాది చదువుతున్నప్పుడే బోన్‌ ట్యూమర్‌ రూపంలో విధి మరోసారి నన్ను చిన్న చూపు చూసింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కోర్సు పూర్తి చేయాలని ముందే గట్టిగా నిర్ణయించుకున్నా. ఇదే ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగా. ఈ క్రమంలో మా ఫ్యాకల్టీ, సహచరులు నాకు వెన్నుదన్నుగా నిలిచారు. నా కష్టం, వాళ్ల అండతో ఇటీవలే పాథాలజీ విభాగంలో ఎండీ పూర్తిచేశా. నాలుగో ర్యాంకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది..’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది రోషన్‌.

పేదల కోసం ఆ రెండూ..!

భవిష్యత్తులో ప్రభుత్వ డాక్టర్‌గా స్థిరపడి పేదలకు ఉచితంగా సేవ చేయడమే తన ధ్యేయమంటోందీ డాక్టరమ్మ. ‘గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు సుదూరంలో ఉన్నాయి. ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు సైతం వారికి అందుబాటులో లేవు. ఒకవేళ అత్యవసరంగా పరీక్షలు చేయించుకోవాలనుకున్నా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అందుకే వాళ్ల వైద్య పరీక్షల కోసం ఈ రెండూ ప్రారంభించాలని సంకల్పించుకున్నా. అయితే ఇందుకోసం ఆర్థికంగా కొన్ని నిధులు సమకూర్చుకోవాలి. ఆర్థిక సహాయం చేయడానికి ఎవరైనా ముందుకొస్తే వెంటనే వీటిని ప్రారంభించి పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స చేయడం ప్రారంభిస్తా..’ అంటోంది రోషన్‌.

తన విజయాలకు గుర్తుగా ‘The Shoor Veer Award’, ‘Bharat Prerna Award’.. వంటి పురస్కారాలు అందుకుంది రోషన్‌.

‘ఏదైనా అనుకుంటే.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అది చేసి తీరాలి.. భయపడి వెనకడుగు వేయకూడదు..’ అంటోన్న రోషన్‌ జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం! మరి, తన భవిష్యత్తు కల కూడా త్వరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!
ఆల్‌ ది బెస్ట్‌ రోషన్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్