Summer Tips: అక్వేరియంను ఇలా చల్లగా ఉంచుదాం!

ఇంటి అలంకరణలో భాగంగా అక్వేరియంలను ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. అయితే వీటిని అమర్చుకోవడంతోనే సరిపోదు.. వాతావరణానికి తగినట్లుగా మెయింటెయిన్‌ చేయడం కూడా ముఖ్యమేనంటున్నారు....

Published : 21 May 2023 10:13 IST

ఇంటి అలంకరణలో భాగంగా అక్వేరియంలను ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. అయితే వీటిని అమర్చుకోవడంతోనే సరిపోదు.. వాతావరణానికి తగినట్లుగా మెయింటెయిన్‌ చేయడం కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఇక ఈ వేసవిలో అక్వేరియం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. లేదంటే ఈ ఎండలకు మనం తట్టుకోలేకపోతున్నట్లే.. అందులోని చేపలకూ నష్టం వాటిల్లుతుంది. అలా జరగకూడదంటే ఈ సీజన్‌లో అక్వేరియం విషయంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

వాతావరణంలోని వేడికి అక్వేరియం నీళ్లు కూడా క్రమంగా వేడెక్కుతాయి. ఇది అందులోని చేపలకు అస్సలు మంచిది కాదు. కాబట్టి ఆ నీటి ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం ముఖ్యం. అందుకోసం ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

నీళ్లు మార్చుతున్నారా?

ఏ సీజన్‌లోనైనా అక్వేరియంలో నీళ్లు ఎప్పటికప్పుడు మార్చితే అది శుభ్రంగా ఉంటుంది.. చేపలూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఈ వేసవిలో వేడికి ఆ గాజు పాత్ర, అందులోని నీళ్లు త్వరగా వేడెక్కుతాయి. కాబట్టి ఆ నీళ్లను అలాగే ఉంచడం కాకుండా.. వారానికి నాలుగైదు సార్లు మార్చాలి. అలాగే నీళ్లు చల్లగా ఉండాలని కొంతమంది.. అందులో ఐస్‌ వాటర్‌ పోయడం, ఐస్‌ ముక్కలు వేయడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల నీళ్లు మరీ చల్లగా అయిపోయి.. చేపల జీవక్రియల పనితీరు తగ్గిపోతుంది. ఇది ఒక్కోసారి వాటికి ప్రాణాంతకం కూడా కావచ్చు. కాబట్టి అక్వేరియం నీళ్లు మరీ వేడిగా, మరీ చల్లగా కాకుండా.. సాధారణంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నీళ్లతో పాటు అక్వేరియంలో ఉండే రాళ్లు, పచ్చగడ్డి.. వంటి వాటిని సైతం నిర్ణీత సమయాల్లో మార్చుతుండాలి.

లైట్‌ ఆర్పేయండి!

అక్వేరియం, అందులో ఈదే చేపలు ఆకర్షణీయంగా కనిపించాలని.. దానిలోని లైట్‌ను ఎప్పుడూ ఆన్‌ చేసే ఉంచుతారు చాలామంది. ఇక మరికొంతమంది దాన్ని గదిలోని లైట్ల కింద ఏర్పాటుచేస్తుంటారు. కానీ దీనివల్ల కూడా అందులోని నీరు వేడెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్వేరియం నీళ్లు సాధారణంగా/కాస్త చల్లగా ఉండాలంటే పగలంతా లైట్‌ ఆర్పేయడం మంచిది. అలాగే ఫిష్‌ ఫ్రెండ్లీ లైట్స్‌ కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. కావాలంటే వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు.

గది మధ్యలో వద్దు!

ఈ వేసవిలో అక్వేరియంలోని నీళ్లు చల్లగా ఉండాలంటే దాన్ని అమర్చే ప్రదేశం కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు. గదికి అందం తీసుకొద్దామన్న ఉద్దేశంతో చాలామంది దాన్ని గది మధ్యలోని టేబుల్‌పై లేదంటే గదిని వేరు చేసే పార్టిషన్‌ వాల్‌ దగ్గర సెట్‌ చేస్తుంటారు. అయితే దీనివల్ల తలుపులు, కిటికీల్లో నుంచి వచ్చే వేడిగాలి వల్ల లేదంటే నేరుగా ఎండ పడడం వల్ల అక్వేరియం గోడలకు తగిలి.. అందులోని నీరు త్వరగా వేడెక్కుతుంది. కాబట్టి వేసవిలో దీన్ని గదిలో చల్లగా ఉండే మూలన అమర్చడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే ఈ ఫిష్‌ ట్యాంక్‌లో ఒక క్లిప్‌ ఫ్యాన్‌/అక్వేరియం ఫ్యాన్‌ను ఏర్పాటు చేయడం వల్ల కూడా అందులోని నీరు వేడెక్కకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవి కూడా!

వేసవి వేడికి అక్వేరియంలోని నీళ్లు వేడెక్కకుండా ఉండాలంటే ఉష్ణోగ్రతను నిరోధించే థర్మాకోల్‌, జనపనారతో చేసిన షీట్స్‌ని దాని చుట్టూ ఏర్పాటుచేయాలి.

అక్వేరియం నీళ్ల వేడి పెరిగే కొద్దీ అందులో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోతాయి. తద్వారా అందులోని చేపలకు నష్టం కలగచ్చు. అలా జరగకుండా ఉండాలంటే అక్వేరియం మూత ఎప్పుడూ తెరిచి ఉంచాలి. అలాగే అందులో లిక్విడ్‌ ఆక్సిజన్‌ డ్రాప్స్‌ వేయచ్చు. లేదంటే దాని ఉపరితలంపై ఒక ఏరేటర్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్