పెళ్లికి ముందు రోజు ఇలా చేయండి..!

పెళ్లిలో ప్రతి వధువూ చక్కందాల చుక్కలా కనిపించాలనే కోరుకుంటుంది. ఇందుకు తగినట్లుగానే సౌందర్య పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. తద్వారా పెళ్లి సమయానికి మోమును అలసిపోయినట్లుగా, నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి.

Published : 24 Nov 2021 20:53 IST

పెళ్లిలో ప్రతి వధువూ చక్కందాల చుక్కలా కనిపించాలనే కోరుకుంటుంది. ఇందుకు తగినట్లుగానే సౌందర్య పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. తద్వారా పెళ్లి సమయానికి మోమును అలసిపోయినట్లుగా, నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పెళ్లికి ముందు రోజు రాత్రి కొన్ని చిన్న పాటి చిట్కాలు పాటించాలని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.

తలస్నానం చేయండి..

చాలామంది పెళ్లిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఆ తర్వాత జుట్టును డ్రయర్‌తో ఆరబెట్టుకుంటారు. దీనివల్ల జుట్టు పొడిబారిపోయినట్లుగా కనిపిస్తుంది. అందుకే పెళ్లికి ముందురోజు రాత్రే తలస్నానం చేయాలి. దీనివల్ల మరుసటి రోజుకి జుట్టు పట్టులా మెరిసిపోతూ కనిపిస్తుంది. తద్వారా అందం రెట్టింపవుతుంది. ఒకవేళ పెళ్లి రోజు ఉదయాన్నే తలస్నానం చేయడం తప్పనిసరైతే.. జుట్టును సాధ్యమైనంత వరకు సహజంగా ఆరబెట్టుకోవడానికే ప్రయత్నించండి.

తేమనందించండి..

పెళ్లిరోజు మన మేను అందంగా, తాజాగా మెరిసిపోవాలంటే దానికి తగిన మాయిశ్చరైజర్ తప్పనిసరి. అందుకే మీ చర్మతత్వానికి సరిపడే మాయిశ్చరైజర్‌ని ఎంచుకొని పెళ్లి ముందు రోజు రాత్రి శరీరానికి పట్టించి కాసేపు సున్నితంగా మర్దన చేయండి. దీనివల్ల శరీరం మృదువుగా మారుతుంది. అలాగే నీళ్లు ఎక్కువ మొత్తంలో తాగడం, శీతల పానీయాలు, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు కొన్ని రోజుల ముందు నుంచే దూరంగా ఉండడం మేలు.

స్క్రబ్‌.. సున్నితంగా!

పెళ్లికి ముందు స్క్రబ్‌ చేసుకోవాలనుకునే వారు.. సున్నితంగా శరీరాన్ని రుద్దుకోవాలి. దీనికోసం శెనగపిండిలో కొబ్బరినూనె వేసి తయారుచేసిన పేస్ట్‌ను స్క్రబ్‌ కోసం ఉపయోగించచ్చు. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోవడంతో పాటు తేమ కూడా అందుతుంది.

నిద్ర తప్పనిసరి..

పెళ్లికి ఎంత హడావిడి ఉన్నా నిద్రకు మాత్రం తగిన సమయం కేటాయించాలంటున్నారు నిపుణులు. కనీసం ఏడెనిమిది గంటలు నిద్ర పోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు రాకుండా, ముఖం నిర్జీవంగా కనిపించకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్