పనిలో విరామం.. మంచిదేనట!

వారానికి ఆరు రోజులు పని.. రోజులో మూడో వంతు ఆఫీస్‌లోనే గడుపుతుంటాం.. ఆదివారం వచ్చినా విశ్రాంతి తీసుకునే సమయం దొరకదు.. వెరసి ఈ బిజీ లైఫ్‌స్టైల్‌ వల్ల చాలామంది ఉద్యోగులు అటు శారీరకంగా, ఇటు మానసికంగా తీవ్ర అలసటకు గురవుతున్నారని పలు....

Published : 24 Sep 2022 19:39 IST

వారానికి ఆరు రోజులు పని.. రోజులో మూడో వంతు ఆఫీస్‌లోనే గడుపుతుంటాం.. ఆదివారం వచ్చినా విశ్రాంతి తీసుకునే సమయం దొరకదు.. వెరసి ఈ బిజీ లైఫ్‌స్టైల్‌ వల్ల చాలామంది ఉద్యోగులు అటు శారీరకంగా, ఇటు మానసికంగా తీవ్ర అలసటకు గురవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీని ప్రభావం అటు ఆరోగ్యం, ఇటు సంస్థ ఉత్పాదకత.. రెండింటి పైనా పడుతుంది. ఇదే విషయంపై సునిశితంగా ఆలోచించింది ఓ ఈ-కామర్స్‌ సంస్థ. తీరిక లేని ఈ పని వాతావరణం నుంచి వారికి కొంత విరామం ఇవ్వాలనుకుంది. ఈ క్రమంలోనే పదకొండు రోజుల పాటు సెలవులు ప్రకటించి ఇటీవలే వార్తల్లోకెక్కింది. తమ ఉద్యోగుల మానసిక ఉల్లాసం కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోందీ సంస్థ. ఈ నిర్ణయాన్ని అటు నెటిజన్లు, ఇటు నిపుణులు సమర్థిస్తున్నారు. తీరిక లేని పని వేళల నుంచి ఉద్యోగులకు కొన్ని రోజుల పాటు విముక్తి కలిగిస్తే బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సాధారణంగానే తీరిక లేకుండా ఉండే ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు.. ఈ పండగ సీజన్లో మరింత బిజీగా ఉంటాయి. ప్రత్యేక సేల్స్‌, ఆఫర్లు, డిస్కౌంట్లని.. వినియోగదారుల్ని ఆకర్షిస్తుంటాయి. దీంతో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతుంటుంది. దీనివల్ల వారు శారీరకంగా అలసిపోవడంతో పాటు, మానసికంగానూ ఒత్తిడికి గురవుతుంటారు. ఈ అలసటను దూరం చేయడానికే తమ ఉద్యోగులకు 11 రోజుల పాటు సెలవులు ప్రకటించి.. ఇటీవలే వార్తల్లోకెక్కింది ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ‘మీషో’.

మానసిక ఆరోగ్యం ముఖ్యం!

ఉద్యోగులు విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా పనిచేయడం వల్ల.. పని ఉత్పాదకత తగ్గే అవకాశం ఎక్కువని, అదే కొన్నాళ్ల పాటు పనికి పూర్తి దూరంగా ఉండడం వల్ల తిరిగి వాళ్లు శారీరకంగా, మానసికంగా సన్నద్ధమవుతారని, అందుకే ఈ సెలవులు ప్రకటించినట్లు సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి  ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రీసెట్ అండ్ రీఛార్జ్‌’ పేరుతో అందిస్తోన్న ఈ సెలవుల్ని తమ ఉద్యోగులు అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 1 వరకు తీసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. ఇలా ఈ సంస్థ సెలవులు ప్రకటించడం ఇది వరుసగా రెండోసారి.

‘ఉద్యోగి సమర్థంగా పనిచేయాలంటే.. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌, విశ్రాంతి, పునరుత్తేజితం.. ఈ మూడూ కీలకం. అందుకే ఈ సెలవులు అందిస్తున్నాం. ఈ క్రమంలో కుటుంబంతో గడపడం, వెకేషన్‌కి వెళ్లడం, కొత్త అభిరుచిని అలవర్చుకోవడం.. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు గడపడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది పరోక్షంగా సంస్థ అభివృద్ధికీ దోహదం చేస్తుంది..’ అంటూ ఈ సంస్థ హెచ్‌ఆర్‌ విభాగం పేర్కొంది. ప్రస్తుతం మీషో తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


ఇద్దరికీ మేలెంతో!

ఉద్యోగికి పని నుంచి ఇలా కొన్ని రోజుల పాటు విరామం ఇవ్వడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. మరోవైపు సంస్థకూ పరోక్షంగా మేలు చేకూరుతుందని చెబుతున్నారు. అవేంటంటే..!

❀ ఇలాంటి సెలవుల వల్ల ఉద్యోగులు దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే పని ప్రదేశంలో చిరాకు పడడం, సహోద్యోగులపై విరుచుకుపడడం (వర్క్‌ప్లేస్‌ బర్నవుట్‌).. వంటివి చాలా వరకు తగ్గుతాయంటున్నారు నిపుణులు.

❀ రోజూ బిజీగా ఉండే ఉద్యోగులకు ఇలాంటి సెలవులు వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే తమకు నచ్చిన అభిరుచిపై దృష్టి పెట్టడానికి రోజూ సమయం ఉండదు.. ఈ సెలవుల్ని అందుకోసం వినియోగించుకొని మానసిక ప్రశాంతత పొందచ్చు.

❀ రోజులో ఎక్కువ సమయం పని చేయడం వల్ల నిరంతరాయంగా పీసీ ముందే కూర్చోవాల్సి వస్తుంది. దీనివల్ల హృద్రోగం, స్థూలకాయం, మధుమేహం, డిప్రెషన్‌.. వంటి దీర్ఘకాలిక సమస్యలొస్తున్నాయంటున్నారు నిపుణులు. అందుకే పనికి పూర్తి విరామం ప్రకటిస్తే ఈ సమస్యలకు చాలా వరకు దూరంగా ఉండచ్చంటున్నారు.

❀ పనికి దూరంగా ఉండడం వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది.. ఇది ఆలోచనా సామర్థ్యాన్ని సైతం పెంచుతుంది. తద్వారా సృజనాత్మకతను రెట్టింపు చేసుకొని పనిలో మరింత మెరుగ్గా రాణించచ్చు.

❀ పని నుంచి ఇలాంటి విరామాలు తీసుకోవడం వల్ల శారీరక, మానసిక అలసటను దూరం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

❀ కొత్త కోర్సులు, టెక్నాలజీలో అప్‌డేట్‌ కావాలనుకునే వారికి ఈ విరామం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ నైపుణ్యాల్ని మీ ఉద్యోగంలో ప్రదర్శించి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.

❀ వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఈ విరామ సమయాల్లో మంచి అలవాట్లు ప్రారంభించచ్చు. ఉదాహరణకు.. వ్యాయామం, ధ్యానం.. వంటివి ప్రారంభించి ఆ తర్వాత కూడా కొనసాగించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని