వయసు రివర్స్‌.. ఆమె వీడియోకు మూడున్నర కోట్ల ప్రైజ్‌మనీ!

పెరిగే వయసును ఆపగలమా? వృద్ధాప్యం నుంచి తిరిగి యవ్వనంగా మారగలమా? మనకైతే ఈ రెండూ అసాధ్యమే! కానీ ‘ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌ సెల్‌ టెక్నాలజీ’తో ఇది సాధ్యమేనంటోంది బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల టీనేజర్‌ సియా గోడిక.

Published : 10 Feb 2024 12:36 IST

(Photos: Instagram)

పెరిగే వయసును ఆపగలమా? వృద్ధాప్యం నుంచి తిరిగి యవ్వనంగా మారగలమా? మనకైతే ఈ రెండూ అసాధ్యమే! కానీ ‘ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌ సెల్‌ టెక్నాలజీ’తో ఇది సాధ్యమేనంటోంది బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల టీనేజర్‌ సియా గోడిక. కేవలం మాట వరసకు చెప్పడమే కాదు.. ప్రయోగాత్మకంగా వీడియో రూపొందించి మరీ వివరిస్తోంది. ఇలా తనలోని సృజనాత్మకతకు, లైఫ్‌ సైన్సెస్‌పై ఆమెకున్న పట్టుకు నిదర్శనంగా నిలుస్తోన్న ఈ వీడియోతో తాజాగా ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైందామె. సైన్స్‌ రంగంలోనే ఆస్కార్‌ అవార్డుగా పరిగణించే ‘బ్రేక్‌త్రూ ప్రైజ్‌ - 2023’ను అందుకోనుందామె. ఈ క్రమంలో ఈ బ్రిలియంట్‌ టీన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

వయసు పైబడుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. చర్మంపై ముడతలు-మచ్చలు పడడంతో పాటు పలు అనారోగ్యాలూ చుట్టుముడతాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడితే ఈ ఆరోగ్య సమస్యల్ని నిరోధించచ్చు. యుక్త వయసులో ఉన్న వారైతే ఈ క్రమంలో ఇప్పట్నుంచే సంబంధిత జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. మరి, ఇప్పటికే వృద్ధాప్యంలోకి ప్రవేశించిన వారి సంగతేంటి? అంటే.. అందుకు ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌ సెల్‌ టెక్నాలజీనే ఏకైక పరిష్కార మార్గమంటోంది సియా.

వృద్ధాప్యం నుంచి యవ్వనంలోకి..!

ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌ సెల్‌ టెక్నాలజీ అనేది శరీరంలోని ఏ రకమైన కణాలనైనా మూల కణాలతో రీప్లేస్‌ చేయగలిగే సాంకేతికత. ఈ ప్రక్రియలో కొత్త కణాల్ని తిరిగి అమర్చడమంటే ఇది ఒక రకంగా వృద్ధాప్యం నుంచి తిరిగి యుక్త వయసులోకి ప్రవేశించడంగానే భావించచ్చంటోంది సియా.

‘ప్రస్తుతం మా బామ్మ తాతయ్యలు క్యాన్సర్‌, ఇతర నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో వారు పడే బాధలు చూసి చలించిపోయా. దీనికి ఎలాగైనా ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలనుకున్నా. ఈ క్రమంలోనే జపాన్‌ స్టెమ్‌ సెల్‌ బయాలజిస్ట్‌-నోబెల్‌ బహుమతి గ్రహీత షిన్యా యమనక సెల్యులార్‌ రీప్రోగ్రామింగ్‌పై చేసిన వీడియో ఒకటి నా కంట పడింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌ సెల్‌ టెక్నాలజీ ఆధారంగా వయసును తిరిగి పొందే మార్గాన్ని అన్వేషించా.. ఈ సాంకేతికతతో వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యల్ని, డీజెనరేటివ్‌ వ్యాధుల్ని (వ్యాధి బారిన పడిన కణజాలాల్ని నిరంతరం మార్చే ప్రక్రియ) సమర్థంగా ఎదుర్కోవచ్చు.. ఈ కాన్సెప్ట్‌ను నిజ జీవితంలో అమలు చేసే దిశగా నా వంతు కృషి చేస్తా..’ అంటోందీ యంగ్‌ ఇన్నొవేటర్.

మూడున్నర కోట్ల ప్రైజ్‌మనీ!

ఇలా ఈ కాన్సెప్ట్‌ను సునిశితంగా వివరిస్తూ ‘యమనక ఫ్యాక్టర్స్‌’ పేరుతో ఓ వీడియో రూపొందించింది సియా. ఇందులో భాగంగా తాను వృద్ధురాలిగా కనిపిస్తూ.. ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌ సెల్‌ టెక్నాలజీతో తిరిగి యవ్వనంగా మారే ప్రక్రియను స్పష్టంగా వివరించిందామె. ఇలా తన సృజనాత్మకతను, లైఫ్‌సైన్సెస్‌పై ఆమెకున్న పట్టును ప్రతిబింబించేలా ఉన్న ఈ వీడియోను ‘బ్రేక్‌త్రూ జూనియర్‌ ఛాలెంజ్‌ 2023 ఇంటర్నేషనల్‌ సైన్స్‌ వీడియో కాంపిటీషన్‌’కు పంపింది సియా. ఆమె సృజనను మెచ్చిన బ్రేక్‌త్రూ ప్రైజ్‌ ఫౌండేషన్.. 2023కు గాను సియాను ప్రతిష్టాత్మక ‘బ్రేక్‌త్రూ అవార్డు’కు ఎంపిక చేసింది. సైన్స్‌ రంగంలో ఆస్కార్‌గా పరిగణించే ఈ పురస్కారాన్ని లైఫ్‌సైన్సెస్‌, భౌతిక శాస్త్రం, గణితశాస్త్రాల్లో సృజనాత్మక ఆవిష్కరణలతో సమాజంలో మార్పు తీసుకొచ్చిన వారికి అందిస్తారు. ఇక ఈ అవార్డులో భాగంగా రూ. 3.32 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకోనుందీ బెంగళూరు టీన్‌. అయితే ఈ మొత్తంలో నుంచి కాలేజ్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ. 2.7 కోట్లు అందుకోనుంది సియా. ఇక మిగతా మొత్తాన్ని సియా సైన్స్‌ టీచర్‌ ఆర్కా మౌలిక్‌కు, ఆమె చదువుతోన్న కాలేజీలో స్టెమ్‌ సెల్‌ ప్రయోగశాలను ఏర్పాటుచేయడానికి అందించనున్నారు బ్రేక్‌త్రూ ప్రైజ్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు. ఇక 2018లో సియా అన్నయ్య సమయ్‌ కూడా ఇదే అవార్డును అందుకున్నాడు. ఇలా తమ పిల్లలిద్దరినీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించడం చెప్పలేనంత సంతోషం కలిగిస్తోంది అంటున్నారు సియా తల్లిదండ్రులు.


పాదరక్షలకు మెరుగులద్ది..!

తన సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలకు తెరతీసే నైపుణ్యాలున్న సియా ప్రస్తుతం బెంగళూరులోని నీవ్‌ అకాడమీలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. చిన్న వయసు నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమె సమాజ సేవలోనూ ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే పాదరక్షలకూ నోచుకోని నిరుపేదల కోసం 2019లో ‘సోల్‌ వారియర్స్‌’ అనే కార్యక్రమం ప్రారంభించింది. ‘Donate a sole, save a soul’ అనే ట్యాగ్‌లైన్‌తో మొదలైన ఈ పాదరక్షల ఉద్యమం నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. పాత/పాడైపోయిన పాదరక్షల్ని సేకరించి.. వాటికి కొత్త సొబగులద్ది అవసరంలో ఉన్న వారికి అందించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

‘మా ఇంటికి దగ్గర్లో ఎంతోమంది పేదవారు కనీసం పాదాలకు చెప్పులు కూడా వేసుకోకుండా కూలి పనులు చేయడం చూశాను. చాలా బాధనిపించేది. వెంటనే దీనిపై ఓ చిన్నపాటి అధ్యయనం మొదలుపెట్టాను. ఈ క్రమంలోనే చెప్పుల్లేకుండా కొన్ని కఠినమైన పనులు చేయడం వల్ల పాదాలకు సంబంధించిన పలు సమస్యలొస్తాయని తెలుసుకున్నా. అందుకే అలాంటి వారికి అండగా ఉండడం కోసం సోల్‌ వారియర్స్‌ని ప్రారంభించా. ఇలా ఇప్పటివరకు సుమారు పాతిక వేలకు పైగా పాదరక్షల్ని సేకరించి, వాటిని రిపేర్‌ చేసి అవసరంలో ఉన్న వారికి అందించా..’ అంటోన్న ఈ సోషల్‌ వారియర్‌ 2021లో ‘డయానా పురస్కారం’ కూడా అందుకుంది. మరోవైపు సరస్సుల పరిరక్షణలోనూ తన వంతు పాత్ర పోషిస్తోన్న ఈ బ్రిలియంట్‌ టీన్‌కు ఈత కొట్టడం, బేకింగ్‌, పుస్తకాలు చదవడమంటే ఇష్టమట!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్