Updated : 20/10/2021 17:27 IST

Sexual Abuse: ఆ చేదు అనుభవాలు మేమూ ఎదుర్కొన్నాం!

తప్పు తనది కాకపోయినా ఆడపిల్లనే నిందిస్తుంది ఈ సమాజం. ఆ సమయంలో కనీసం ఇంట్లో వాళ్లైనా ఆదరిస్తారనుకుంటే.. అక్కడా ఆమెకు మొండిచేయే ఎదురవుతుంది. అందుకే చాలామంది ఆడపిల్లలు తమకు జరిగిన అన్యాయం, తమపై జరిగిన లైంగిక హింస గురించి తమ తల్లిదండ్రులతో చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. తానూ అలాగే చేశానంటోంది బాలీవుడ్‌ అలనాటి అందాల నటి నీనా గుప్తా. చిన్న వయసులో పలుమార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని.. అయినా ఈ విషయం అమ్మకు చెప్పలేకపోయానంటూ తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇలా నీనా ఒక్కర్తే కాదు.. గతంలో పలువురు ముద్దుగుమ్మలు సైతం చిన్నతనంలో తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా నోరు విప్పారు. ఈ సమాజానికి భయపడి ఆడపిల్లలు తమ నోరు నొక్కేసుకోవాల్సిన అవసరం లేదంటూ అందరిలో స్ఫూర్తి నింపారు.

ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా, ధైర్యంగా మాట్లాడడం నీనా గుప్తాకు వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుల్ని అందరితో పంచుకోవడానికి తానెప్పుడూ ముందే ఉంటుందీ అలనాటి అందాల నటి. ఈ క్రమంలోనే తాను వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ని ప్రేమించడం, వాళ్ల ప్రేమకు గుర్తుగా మసాబా పుట్టడం, ఆ తర్వాత వివియన్‌తో సంబంధాలు తెంచుకోవడం.. ఇలా తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకుందీ తార. అంతేకాదు.. తన జీవితంలోని ఎత్తుపల్లాలను ‘Sach Kahun Toh’ అనే ఆత్మకథ రూపంలో రాసింది నీనా. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన ఈ పుస్తకంలోని పలు ఆసక్తికర విషయాలను సందర్భానుసారం అందరితో పంచుకుంటోందీ బాలీవుడ్‌ నటి.

రెండుసార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా!


తన చిన్నతనంలో తాను రెండుసార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, అయితే ఈ సమాజానికి భయపడే వాటి గురించి తన తల్లి దగ్గర దాచానని అంటోంది నీనా. ‘నా చిన్నతనంలో ఓసారి ఓ నేత్ర వైద్యుడి దగ్గరికి వెళ్లాను. నాతో పాటే వచ్చిన నా సోదరుడిని బయట కూర్చోమన్నారు.. ఇక నేను కంటి పరీక్ష కోసం లోపలికి వెళ్లాక.. మొదట డాక్టర్‌ నా కళ్లను పరీక్షించారు. ఆ తర్వాత కంటితో సంబంధం లేని మిగతా శరీర భాగాలను కూడా అసభ్యంగా పరీక్షించడం మొదలుపెట్టాడు. నాకు చాలా భయమేసింది.. అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు. ఆ విసుగుతోనే ఇంటికెళ్లా.. ఓ మూలన కూర్చొని ఏడ్చా. ఆ సమయంలో నన్ను ఎవరూ గమనించలేదు. పోనీ అమ్మకు చెప్పే ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే తను ఎక్కడ నాదే తప్పు అంటుందేమో, నా చేష్టలతోనే డాక్టర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశానేమోనన్న భావనే నన్ను చెప్పకుండా ఆపేసింది. ఇలాంటి చేదు అనుభవం ఇతర డాక్టర్ల దగ్గరా పలుమార్లు ఎదుర్కొన్నా..’

నాలా ఎంతోమంది!

ఇక మరోమారు.. టైలర్‌ దగ్గర వేధింపులు తప్పలేదు. దుస్తుల కోసం నా శారీరక కొలతలు తీసుకుంటానని చెప్పి చాలా అసభ్యంగా తాకాడు. ఇది కూడా నా మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. భయం, సిగ్గు వల్ల ఈ విషయాన్నీ అమ్మ దగ్గర దాచాను. ఆ తర్వాత్తర్వాత ఇలాంటి వేధింపులు ఇతర ఆడపిల్లలకూ ఎదురవుతున్నాయన్న విషయం తెలుసుకోగలిగా. వాళ్లూ తమ ఇంట్లో చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారని.. ఒకవేళ చెప్తే తమనెక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో, పరువు పేరుతో నోరు నొక్కేస్తారో, ఉన్న ఆ కాస్త స్వేచ్ఛను కూడా లాగేసుకొని తమను ఇంటికే పరిమితం చేస్తారోనని మిన్నకుండిపోతున్నారు..’ అంటూ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది నీనా.

 

వాడి చెంప పగలగొట్టా!

బాలీవుడ్‌ టాప్‌ బ్యూటీ దీపికా పదుకొణె తన పదిహేనేళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘అప్పుడు నాకు 14-15 ఏళ్లుంటాయనుకుంటా. ఓరోజు సాయంత్రం కుటుంబంతో కలిసి రెస్టరంట్‌కి డిన్నర్‌కి వెళ్లాం. భోజనం చేశాక ఆ పక్కనే వీధిలో వాకింగ్‌ చేస్తున్నాం. నాన్న, చెల్లి ముందు.. నేను, అమ్మ వాళ్ల వెనకాల నడుస్తున్నాం. అదే సమయంలో ఓ వ్యక్తి నా దగ్గరగా వచ్చి కావాలనే నన్ను తాకుతూ వెళ్లాడు. అప్పుడు అది సమయం కాదని మిన్నకుండిపోయా. కానీ ఆ తర్వాత మాత్రం అదే వ్యక్తిని వెంబడించి.. తను చేసిన పనికి నడి వీధిలో చెంప పగలగొట్టా..’ అంటూ తన అనుభవాన్ని పంచుకుందామె. అంతేకాదు.. ఇలాంటి అఘాయిత్యాలను అడ్డుకోవాలంటే.. ఆడపిల్లలు/మహిళలు ధైర్యాన్ని ప్రదర్శించాలని చెప్పకనే చెప్పిందీ బ్యూటీ.

 

నా ఛాతీని తాకాడు!

కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది మగవాళ్ల దృష్టి నిరంతరం ఆడవాళ్లను వెంటాడుతూనే ఉంటుందని చెబుతోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్‌. తన 13 ఏళ్ల వయసులో తానెదుర్కొన్న ఓ చేదు అనుభవంతో తీవ్ర భయాందోళనలకు లోనయ్యానంటోందీ బ్యూటీ. ‘అప్పుడు నాకు 13 ఏళ్లు. ముంబయిలోని ఓ థియేటర్‌కి వెళ్లాను. ఆ సమయంలో ఓ వ్యక్తి నా పక్కనే నిలబడి నా ఛాతీని తాకాడు. అసలు అప్పుడు ఏం జరుగుతోందో నాకు అర్థం కాకపోయినా అతని ప్రవర్తన నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. భయమేసింది.. ఒక్కసారిగా ఏడ్చేశా.. కానీ ఆ విషయం గురించి ఎక్కడా నోరు విప్పలేదు..’ అంది సోనమ్‌. అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మీటూ ఉద్యమానికి తన మద్దతు పలకడం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు చరమగీతం పాడాలంటే బాధితులు తమకు జరిగిన అన్యాయాల్ని ధైర్యంగా బయటపెట్టాలని చెబుతూ అందరిలో స్ఫూర్తి నింపిన విషయాలన్నీ మనకు తెలిసినవే!

 

షూటింగ్‌లో ముద్దు పెట్టుకున్నాడు!

వ్యక్తిగతంగానే కాదు.. వృత్తిపరంగానూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నాయికలు ఎందరో! బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ రేఖ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తన పదిహేనేళ్ల వయసులో ఓ సినిమా సెట్‌లో ఆమె వేధింపులకు గురైనట్లు ‘Rekha : The Untold Story’ పేరుతో యాసిర్‌ ఉస్మాన్‌ రాసిన బయోగ్రఫీలో వెల్లడించారు.

‘బాంబేస్ మెహబూబ్‌ స్టూడియోలో ‘అంజానా సఫర్’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఆ చిత్రానికి రాజా నవాతే దర్శకుడు-కొరియోగ్రాఫర్‌. ఆ రోజు హీరో బిస్వజీత్‌, రేఖల మధ్య ఓ రొమాంటిక్‌ సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే దర్శకుడు యాక్షన్‌ చెప్పగానే బిస్వజీత్‌ రేఖ పెదాలపై గాఢంగా ముద్దు పెట్టాడు. నిజానికి సీన్‌ అది కాదు. అయినా దర్శకుడు కట్‌ చెప్పకపోగా.. అక్కడున్న వారంతా అది చూసి చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం.. వంటివి చేశారు. ఆ సమయంలో రేఖకు కన్నీళ్లు ఆగలేదు..’ అంటూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని పుస్తకంలో పొందుపరిచారాయన. ఇలా ఒక్కసారనే కాదు.. పలుమార్లు సినీ పరిశ్రమ తనపై వివక్ష చూపినా.. టాప్‌ నాయికగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయమంటూ ఆమె బయోగ్రఫీలో వివరించారు రచయిత.

 

అవకాశాలు రావాలంటే అదొక్కటే మార్గమన్నారు!

తమ తపనను వెతుక్కొని ఎన్నో ఆశలతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టే నాయికలకు ఇక్కడ కొన్ని చేదు అనుభవాలు తప్పట్లేదు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది యువ నటి ఫాతిమా సనా షేక్‌. బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. సినిమాల్లో అవకాశాలు రావాలంటే శృంగారానికి అంగీకరించడమే ఏకైక మార్గమని తనతో చాలామంది అన్నారంటూ ఓ సందర్భంలో పంచుకుందీ చక్కనమ్మ.

‘మూడేళ్ల వయసున్నప్పుడే నేను లైంగిక వేధింపులకు గురయ్యా. సినిమాల్లో అవకాశాలు రావాలంటే శృంగారానికి అంగీకరించడమే ఏకైక మార్గం అని చాలామంది నాతో అన్నారు. ఈ కారణంగా నేను కొన్ని అవకాశాలు కోల్పోయా.. మరికొన్నిసార్లు ఎంపిక చేసిన ప్రాజెక్ట్స్‌ నుంచి నన్ను తొలగించి ఇతరులకు ఆ అవకాశం ఇచ్చారు. మహిళలకు ఇలాంటి సమస్యలు ఈ ఒక్క రంగంలోనే ఉన్నాయని చెప్పను.. ఎందుకంటే ప్రతి రంగంలో, ప్రతి రోజూ ఎంతోమంది ఆడవారు ఇలాంటి వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ బాధను పంటి బిగువున భరిస్తున్నారు. మైనార్టీ మహిళలైతే ఈ విషయంలో మరెన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలా తమకు జరిగిన అన్యాయాల్ని బయటికి చెబితే ఎవరెలా స్పందిస్తారో, సమాజం వారిని ఎలా ట్రీట్‌ చేస్తుందోనన్న భయంతో చాలామంది చెప్పడానికి సాహసించరు. కానీ ఈ విషయంలో మహిళల్లో మార్పు రావాలి. లైంగిక వేధింపుల గురించి ఉన్న అపోహల్ని, భయాల్ని పక్కన పెట్టి తమకు జరిగిన అన్యాయాల్ని బయటపెట్టే ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తు, మన ముందు తరాల వారి భవిష్యత్తు ఉత్తమంగా ఉంటుందనేది నా భావన..’ అంటూ తన మనసులోని భావోద్వేగాల్ని అందరి ముందుంచిందీ దంగల్‌ బ్యూటీ.

 

ఇదీ ఉగ్రవాదం లాంటిదే!

కెరీర్‌లో ఎదగాలన్నా ఎన్నో అవరోధాలు దాటుకుంటూ రావాలని, అందులో లైంగిక వేధింపులు కూడా ఒకటని అంటోంది బాలీవుడ్‌ పాటల పూదోట నేహా భాసిన్‌. తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ.. ఇలా విభిన్న భాషల్లో పాటలు పాడి సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓ సందర్భంలో పంచుకుంది.

‘లైంగిక వేధింపులు నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచే నేను ఇలాంటివి ఎదుర్కొన్నాను. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు మా కుటుంబమంతా కలిసి హరిద్వార్‌ వెళ్లాం. అక్కడ మా అమ్మ నాకు కొంచెం దూరంలో నిల్చొని ఉంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి నన్ను అసభ్యంగా తాకాడు. నేను షాక్‌ అయ్యాను. వెంటనే అక్కడి నుంచి పారిపోయాను. కొన్నేళ్ల తర్వాత మరో వ్యక్తి అలాగే అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటనలు నాకు బాగా గుర్తున్నాయి. ఇందులో నాదే తప్పు ఉందేమోనని మొదట ఆత్మన్యూనతా భావానికి గురయ్యాను. కానీ ఆ విషయాల్లో నా తప్పు ఏమీ లేదని మెల్లగా తెలుసుకున్నాను. ఇలా నేరుగానే కాదు.. సోషల్‌ మీడియా వేదికగా కూడా కొన్ని అభ్యంతరకరమైన కామెంట్లు భరించాను. ఇలాంటి చేదు అనుభవాలు నాకొక్కదానికే కాదు.. చాలామందికి ఉండే ఉంటాయి. తమ మాటలు, చేతలతో శారీరకంగా, మానసికంగా హింసిస్తుంటారు. ఇదొక రకమైన టెర్రరిజం. దీనికి అడ్డూ అదుపు అంటూ ఉండదు..’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ సింగర్.

వీళ్లే కాదు.. స్వరా భాస్కర్‌, కల్కి కొచ్లిన్‌, కంగనా రనౌత్‌.. వంటి ముద్దుగుమ్మలు కూడా తమపై జరిగిన లైంగిక హింస గురించి పలు సందర్భాల్లో ధైర్యంగా పంచుకున్నారు. మరికొంతమంది తారలు మీటూ వేదికగా తమకు జరిగిన అన్యాయాలపై పెదవి విప్పారు. తప్పు మనది కానప్పుడు ఈ సమాజానికి భయపడాల్సిన పని లేదని.. ధైర్యంగా దోషుల్ని బయటకు లాగాలని అందరిలో స్ఫూర్తి నింపారు.

మరి, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, ధైర్యం నూరిపోసినా.. ఆడపిల్లలు తమపై జరిగే అన్యాయాల్ని, లైంగిక వేధింపుల్ని బయటపెట్టకపోవడానికి ఈ సమాజమే కారణమన్నది చాలామంది అభిప్రాయం. ఈ క్రమంలో - మీరు కానీ, మీ స్నేహితులు లేదా బంధువులు ఎవరైనా సరే.. ఎప్పుడైనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారా? అలాంటి సందర్భాల్లో ఏం చేశారు? మౌనంగా ఉండిపోయారా? లేక ధైర్యంగా వారికి బుద్ధి చెప్పారా? అసలు ఇలాంటి పరిస్థితుల్ని అమ్మాయిలు ఎలా ఎదుర్కోవాలి? మీ అభిప్రాయాలు పంచుకోండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని