ఆమె వీడియో ప్రియాంకకు తెగ నచ్చేసింది!

సోషల్‌ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా తమ ప్రతిభా నైపుణ్యాలను చాటుకుంటూ మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంటున్నారు.

Updated : 24 Dec 2022 15:30 IST

(Photo: Instagram)

సోషల్‌ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా తమ ప్రతిభా నైపుణ్యాలను చాటుకుంటూ మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంటున్నారు. లక్నోకు చెందిన 16 ఏళ్ల మీతిక ద్వివేది కూడా ఈ కోవకే చెందుతుంది. సంగీతంతో పాటు నృత్యంలో అనుభవమున్న ఈ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో అదరగొట్టేస్తోంది. మ్యూజిక్‌ వీడియోలు, కామెడీ స్కిట్ల రీల్స్‌ చేస్తూ ప్రియాంకా చోప్రా లాంటి తారల అభిమానం చూరగొంటోంది.

ఆమె ప్రతిభకు బాలీవుడ్ ఫిదా!

లక్నోలోని బాద్షానగర్‌కు చెందిన మీతిక ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. ఆమెకు ‘ది సౌండ్‌ బ్లేజ్‌’ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఉంది. తల్లి నీర్జా ద్వివేది దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. గతేడాది సెప్టెంబర్‌లో మొదటి పోస్ట్‌ను అప్‌లోడ్‌ చేసిన మీతిక, ఇప్పటివరకు 53 పోస్టులు షేర్‌ చేసింది. అయితేనేం ఏడాది కాలంలోనే 1.8మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుందీ టీనేజీ అమ్మాయి. అదేవిధంగా తన యూట్యూబ్‌ ఛానల్‌కు 45వేల మంది సబ్‌స్ర్కైబర్లు ఉండడం విశేషం. ప్రియాంకా చోప్రా, అర్బాజ్‌ఖాన్‌, అపరశక్తి ఖురానా, అనురాగ్‌ కశ్యప్‌ తదితర బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ టీనేజర్‌ను అనుసరించడం మరో విశేషం. మరి సోషల్‌ మీడియాలో మీతికకు ఇంతలా క్రేజ్‌ రావడానికి కారణమేంటో తెలుసా.. ఆమె చేస్తోన్న మ్యూజిక్‌ అండ్‌ స్టాండప్‌ కామెడీ వీడియోలే!

పొట్ట చెక్కలయ్యేలా నవ్వించగలదు!

మీతిక సంగీతంలో శిక్షణ తీసుకుంది. స్కూల్‌లో జరిగిన పలు పాటల పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి బహుమతులు గెల్చుకుంది. దీంతో పాటు అద్భుతమైన హాస్య చతురత ఈ అమ్మాయి సొంతం. అందుకే కామెడీ వీడియోలతో లక్నో ప్రజలను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ క్రమంలోనే మీతిక వీడియోలకు లక్షల్లో లైకులు, వ్యూస్‌ వస్తున్నాయి. ‘ది సౌండ్‌ బ్లేజ్‌.. అని నా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు ఈ పేరు పెట్టింది మా అమ్మే. మొదట కొన్ని పాటలను వీడియోల రూపంలో పోస్ట్‌ చేశాను. రీల్స్‌ కూడా చేశాను. అయితే ఇన్‌స్టా రీల్స్‌కే ఎక్కువ వ్యూస్‌ వస్తుండడంతో ఆతర్వాత వాటినే కొనసాగించాను. మొదటి రీల్‌ చేసినప్పుడు ఎలా ఫేమస్‌ అవ్వాలో నాకు అసలు తెలియదు. అందుకే దీనికి కేవలం 100 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ట్రెండింగ్‌ అంశాలనే సబ్జెక్టుగా తీసుకున్నాను. వాటికి మంచి స్పందన వచ్చింది. ట్రెండింగ్‌ అంశాలు/విషయాలకు లోకల్‌ లాంగ్వేజ్‌, పేరడీ వంటి అదనపు హంగులద్ది అప్‌లోడ్‌ చేస్తాను. వీడియో షూట్స్‌, ఎడిటింగ్‌ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను. సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకునేలా నా వీడియోలు ఉండేలా జాగ్రత్తపడతాను.’

రియల్‌ లైఫ్‌లో కూడా అలాగే..!

‘మీరు చూసే రీల్స్‌లో మీతిక ఎలా అయితే ఉంటుందో నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. వీడియోల కోసం నా భాష, యాస, పదజాలాన్ని మార్చుకోను. నేనే కాదు.. నా తల్లిదండ్రులు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు. ప్రస్తుతం నాకు వస్తున్న గుర్తింపు, క్రేజ్‌ నన్ను మరింత బిజీగా మారుస్తున్నాయి. ఒక్కోసారి గంటల తరబడి ఈ వీడియోల మీద పనిచేయాల్సి వస్తోంది. కొంచెం కష్టంగా అనిపిస్తున్నా ఇలా బిజీగా పనిచేయడమే నాకిష్టం. ఇవే నన్ను మరింత ముందుకు నడిపిస్తున్నాయి. ఒక్కోసారి మనం ఎంత మంచి వీడియోలు చేసినా కొంతమంది నుంచి నెగెటివ్‌ కామెంట్లు వస్తుంటాయి. వాటిని చదివి అలాగే వదిలేస్తాను. ఎందుకంటే వాటిని తలకెక్కించుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనమేమీ ఉండదన్నది నా భావన! నాపై నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్న వారికి నా పని సులభంగా అనిపించచ్చు. అలాంటి వారు ఒకసారి నా దగ్గరకు రండి. ఒక మంచి వీడియో రూపొందించడం వెనక ఎంతటి కష్టం, శ్రమ ఉంటాయో వారికి నేను ప్రత్యక్షంగా చూపిస్తాను.’

సెలబ్రిటీలూ ప్రశంసిస్తున్నారు!

‘నా స్టాండప్‌ కామెడీ వీడియోలను ప్రియాంకా చోప్రా, అనురాగ్‌ కశ్యప్‌ లాంటి బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు. నా కామెడీ స్టైల్‌ నేచురల్‌గా ఉందని వారు ప్రశంసించారు. ఇటీవల అర్బాజ్‌ఖాన్‌తో కలిసి ఓ వీడియో చేశాను. దీనికి లక్షల్లో వ్యూస్‌, లైకులు వచ్చాయి. ఇక నా కెరీర్‌ విషయానికొస్తే.. చాలామంది అమ్మాయిల్లాగే తల్లిదండ్రుల సంతోషం కోసం సైన్స్‌ సబ్జె్క్టును తీసుకున్నాను. అయితే నాకు మాత్రం మీడియా/జర్నలిజం రంగంలో రాణించాలని, అందులోనే స్థిరపడాలనుంది’ అని అంటోందీ టీనేజ్‌ సెన్సేషన్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్