Updated : 23/12/2021 12:49 IST

NDA: అమ్మాయిలూ.. త్రివిధ దళాల్లో చేరేద్దామా?

‘ధైర్యే సాహసే లక్ష్మి’ అన్నారు పెద్దలు. అంటే.. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తేనే మనం అనుకున్నది సాధించగలం అని! ఈ తరం అమ్మాయిలు ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోకి వెళ్లడానికీ ‘సై’ అంటున్నారు. రక్షణ రంగంలో సైతం ప్రవేశించి దేశ సేవలో తరించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి అమ్మాయిల్ని ఎర్ర తివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తోంది జాతీయ డిఫెన్స్‌ అకాడమీ (NDA). మొన్నటిదాకా పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ ప్రవేశ పరీక్షలో ఇప్పుడు ఔత్సాహిక అమ్మాయిలకూ అవకాశమిస్తోంది. పురుషులతో సమానంగా త్రివిధ దళాల్లో వివిధ హోదాల్లో పనిచేసే వెసులుబాటు కల్పిస్తోంది.

ఈ క్రమంలోనే ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ తాజాగా వెలువడింది. ఇలాంటి తరుణంలో ఎన్‌డీఏలో మహిళలకు ఉన్న అవకాశాలేంటి? అదనపు సౌకర్యాలేంటి? ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే అమ్మాయిలు ఎలా సన్నద్ధం కావాలి? తదితర అంశాలకు సంబంధించిన ప్రత్యేక కథనం ఇది!

రక్షణ రంగ ఉద్యోగాల్లో చేరడానికి మహిళలకు వివిధ మార్గాలున్నాయి. యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఏటా విడుదల చేసే నోటిఫికేషన్ల ద్వారా అర్హత గల మహిళల్ని ఆయా పోస్టుల కోసం నియమించుకుంటున్నాయి. ఇవి కాకుండా ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ, నేవీలు విడిగా పరీక్షలు నిర్వహించి ఔత్సాహిక మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే తాజాగా వీటి సరసన జాతీయ డిఫెన్స్‌ అకాడమీ (NDA) కూడా చేరిపోయింది. మొన్నటిదాకా ఈ వేదికగా పురుషులకు మాత్రమే అవకాశం కల్పించిన ఈ సంస్థ.. ఇప్పుడు అమ్మాయిలకూ ప్రవేశ పరీక్ష రాసే అవకాశాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్లో జరిగిన రాత పరీక్షలో వెయ్యి మందికి పైగా అమ్మాయిలు అర్హత సాధించారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్న రాత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది.

నాటి నుంచి నేటి దాకా!

త్రివిధ దళాల్లో మహిళల ప్రాతినిథ్యం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నా.. దీనికి బీజం పడింది మాత్రం 1888లో అని చెప్పాలి. ఆ ఏడాదే ‘ఇండియన్‌ మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌’ ఏర్పాటైంది. అప్పట్నుంచే మహిళల్ని త్రివిధ దళాల్లోకి తీసుకోవడం ప్రారంభించారు. అందులోనూ కమ్యూనికేషన్స్‌, అకౌంటింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్‌.. వంటి డెస్క్‌ ఉద్యోగాలకే వాళ్లను పరిమితం చేశారు. అయితే దశాబ్దాల అనంతరం 1992 నుంచి మహిళా అధికారుల్ని చేర్చుకోవడం ప్రారంభించాయి త్రివిధ దళాలు. ఈ క్రమంలోనే వారిని యుద్ధ కార్యకలాపాల్లోకీ అనుమతించడానికి మార్గం సుగమమైందని చెప్పచ్చు. ఇక 2015లో భారత వాయుసేన తొలిసారి ముగ్గురు ఫైటర్‌ పైలట్లను నియమించుకొని.. ఎంతోమంది అమ్మాయిల ఆశయానికి ఊపిరి పోసింది. ఇక ఆ తర్వాత్తర్వాత కూడా వివిధ ఉన్నత హోదాల్లో మహిళలు నియమితులవుతూ.. ఔత్సాహిక మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు.

అయితే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్మీగా పేరుపొందిన ఇండియన్‌ ఆర్మీలో మహిళల శాతం తక్కువగానే ఉందంటున్నాయి తాజా గణాంకాలు. ప్రస్తుతం భారత వాయుసేనలో 1.08 శాతం మహిళలు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తుంటే.. నేవీలో 6.5 శాతం మంది మహిళా ఉద్యోగులున్నారు. వీటితో పోల్చితే సైన్యంలో  మహిళల సంఖ్య కేవలం 0.56 శాతమే! అయితే ఈ సమీకరణాలు మారాలంటే యుద్ధ కార్యకలాపాల్లోకీ మరింతమంది మహిళల్ని నియమించుకోవాలంటున్నారు నిపుణులు.

ఈ రెండింటితో ఆ లోటు తీరుతుందా?

అయితే ఇప్పటిదాకా త్రివిధ దళాల్లో చేరిన మహిళలు ఏ హోదాలో ఉద్యోగం చేస్తున్నా.. వాళ్లు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కిందే తమ కెరీర్‌ని కొనసాగించేవారు. అంటే పదేళ్లు మాత్రమే వారు సర్వీస్‌లో కొనసాగడానికి అర్హులు. ఆ తర్వాత అప్పటి అవసరాలు, అభ్యర్థుల ఆసక్తి-సమర్థతను బట్టి మరో నాలుగేళ్ల సర్వీస్‌ పొడిగించేవారు. దీంతో ఇష్టం లేకపోయినా మహిళలు అర్ధాంతరంగా తమ కెరీర్‌ను ముగించాల్సి వచ్చేది. దీంతో గ్రాట్యుటీ తప్ప పింఛను, ఇతర ప్రయోజనాలు కూడా దక్కేవి కావు. కాబట్టి ఇలాంటి అసమానతలకు తెరదించాలని ఏళ్లుగా పోరాటం చేశారు కొందరు ఉద్యోగినులు. దీంతో సుప్రీం కోర్టు ఈ పద్ధతికి తెరదించుతూ.. ఇటీవలే శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయమని ఆదేశించిన విషయం తెలిసిందే! ఫలితంగా పదవీ విరమణ వయసు వచ్చే వరకు మహిళలు ఉద్యోగంలో కొనసాగచ్చు. కనీసం 20 ఏళ్లు సేవలందించిన వారు పింఛను, ఇతర సదుపాయాలు పురుషులతో సమానంగా అందుకోవచ్చు. ఒకరకంగా ఇది సాయుధ దళాల్లో మహిళల్ని ప్రోత్సహించడానికి వేసిన ముందడుగుగా చెప్పచ్చు.
ఇక మరోవైపు.. జాతీయ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశ పరీక్షలో కొత్తగా మహిళలకు అవకాశం కల్పించి.. మరింతమంది మహిళలు త్రివిధ దళాల్లోకి వచ్చేలా మార్గం సుగమం చేసిందీ అత్యున్నత న్యాయస్థానం.

ఇలా ఈ రెండు పరిణామాలు భవిష్యత్తులో సాయుధ దళాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచేందుకు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ప్రస్తుతం ఆర్మీకి మాత్రమే పరిమితమైన Personal Below Officer Rank Entry Level త్వరలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు కూడా విస్తరించనున్నారట! తద్వారా మరికొంతమంది మహిళలకు ఆయా విభాగాల్లో అవకాశాలు దక్కనున్నాయి.

సౌకర్యాలెలా ఉంటాయి?

ఎన్‌డీఏ ద్వారా ఉద్యోగం సంపాదించి రక్షణ రంగంలో ఏ విభాగంలో చేరినా.. పురుషులతో సమానంగా మహిళలూ అన్ని ప్రయోజనాల్ని పొందచ్చు.

* ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌.. ఏ విభాగంలో చేరినా జీతం, హోదా, ఇతర సౌలభ్యాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. సర్వీసుని బట్టి ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి.

* చేరిన విభాగాన్ని బట్టి దాదాపు ఏడాది నుంచి 18 నెలల శిక్షణ ఉంటుంది. ఈ వ్యవధిలో నెలకు రూ. 56,100 (లెవెల్‌ 10) స్టైపెండ్‌ చెల్లిస్తారు. విధుల్లో చేరిన తర్వాత రూ. 56,100 మూలవేతనానికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనంగా లభిస్తాయి.

* ఏ విభాగంలో చేరినా రూ. 15,500 మిలిటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) ప్రతి నెలా అందుతుంది. ఒకవేళ పైలట్‌ పోస్టులో చేరితే ఎంఎస్‌పీతో పాటు ప్రతినెలా రూ. 25,000 ఫ్లయింగ్‌ అలవెన్స్‌ చెల్లిస్తారు. ఇంజినీర్లకు (గ్రౌండ్‌ డ్యూటీ విభాగాల్లో విధులు నిర్వర్తించే వారికి) సైతం ట్రేడ్‌ అలవెన్సులు ఉంటాయి.

* ఇక ఉద్యోగుల పిల్లలకూ పలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి త్రివిధ దళాలు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి.. నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు నెలకు రూ. 2,250 చొప్పున చెల్లిస్తారు. ఒకవేళ వసతి గృహంలో ఉండి చదువుకుంటే ఒక్కొక్కరికీ నెలకు రూ. 6,750 చొప్పున హాస్టల్‌ సబ్సిడీ అందుతుంది.

* వీటితో పాటు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, కుటుంబానికి ఆరోగ్య ఇన్సూరెన్స్‌, రాయితీతో కూడిన ప్రయాణాలు, గృహ-వాహన రుణాలకు వడ్డీల్లో రాయితీలు, చదువుల్లో పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్లు.. ఇలా ఎన్నో ప్రోత్సాహకాలున్నాయి.

* ఏటా 60 వార్షిక, 20 సాధారణ సెలవులు ఉంటాయి.

వీళ్లకు ప్లస్‌ అవుతుంది!

ఎన్‌డీఏ పరీక్షలో అర్హత సాధించడానికి ప్రతిభే కొలమానం అయినప్పటికీ.. వ్యక్తిగతంగా ఉండే కొన్ని అదనపు నైపుణ్యాలు ఆయా విభాగాల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. పాఠశాల దశ నుంచే NCCలో శిక్షణ తీసుకోవడం వల్ల త్రివిధ దళాల గురించి ముందే ఓ అవగాహన ఏర్పడుతుంది. అలాగే వారికి మిలిటరీ ట్రైనింగ్‌, డ్రిల్‌.. వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. వీటితో పాటు వివిధ రకాల క్యాంపుల్లో వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఇలాంటి వారు త్రివిధ దళాల్లో ప్రవేశించడం, అందులో రాణించడం మరింత సులువవుతుంది.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే అమ్మాయిలకూ ఈ పరీక్షలో అర్హత సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే.. ఇంటి పనులు, పొలం పనులతో పాటు కొన్ని కష్టతరమైన పనులు చేయడానికీ వీళ్లు వెనకాడరు. తద్వారా వారి దేహదారుఢ్యం, ఫిట్‌నెస్‌ మెరుగ్గా ఉంటాయి. అలాగే ఆరోగ్యం విషయంలోనూ వీళ్లు మెరుగ్గానే ఉంటారు. త్రివిధ దళాల్లో ఉద్యోగానికి అర్హత సాధించాలన్నా, అందులో రాణించాలన్నా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడమూ ముఖ్యమే కదా మరి!

ఏడాదికి రెండుసార్లు!

NDA ప్రవేశ పరీక్షలో మహిళలకు అవకాశమిస్తూ తాజాగా రెండోసారి నోటిఫికేషన్‌ వెలువడింది. ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఇటీవలే పూర్తయిన పరీక్ష కోసం లక్షన్నర మందికి పైగా అమ్మాయిలు దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరవగా.. అందులో నుంచి 1002 మంది రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇక తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. డిసెంబర్‌ 22, 2021 నుంచి జనవరి 11, 2022 దాకా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఏప్రిల్‌ 10న నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అలాగే ఫిట్‌నెస్‌ పరీక్షలో భాగంగా.. సాధారణ పరీక్షలతో పాటు మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షల్ని కూడా నిర్వహిస్తారు.
ఇక ఆర్మీలో 208 (మహిళా అభ్యర్థుల కోసం 10), నేవీలో 42 (మహిళలకు 3), వైమానిక దళంలో 120 (మహిళలకు 6).. ఖాళీలున్నాయి.

నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, శారీరక పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం UPSC వెబ్ సైట్ చూడచ్చు. (https://www.upsc.gov.in/sites/default/files/Notif-NDANA-I-2022-engl-221221.pdf)

ఇలా సాయుధ దళాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచడమే లక్ష్యంగా NDA ప్రవేశ పరీక్షలో మహిళలకు అవకాశం కల్పించడం సానుకూలాంశం. అయితే ఇన్ని చేసినా ఇలాంటి అరుదైన రంగంలోకి మహిళలు రావాలంటే.. అటు ఇంటి నుంచి, ఇటు సమాజం నుంచి వారికి సరైన ప్రోత్సాహం అందాలి. ఈ రంగంపై ఆసక్తి ఉన్న అమ్మాయిలు కూడా సంబంధిత కోర్సుల్ని ఎంచుకోవాలి. ఎన్‌సీసీలో చేరేలా వారిని వెన్నుతట్టాలి. అప్పుడే ఈ రంగంలో స్త్రీపురుష నిష్పత్తిని సరిసమానం చేయగలం.

మరి, ఈ విషయంలో మీరేమంటారు? త్రివిధ దళాల్లో అమ్మాయిల నిష్పత్తి పెరగాలంటే కుటుంబ పరంగా, సమాజ పరంగా ఎలాంటి మార్పులు రావాలంటారు? మీ అభిప్రాయాలు, సూచనలు Contactus@vasundhara.net వేదికగా పంచుకోండి!


Advertisement

మరిన్ని