క్రిస్మస్‌ చెట్టు ఇంట్లోనే పెంచుకోవాలంటే..!

ఆనందానికి, పచ్చదనానికి ప్రతీక క్రిస్మస్ చెట్టు.. సాధారణంగా కొనిఫెర్ జాతికి చెందిన మొక్కలను క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ట్రీలుగా అలంకరిస్తారు. ఎందుకంటే ఈ రకమైన మొక్కలు ఏడాది పొడవునా పచ్చగానే కనిపిస్తాయి.

Published : 25 Dec 2023 12:07 IST

ఆనందానికి, పచ్చదనానికి ప్రతీక క్రిస్మస్ చెట్టు.. సాధారణంగా కొనిఫెర్ జాతికి చెందిన మొక్కలను క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ట్రీలుగా అలంకరిస్తారు. ఎందుకంటే ఈ రకమైన మొక్కలు ఏడాది పొడవునా పచ్చగానే కనిపిస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల వాటిలాగే మన జీవితం కూడా ఎప్పటికీ పచ్చగానే ఉంటుందని చాలామంది భావిస్తారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చెట్టును అందంగా అలంకరిస్తారు. ఈ చెట్టుకు ఎప్పుడూ ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదని భావిస్తారు. ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నా.. గార్డెనింగ్ పట్ల మక్కువ ఉన్న వాళ్లు ఈ సమయంలో కొత్త మొక్కల్ని కొని వాటిని అలంకరిస్తుంటారు. మరి, క్రిస్మస్ ట్రీని ఎలా పెంచుకోవాలో చూద్దామా?

నాటుకోవడం ఇలా..

సైజును బట్టి ఈ మొక్కను పెంచడానికి మూడు నుంచి నాలుగు అడుగుల స్థలం అవసరమవుతుంది. అదే కుండీ అయితే కొంచెం పెద్ద సైజు కుండీ ఎంచుకుంటే ఎక్కువ కాలం అందులోనే ఉంచడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ మొక్కను పెట్టే ప్రదేశం మరీ ఎక్కువ ఎండ తగలకుండా, గాలి బలంగా వీచని చోటై ఉండాలి. మొక్కను తెచ్చి నాటుకునే ముందు మట్టి మొత్తం మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ఈ మొక్కకు ఉన్న రూట్ బాల్ మీద కనీసం నాలుగు అంగుళాల మట్టి ఉండేలా గుంతను తవ్వి అందులో మొక్కను నాటుకోవాలి. నాటుకునే ముందు రూట్ బాల్ చుట్టూ ఉన్న సన్నని వేళ్లను కట్ చేసి నాటుకోవాలి. తర్వాత ఎక్కడా ఖాళీ లేకుండా నాలుగు అంగుళాల మందంలో మట్టి కప్పి తర్వాత నీళ్లు పోయడం వల్ల మట్టి సెట్ అవుతుంది. తర్వాత మీద గోనెసంచి లేదా గడ్డి వేసి దాన్ని తడుపుతూ ఉండాలి. ఈ మొక్క వేళ్ల దగ్గర ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి.

చీడపీడలు ఎక్కువే..

ఎప్పుడూ తడిగానే ఉంటుంది కాబట్టి ఈ మొక్కలకు చీడపీడల బెడద ఎక్కువగానే ఉంటుంది. అందుకే సహజసిద్ధంగా చీడపీడలను నివారించే వేపనూనె, వేపపిండి లాంటివి ఉపయోగించవచ్చు. తడిదనం ఉండటం వల్ల మొక్క చుట్టూ రకరకాల పిచ్చి మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ మొక్కకు ప్రతి సంవత్సరం వసంతకాలంలో ఎరువులు వేయడం వల్ల బాగా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకోవడం వల్ల సరైన షేప్‌లో దీన్ని పెంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్