ఎక్కువైతే ఇలా తగ్గించచ్చు!

మాంసం ముదిరినా ఉడకదు.. కూరలో కారం, ఉప్పు ఎక్కువైనా కష్టమే.. స్వీట్స్‌ మరీ తియ్యగా ఉన్నా తినలేం.. మరి, ఇలాంటప్పుడు ఏం చేయాలి?

Published : 11 Feb 2022 20:38 IST

మాంసం ముదిరినా ఉడకదు.. కూరలో కారం, ఉప్పు ఎక్కువైనా కష్టమే.. స్వీట్స్‌ మరీ తియ్యగా ఉన్నా తినలేం.. మరి, ఇలాంటప్పుడు ఏం చేయాలి?

మాంసం ఉడక్కపోతే..!

కొన్ని సందర్భాల్లో చికెన్‌ లేదా మటన్‌ ఎంత సేపు ఉడికించినా ఉడకదు. అలాంటి కూర రుచించదు. ఫలితంగా కూరంతా వృథా అయిందే అని బాధపడకుండా ఈ చిట్కాను పాటించి చూడండి! ముదిరిన మాంసం వండినప్పుడే ఇలాంటి సమస్య తలెత్తుతుంది. కాబట్టి వండే ముందే దానికి మసాలా, కాస్త పెరుగు కలిపి పూర్తిగా చల్లబడే వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. లేదంటే మాంసాన్ని ఉడికించే క్రమంలో కొద్దిగా పచ్చి బొప్పాయి ముక్కను చేర్చినా ఫలితం ఉంటుంది.

తీపి తగ్గాలంటే..

ఇంట్లో స్వీట్స్‌ తయారు చేసేటప్పుడు ఒక్కోసారి కావాల్సిన మొతాదు కంటే చక్కెర ఎక్కువ అవచ్చు. అలా తీపి ఎక్కువైన పదార్థాలను కొంచెం తినగానే మొహం మొత్తేస్తాయి. అటువంటుప్పుడు వాటిని తినడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే వాటిలో కాస్త నిమ్మరసం కలిపితే ఫలితం ఉంటుంది. అలాగే వెనిగర్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిని మరీ ఎక్కువగా కలపకూడదని గుర్తుంచుకోవాలి.

అన్నం పొడిపొడిగా..!

బియ్యం స్టౌపై పెట్టి కొన్నిసార్లు మరచిపోతుంటాం. దీనివల్ల అన్నం మెత్తబడుతుంది. మరి ఇలా కాకుండా అన్నం పొడిగా రావాలంటే వండేటప్పుడు చెంచా చొప్పున నూనె, నిమ్మరసం కలపాలి. దీనివల్ల అన్నం పొడిగా, తెల్లగా కూడా ఉంటుంది.

కారం తగ్గడానికి..

సరిపోతుందా? లేదా? అని ఒకసారి.. మరీ కారం తక్కువుంటే ఏం బావుంటుంది? అని ఇంకోసారి.. ఇలా కూరల్లో కాస్త కారం దట్టించేవాళ్లు ఎక్కువగానే ఉంటారు. అయితే ఈసారి కూరలో కారం ఎక్కువైనప్పుడు చెంచా చక్కెర కలిపి చూడండి. ఎంతటి కారంమైనా ఇట్టే తగ్గిపోతుంది. చక్కెర కలపడం వల్ల రుచి చెడిపోతుందనుకునేవారు నిమ్మరసం పిండుకోవచ్చు.. లేదంటే టొమాటోలను నూనెలో వేయించి మెత్తగా రుబ్బి కూరలో కలిపినా సరిపోతుంది.

పులుపు ఎక్కువైందా?

కొంతమందికి పులుపంటే మహా ఇష్టం. మరికొందరు పులుపు తగిలితే ఆ పదార్థాన్ని తినలేరు. కొన్నిసార్లు చింతపండు ఎక్కువ వేయడం వల్ల కూరల్లో పులుపు ఎక్కువై పోతుంది. పులుపుని బాగా ఇష్టపడేవారు కూడా ఆ సమయంలో తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఇలాంటప్పుడు బెల్లం వంటి కాస్త తియ్యగా ఉండే పదార్థాన్ని జోడిస్తే పులుపు తగ్గిపోతుంది. లేదా ఉప్పు కలిపినా సరిపోతుంది. అయితే ఉప్పు కలిపేటప్పుడు రుచి చూసుకుంటూ కలుపుకోవడం వల్ల ఎక్కువ కాకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్