చదివించలేదని నిందిస్తోంది.. అల్లుడు రెచ్చగొడుతున్నాడు..!

మాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి చదువుపై ఆసక్తి చూపించకపోవడంతో ఇంటర్‌ పూర్తి కాగానే పెళ్లి చేశాం. మా చిన్నమ్మాయికి చదువంటే చాలా ఆసక్తి. ఇప్పుడు తను అమెరికాలో చదువుకుంటోంది. కానీ, మా పెద్దమ్మాయి మమ్మల్ని అపార్థం చేసుకుంది. తన చదువును మేమే ఆపేసి పెళ్లి చేశామని....

Published : 20 Oct 2022 12:51 IST

మాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి చదువుపై ఆసక్తి చూపించకపోవడంతో ఇంటర్‌ పూర్తి కాగానే పెళ్లి చేశాం. మా చిన్నమ్మాయికి చదువంటే చాలా ఆసక్తి. ఇప్పుడు తను అమెరికాలో చదువుకుంటోంది. కానీ, మా పెద్దమ్మాయి మమ్మల్ని అపార్థం చేసుకుంది. తన చదువును మేమే ఆపేసి పెళ్లి చేశామని నన్ను, నా భర్తను నిందిస్తోంది. అందుకు మా అల్లుడు కూడా సహకరిస్తున్నాడు. మరింతగా రెచ్చగొడుతున్నాడు. దాంతో తను తన చెల్లితో మాట్లాడడం లేదు. మా ఇంటికి రావడం కూడా మానేసింది. తనలోని అపోహలు, కోపం పోవాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి గల కారణాలను ఆమెకు స్పష్టంగా తెలియజేయండి. తను చదువుపై ఆసక్తి కనబరచకపోవడంతో తన ఇష్టంతోనే పెళ్లి చేశారన్న విషయాన్ని స్పష్టం చేయండి. అయితే గతం గురించి ఆలోచించడం, బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చదువుకోవాలంటే అందుకు దృఢమైన సంకల్పం ఉండాలి. అంతేకానీ, ఇంకొకరి మీద నింద వేయడం సరికాదు. ఇప్పటికీ మీ అమ్మాయి చదువుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌తో పాటు వివిధ యూనివర్సిటీలు దూరవిద్య కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి రెగ్యులర్‌ విద్యార్థుల మాదిరిగానే సమాన అవకాశాలూ లభిస్తున్నాయి. మీ అమ్మాయికి నిజంగా చదువుకోవాలనే కోరిక, సంకల్పం ఉంటే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆన్‌లైన్ / దూరవిద్య కోర్సుల్లో చేరమనండి. అందుకు మీ వంతుగా సహాయం చేసే ప్రయత్నం చేయండి.

ఇక, మీ అమ్మాయిని అల్లుడు రెచ్చగొడుతున్నాడని చెప్పారు. ఇది చాలా తప్పు. వీలైతే అతను అలా రెచ్చగొట్టడానికి గల అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చెప్పిన విషయాలను బట్టి మీ అమ్మాయికి ఇతరుల మాటలు విని రెచ్చిపోయే మనస్తత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే చెల్లితో పోల్చుకుంటూ ఆత్మ న్యూనత, అభద్రతాభావంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వీటిని దూరం చేసుకోవడానికి మంచి సైకాలజిస్ట్‌ని సంప్రదించడం మంచిది.

ఆమెకు నిజంగా చదువుకోవాలనే సంకల్పం ఉంటే ఇప్పటినుంచైనా చదువుకోమని చెప్పండి. దానివల్ల విషయ పరిజ్ఞానంతో పాటు తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఫలితంగా అపోహలు, అపార్థాలు కూడా తగ్గుతాయి.  ఒకవేళ తను ఇదే మనస్తత్వంతో ఉంటే ఆమెలో ఒత్తిడి, ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు పరిష్కారం మరింత క్లిష్టమవుతుంది.  కాబట్టి సాధ్యమైనంత వరకు ఆమె నుంచి ఆ వ్యతిరేక ఆలోచనలను దూరం చేసే ప్రయత్నం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్