క్రిస్మస్ చెట్టు కాంతులీనేలా...

క్రిస్మస్ పండగ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు, స్టార్స్, శాంటాక్లాజ్.. అయితే వీటిలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది మాత్రం క్రిస్మస్ చెట్టే. ఈ పండగకు దాదాపు కొన్ని రోజుల ముందు నుంచే ఇళ్లల్లో, షాపింగ్ మాల్స్‌లో, చర్చిల్లో.. ఈ చెట్టును అత్యంత రమణీయంగా అలంకరిస్తుంటారు.

Updated : 21 Dec 2021 20:13 IST

క్రిస్మస్ పండగ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు, స్టార్స్, శాంటాక్లాజ్.. అయితే వీటిలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది మాత్రం క్రిస్మస్ చెట్టే. ఈ పండగకు దాదాపు కొన్ని రోజుల ముందు నుంచే ఇళ్లల్లో, షాపింగ్ మాల్స్‌లో, చర్చిల్లో.. ఈ చెట్టును అత్యంత రమణీయంగా అలంకరిస్తుంటారు. సాధారణంగా స్ప్రూస్, పైన్ లేదా ఫిర్ వంటి కొనిఫెర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు) జాతికి చెందిన చెట్లను క్రిస్మస్ ట్రీగా అలంకరిస్తుంటారు. అయితే కొంతమంది ఈ చెట్టును ఇంట్లోనే పెంచుకుంటే.. మరికొంతమంది కృత్రిమ చెట్టును వాస్తవికత ఉట్టిపడేలా ముస్తాబు చేస్తారు. ఏదేమైనా క్రిస్మస్ చెట్టును కాంతులీనేలా, ఆకర్షణీయంగా అలంకరించడమెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవండి..

* క్రిస్మస్ చెట్టు అలంకరణలో భాగంగా పూర్వం చెట్టు చుట్టూరా స్టాండుల్లో కొవ్వొత్తులను వెలిగించేవారు. కాలక్రమేణా వాటి బదులు ఫ్లోరసెంట్ బల్బుల వాడకం పెరిగింది. క్రిస్మస్ చెట్టు చుట్టూరా వివిధ రంగుల్లో ఉండే ఫ్లోరసెంట్ బల్బులను వేలాడదీస్తారు. దీనివల్ల రాత్రుళ్లు చెట్టు మిరుమిట్లు గొలుపుతుంటుంది.

* రాత్రి అయితే ఫ్లోరసెంట్ బల్బులు వేస్తాం కాబట్టి బాగా కనిపిస్తుంది. అదే పగలంతా అవి వేసినా లైటింగ్ పెద్దగా కనిపించదు కాబట్టి పగటిపూట చెట్టు మెరుస్తూ ఉండేలా కనిపించడానికి చెట్టు చుట్టూరా రంగురంగుల మెరుపు కాగితాలు కట్టడం, వేలాడదీయడం.. వంటివి చేస్తారు.

* కొంతమంది క్రిస్మస్ చెట్టును వివిధ రకాల ఆభరణాలతో కూడా అలంకరిస్తారు. వీటితో పాటు ప్లెయిన్ లేదా చెమ్కీలు, పూసలతో వెరైటీగా అలంకరించిన ఆర్నమెంటల్ బల్బులను కూడా చెట్టుకు వేలాడదీస్తారు. వీటన్నిటి వల్ల చెట్టుకు మరింత రిచ్ లుక్ వస్తుంది.

* కొంతమంది క్రిస్మస్ చెట్టుకు చిన్న చిన్న గంటలు కూడా వేలాడదీస్తారు. రంగు రంగుల ఈ చిన్న బెల్స్ కూడా దాని శోభను మరింత పెంచుతాయి. ఈ చెట్టుకు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదని కూడా చాలామంది నమ్మకం.

* క్రిస్మస్ చెట్టును వివిధ ఆహార పదార్థాలతో కూడా అలంకరించవచ్చు. ఉదాహరణకు పండ్లు, వివిధ ఆకారాల్లో ఉండే బిస్కట్లు, జింజర్‌బ్రెడ్, విత్తనాలు, కాయలు, గింజలు.. ఇలా రకరకాల పదార్థాలను క్రిస్మస్ చెట్టు అలంకరణకు ఉపయోగిస్తుంటారు.

* ఇదేవిధంగా క్రిస్మస్ చెట్టును రంగురంగుల, వివిధ రకాల పూలతో లేదా పూలదండలతో కూడా అలంకరిస్తారు. పూలదండల్ని పై నుంచి కిందికి వేలాడదీయడం లేదంటే చెట్టు చుట్టూ సమాంతరంగా ఒక దాని కింద మరొకటి కట్టడం.. ఇలా ఎవరి ఇష్టప్రకారం వారు క్రిస్మస్ చెట్టును అందంగా అలంకరిస్తారు. ఇవేకాకుండా క్రిస్మస్ చెట్టు అలంకరణకు రంగురంగుల కాగితం పూలను కూడా ఉపయోగించవచ్చు.

* కీచెయిన్స్ కలెక్షన్ అంటే చాలామందికి ఇష్టముంటుంది. మీకు కూడా ఆ అలవాటు ఉందా? అయితే ఇప్పటి వరకు సేకరించిన రకరకాల కీచెయిన్స్‌తో కూడా క్రిస్మస్ చెట్టును అందంగా అలంకరించవచ్చు. దీనికోసం చెట్టుకు అక్కడక్కడా కొన్ని కీచెయిన్స్‌ని కడితే సరిపోతుంది.

* గిఫ్ట్ షాపుల్లో గిఫ్ట్ ప్యాక్ చేసిన తర్వాత పైన ఒక చిన్న రిబ్బన్ లాంటిది అతికిస్తుంటారు. ఇలాంటి రంగురంగుల, జాలీల్లా ఉండే రిబ్బన్స్ చెట్టు చుట్టూ కట్టడం లేదా వేలాడదీయడం.. వల్ల చెట్టు ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

* మీ ఇంట్లో చిన్న చిన్న జంతువుల బొమ్మలు చాలానే ఉన్నాయా? అయితే వాటన్నిటినీ సేకరించి.. వాటితో క్రిస్మస్ చెట్టును అలంకరించండి. దీనివల్ల చెట్టు చూపరులను ఆకర్షించేలా తయారవుతుంది.. అలాగే ఇంట్లో ఉన్నా ప్రకృతిలో ఉన్న భావన కలుగుతుంది.

* ప్రత్యేక సందర్భాల్లో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, గ్రీటింగ్ కార్డ్స్ పంచుకోవడం.. వంటివి కామన్. అయితే ఇలాంటి చిన్న చిన్న గ్రీటింగ్ కార్డులను క్రిస్మస్ చెట్టును అలంకరించడానికి కూడా ఉపయోగించచ్చు. అలాగే చిన్న చిన్న అందమైన పేపర్లు, అట్టముక్కల పైన మీకిష్టమైన వాక్యాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా రాసి వాటిని కూడా చెట్టుకు వేలాడదీయచ్చు. ఫలితంగా చెట్టు మరింత ప్రత్యేకంగా తయారవుతుంది.

* క్రిస్మస్ చెట్టును అలంకరించడంలో భాగంగా నింగిని కూడా నేల పైకి దించవచ్చు. అదెలాగంటే చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు.. ఇలా వివిధ ఆకారాల్లో ఉండే బంగారు లేదా వెండి రంగు మెరుపు కాగితాలను లేదా థర్మాకోల్ షీట్లను చెట్టు అలంకరణలో వాడి చూడండి.. చెట్టుకు ఎంత అందం వస్తుందో!

* శీతాకాలం అంటేనే మంచు కురిసే కాలం. క్రిస్మస్ పండుగ కూడా చలికాలంలోనే వస్తుంది. కాబట్టి క్రిస్మస్ చెట్టుపై మంచు కురిసినట్లుగా కూడా అలంకరించవచ్చు. దీనికోసం చెట్టుపై అక్కడక్కడా చిన్న చిన్న దూది ఉండల్ని ఉంచండి. అలాగే చెట్టు కింద మంచు పడినట్టుగా దూదిని పరిస్తే చూడడానికి చాలా బాగుంటుంది.

* అలాగే చెట్టుకు పైభాగంలో స్టార్‌ను (నక్షత్రాన్ని) అమర్చుతారు. దీనిని దేవదూతకు సూచికగా భావిస్తుంటారు. అందులో చిన్న బల్బు ఉంటుంది. ఇది చెట్టుకు ఎంతో అందాన్నిస్తుంది. అలాగే చెట్టుకు అక్కడక్కడా రంగురంగుల మెరుపు కాగితాలతో తయారు చేసిన చిన్న చిన్న నక్షత్రాల్ని అమర్చుకోవచ్చు. దీని వల్ల క్రిస్మస్ కళ ఉట్టిపడుతుంది.

* క్రిస్మస్ పండుగ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మనకు తెలిసిందే. అయితే వాటిని అలా ఒకరికొకరు ఇచ్చుకునే ముందు చక్కగా అలంకరించిన క్రిస్మస్ చెట్టు కింద ఉంచడం సంప్రదాయం. దీంతో క్రిస్మస్ చెట్టు అలంకరణ పరిపూర్ణమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్