ఆ అమ్మాయి చికిత్స కోసం.. దీపిక సాయం!

ముక్కూ మొహం తెలియని వారికి కష్టమొస్తేనే తట్టుకోలేం.. అలాంటిది మనతో కలిసి పనిచేసిన వారు/ మనకు తెలిసిన వారు కష్టాల్లో ఉన్నారంటే ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధపడతాం. ఇక సెలబ్రిటీలైతే మరో అడుగు ముందుకేసి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తుంటారు.

Updated : 04 Sep 2021 16:12 IST

(Photo: Twitter)

ముక్కూ మొహం తెలియని వారికి కష్టమొస్తేనే తట్టుకోలేం.. అలాంటిది మనతో కలిసి పనిచేసిన వారు/ మనకు తెలిసిన వారు కష్టాల్లో ఉన్నారంటే ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధపడతాం. ఇక సెలబ్రిటీలైతే మరో అడుగు ముందుకేసి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తుంటారు. బాలీవుడ్‌ లవ్లీ బ్యూటీ దీపికా పదుకొణె ప్రస్తుతం అదే చేసింది. బాల ప్రజాపతి అనే యాసిడ్‌ దాడి బాధితురాలిని ఆదుకోవడానికి ముందుకొచ్చింది. మూత్రపిండాల సమస్యతో కొట్టుమిట్టాడుతోన్న ఆమెకు మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్‌ కోసం రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందించి తన వెన్నలాంటి మనసును మరోసారి చాటుకుంది.

 

మనసున్న తార!

తెరపై నటిగానే కాదు.. తెర వెనుక మనసున్న నాయికగా నిరూపించుకుంది దీపిక. గతంలో పలు కారణాల వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఆమె.. తనలాంటి మానసిక వేదన మరెవరూ పడకూడదని ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. ఈ వేదికగా మానసిక రోగులకు కొత్త జీవితాన్నిస్తోందీ అందాల తార. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతూ అందరిలో అవగాహన పెంచే దీప్స్‌.. ప్రస్తుత కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ మానసిక ఆరోగ్యం కోసం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే తన ఎన్జీవో వేదికగా ‘Frontline Assist’ పేరుతో ఈ మధ్యే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించిందామె. దీని ద్వారా వారిలోని మానసిక ఒత్తిళ్లను బయటికి చెప్పించి.. వారికి నిపుణుల కౌన్సెలింగ్‌ ఇప్పిస్తోంది.

ఆ బాధితురాలి కోసం..!

ఇక ఇప్పుడు మరోసారి తన మంచి మనసును చాటుకుంది దీపిక. బాల ప్రజాపతి అనే యాసిడ్‌ దాడి బాధితురాలి మూత్రపిండాల చికిత్స కోసం సహాయం చేయడానికి ముందుకొచ్చిందామె. రెండు మూత్ర పిండాలు దెబ్బతిని ప్రస్తుతం దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో సహాయం కోసం ఎదురుచూస్తోంది బాల. ఆమెకు కిడ్నీల మార్పిడి ఆపరేషన్‌ చేయాలని, అందుకోసం రూ. 16 లక్షలు ఖర్చవుతాయని తెలుసుకున్న దీప్స్‌.. రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఇప్పటికే యాసిడ్ దాడి బాధితుల కోసం పనిచేస్తోన్న Chhanv Foundation బాల చికిత్స కోసం నిధులు సేకరిస్తోంది. ఈ క్రమంలో తన సహాయాన్ని ఈ సంస్థకు అందజేసి బాలను ఆదుకుందీ అందాల తార. అంతేకాదు.. ఇతరుల్నీ తమకు తోచిన సహాయం చేయమని కోరుతోంది.

అసలెవరీ బాల?

తొమ్మిదేళ్ల క్రితం వరకు బాల ప్రజాపతి కూడా మనలా ఎంతో చలాకీగా ఉండే అమ్మాయే! ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో పుట్టి పెరిగిన ఆమె.. తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంది. కానీ 2012లో ఆమె కన్న కలలన్నీ బుగ్గిపాలయ్యాయి. ఆమె కుటుంబంతో శత్రుత్వం ఉన్న ఓ వ్యక్తి ఓ రోజు ఆమెపై, ఆమె తాత గారిపై యాసిడ్‌ దాడి చేశాడు. దీంతో ఆమె తాతయ్య చనిపోగా.. బాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆమె చేతులు, గొంతు, ముఖం బాగా దెబ్బతిన్నాయి. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమెకు 12 ఆపరేషన్లయ్యాయి. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ దారులు కావడం, నలుగురు పిల్లల్లో బాలే పెద్దది కావడంతో.. తను తన తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలనుకుంది.

ఆన్‌స్క్రీన్ పైనా!

సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలోనే అన్షు అనే మరో ఆమ్లదాడి బాధితురాలిని కలుసుకున్న బాల.. ఆమె సలహాతోనే 2017లో షీరోస్ హ్యాంగౌట్‌ కేఫ్‌లో పనిలో చేరింది. ఆమ్లదాడి బాధితుల్ని సాధికారత దిశగా నడిపించేందుకు ఏర్పాటైన సంస్థ ఇది. ఇందులో పనిచేస్తూనే స్వతంత్రంగా బతకడం నేర్చుకుందామె. అయితే దాడి తర్వాత ఆమె శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఫలితంగా రెండు కిడ్నీలు దెబ్బతినడంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఎదురుచూస్తోంది. ఇలా కేవలం తెర వెనుకే కాదు.. వెండితెర పైనా మెరిసింది బాల. దీపిక నటించిన ‘ఛపాక్‌’ సినిమాలోనూ బాల కనిపిస్తుంది. అంతేకాదు.. కపిల్‌ శర్మ షోలోనూ సందడి చేసి ఆమ్లదాడి బాధితుల్లో స్ఫూర్తి నింపిందీ బ్రేవ్‌ గర్ల్.

ప్రస్తుతం దీపిక సహాయం అందుకున్న బాల ఆపరేషన్‌ సక్సెస్‌ కావాలని, త్వరలోనే కోలుకొని తిరిగి తన పనుల్లో బిజీ కావాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ బాల!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్