ఈ ప్యాక్స్‌తో చలికాలంలోనూ కురులు ఆరోగ్యంగా..

వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరగాలంటే అందుకు ప్రొటీన్ ఎంతో అవసరం అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి, అది పుష్కలంగా లభించే కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడంతోపాటు దాంతో కొన్ని హెయిర్‌ప్యాక్స్ తయారుచేసుకొని ఉపయోగిస్తే జుట్టు మరింత ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.

Published : 03 Jan 2022 21:43 IST

వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరగాలంటే అందుకు ప్రొటీన్ ఎంతో అవసరం అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి, అది పుష్కలంగా లభించే కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడంతోపాటు దాంతో కొన్ని హెయిర్‌ప్యాక్స్ తయారుచేసుకొని ఉపయోగిస్తే జుట్టు మరింత ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో జుట్టు విషయంలో ఎదురయ్యే చుండ్రు, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలకూ గుడ్లు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. ఇంతకీ కోడిగుడ్డుతో ఇంట్లోనే లభించే పదార్థాలను కలిపి తయారుచేసుకునే ఈ హెయిర్‌ప్యాక్స్ ఏంటి? అవి జుట్టు ఆరోగ్యానికి ఏవిధంగా దోహదం చేస్తాయి.. వంటి విషయాలన్నీ మీకోసం..

ప్రకాశవంతంగా..

సాధారణంగా శీతాకాలంలో ఉండే చల్లని గాలుల కారణంగా జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. ఈ క్రమంలో కురులను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు గుడ్లు, తేనె, అరటిపండుతో తయారుచేసిన హెయిర్‌ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గుడ్డు, బాగా పండిన అరటిపండు గుజ్జు, మూడు టేబుల్‌స్పూన్ల తేనె, మూడు టేబుల్‌స్పూన్ల పాలు, ఐదు టేబుల్‌స్పూన్ల ఆలివ్ నూనె.. వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని బ్లెండర్ సహాయంతో బాగా కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఈ ప్యాక్ నిర్జీవంగా మారిన కురులకు తగినంత తేమనందించడంతో పాటు కేశాల్ని దృఢంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.

కండిషనర్‌లా..

జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్ కావాలంటే గుడ్డు, పెరుగుతో చేసిన హెయిర్‌ప్యాక్ వేసుకోవాల్సిందే. ముందుగా ఒక బౌల్‌లో కోడిగుడ్డు తీసుకొని దానిని బాగా గిలక్కొట్టాలి. తర్వాత అందులో నాలుగు టేబుల్‌స్పూన్ల పెరుగు, ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం జుట్టుకు పట్టించి గంటపాటు ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడం, చుండ్రు.. వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తూనే కేశాలకు చక్కటి కండిషనర్‌లా కూడా ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది.

తేమను అందించండిలా..!

బాదం, కొబ్బరి వంటి అత్యవసర నూనెల్లో జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే ఈ నూనెల్ని కోడిగుడ్డుతో కలిపి ప్యాక్ తయారుచేసి ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. బాదంపాలు ఐదు టేబుల్ స్పూన్‌లు, కోడిగుడ్డులోని తెల్లసొన నాలుగు టేబుల్ స్పూన్‌లు, కొబ్బరినూనె రెండు టేబుల్ స్పూన్‌లు.. ఈ మూడింటినీ ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకోవాలి. గంటపాటు ఆరనిచ్చిన తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ప్యాక్ కేశాలకు తేమనందించి జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది.

దృఢమైన కేశాలకు..

నిర్జీవంగా తయారైన జుట్టును తిరిగి ప్రకాశవంతంగా మార్చే శక్తి కలబందకు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని కోసం కలబంద, గుడ్డు, ఆలివ్ ఆయిల్‌తో తయారుచేసిన హెయిర్‌ప్యాక్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం. గుడ్డులోని పచ్చసొన, నాలుగు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జు ఒక గిన్నెలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఆఖరున కాస్త వేడి చేసిన ఆలివ్ ఆయిల్ వేసి మరోసారి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ జుట్టును మరింత దృఢంగా మార్చడంలో సహకరిస్తుంది.

ఇవి కూడా..

* రెండు చెంచాల మెంతుల్ని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని వడకట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిలో గుడ్డు కూడా వేసి మరోసారి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టుకు అప్త్లె చేసి గంటపాటు అలాగే ఉంచుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.

* రెండు కోడిగుడ్లు తీసుకొని వాటిలోని సొన (తెలుపు+పచ్చ)ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల మయొనైజ్ వేసి బాగా గిలక్కొట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కేశాలు, కుదుళ్లకు పట్టించి షవర్ క్యాప్‌తో కవర్ చేసుకోవాలి. అరగంటసేపు ఆరనిచ్చి తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. తద్వారా కుదుళ్ల నుంచి చివర్ల వరకు కేశాలకు తేమ అందడం మాత్రమే కాకుండా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తాయి.

* జిడ్డుగా మారిన కేశాలను సాధారణ స్థితికి తీసుకురావాలంటే ఈ ప్యాక్ చక్కగా సహకరిస్తుంది. ఇందుకోసం రెండు గుడ్లలోని తెల్ల సొన తీసుకొని దానికి ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కురులకు జాగ్రత్తగా అప్త్లె చేసుకోవాలి. అయితే ఈ ప్యాక్ కుదుళ్లకు అంటుకోకుండా జాగ్రత్తపడాలి. ఓ అరగంట పాటు ఆరనిచ్చి ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకుంటే అందమైన కేశాలు మీ సొంతమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్