నెలసరిని సౌకర్యవంతంగా మార్చడమే మా ఉత్పత్తుల లక్ష్యం!
నెల తిరిగేసరికల్లా పలకరించే నెలసరిని చాలామంది శాపంలా భావిస్తారు. కానీ ఇది మన శరీర ధర్మం. అయితే ఈ విషయం తెలిసి కూడా ఇబ్బంది పడడం కంటే.. ఆ అసౌకర్యాన్ని దూరం చేసుకొని నెలసరిని....
నెల తిరిగేసరికల్లా పలకరించే నెలసరిని చాలామంది శాపంలా భావిస్తారు. కానీ ఇది మన శరీర ధర్మం. అయితే ఈ విషయం తెలిసి కూడా ఇబ్బంది పడడం కంటే.. ఆ అసౌకర్యాన్ని దూరం చేసుకొని నెలసరిని ఆస్వాదించే మార్గాల్ని వెతుక్కుంటే పిరియడ్స్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు. అచ్చంగా ఇదే ఆలోచన చేశారు హైదరాబాద్‌కు చెందిన యువ పారిశ్రామిక వేత్త దేవి దత్తా. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళలు తమ నెలసరి సమయంలో సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ రకాల నెలసరి ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నారామె. కొత్తగా రుతుచక్రంలోకి అడుగుపెట్టిన బాలికల దగ్గర్నుంచి పురుషులుగా మారిన ట్రాన్స్‌జెండర్ల దాకా.. వాళ్ల అవసరాలకు అనుగుణంగా, పర్యావరణహితమైన శ్యానిటరీ ఉత్పత్తుల్ని రూపొందిస్తున్నారు. మరోవైపు నెలసరికి సంబంధించి సమాజంలో ఇప్పటికీ కనిపించే వివిధ మూఢ నమ్మకాలను పోగొట్టడానికి తన వంతుగా కృషి చేస్తోన్న దేవి.. తన వ్యాపార ప్రయాణాన్ని, ఈ క్రమంలో తనకెదురైన అనుభవాల్ని ‘వసుంధర.నెట్’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
మాది హైదరాబాద్. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిపెరిగాను. నాన్న విశ్రాంత ప్రభుత్వ అధికారి. అమ్మ సోషల్ ఆంత్రప్రెన్యూర్. ICFAI యూనివర్సిటీలో ‘బయోటెక్ ఇంజినీరింగ్’ పూర్తి చేశా. ఆస్ట్రేలియాలోని RMIT విశ్వవిద్యాలయంలో ‘డిజైన్ థింకింగ్’ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చదివాను. చదువు పూర్తికాగానే ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగమొచ్చింది. సుమారు 12 ఏళ్ల పాటు వివిధ సంస్థల్లో వేర్వేరు హోదాల్లో పనిచేశా.
ఆ ఆలోచనే బీజం వేసింది!
సమాజ సేవ చేస్తోన్న అమ్మను చూసి నేనూ స్ఫూర్తి పొందా. చదువుకునే రోజుల్లో పలు స్వచ్ఛంద సంస్థల్లో వలంటీర్‌గా సేవలందించాను. రెడ్క్రాస్‌లో వలంటీర్‌గా ఉన్నప్పుడు నెలసరిపై అవగాహన కల్పించే పలు బృందాలతో కలిసి పనిచేశా. ఈ క్రమంలో అమ్మాయిలు నెలసరి సమయంలో ఎదుర్కొంటోన్న ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ప్రస్తుతం మన సమాజంలో పిరియడ్స్‌పై ఎన్నో అపోహలున్నాయి. చాలామందికి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల పైనా అవగాహన లేదు. ఇక దీని గురించి నలుగురిలో మాట్లాడడాన్నీ తప్పు పడుతుంటారు కొందరు. సమాజం నుంచి విమర్శలెదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయంతో తమ సమస్యల్ని బయటికి చెప్పుకోవడానికీ సిగ్గుపడుతుంటారు. వీటిని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యాల బారిన పడక తప్పదు. అందుకే ఇవన్నీ ఆలోచించి, ఇంకాస్త లోతుగా పరిశోధించి.. నెలసరి పరిశుభ్రత ప్రమాణాల్ని పెంచే ఉత్పత్తుల్ని తయారుచేయాలనుకున్నా. ఈ ఆలోచన నుంచి పుట్టిందే Lemme Be. 2020లో దీన్ని ప్రారంభించా. వినియోగదారుల అవసరాన్ని బట్టి.. సౌకర్యవంతమైన, పర్యావరణహితమైన నెలసరి ఉత్పత్తుల్ని తయారుచేసే బ్రాండ్ ఇది.
వాళ్లకు ప్రత్యేకం!
కొత్తగా రుతుచక్రం ప్రారంభమైన అమ్మాయిలు ఈ సమయంలో ఒక రకమైన అసౌకర్యానికి గురవుతుంటారు. నెలసరి ఉత్పత్తుల్ని ఎంచుకునే విషయంలోనూ వారిలో వివిధ సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఈ సందిగ్ధాన్ని దూరం చేసి వారు తమ నెలసరి సమయంలో సౌకర్యవంతంగా ఉండేలా చేయడమే లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తోంది. ఈ క్రమంలోనే రుతుక్రమం ప్రారంభమైన బాలికలు మొదలుకొని అన్ని వర్గాల మహిళలకు సౌకర్యాన్ని, ఆరోగ్యాన్ని అందించే ముఖ్యోద్దేశంతోనే విభిన్న నెలసరి ఉత్పత్తులు మా వద్ద తయారవుతున్నాయి. శ్యానిటరీ ప్యాడ్స్, ట్యాంపన్స్, మెన్‌స్ట్రువల్ కప్స్, మెన్‌స్ట్రువల్ డిస్క్స్, హీటింగ్ ప్యాడ్స్, బ్లీడింగ్‌ను బట్టి పగలు-రాత్రి ఉపయోగించుకునే శ్యానిటరీ ప్యాడ్స్, ప్యాంటీ లైనర్స్, పిరియడ్ అండర్‌వేర్.. వంటివి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే మహిళలే కాదు.. పురుషులుగా మారిన మహిళలకూ (ట్రాన్స్ మెన్) నెలసరి వస్తుంటుంది. అలాంటి వారి కోసం ప్రత్యేకమైన పిరియడ్ ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నాం. ఇదే మార్కెట్లో మమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఎంతోమంది వినియోగదారులకు మా బ్రాండ్‌ను చేరువ చేసింది.
దేని ప్రత్యేకత దానిదే!
ఇక మా ఉత్పత్తుల్లో పిరియడ్ అండర్‌వేర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్లీడింగ్‌తో పాటు యూరిన్, వెజైనల్ డిశ్చార్జ్, చెమట.. వంటి వాటిని సుమారు 120 ఎంఎల్ పరిమాణం దాకా ఇది పీల్చుకోగలుగుతుంది. ఇక బ్లీడింగ్‌ను బట్టి (లైట్, మీడియం, హెవీ) మూడు రకాల ట్యాంపన్స్ మా వద్ద దొరుకుతున్నాయి. ఆయా రకాన్ని బట్టి ఇవి 4-8 గంటల పాటు రక్షణనిస్తాయి. ప్యాడ్స్, ట్యాంపన్స్‌ని.. GOTS (Global Organic Textile Standard) ఆమోదిత, వంద శాతం సహజసిద్ధమైన కాటన్, ఆక్సో-బయోడీగ్రేడబుల్ పదార్థాలతో.. కెమికల్ బ్లీచ్, సువాసనలు ఉపయోగించకుండా తయారుచేస్తున్నాం. తద్వారా వ్యక్తిగత భాగాల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు. ఇక మెన్‌స్ట్రువల్ కప్స్, డిస్క్‌ల విషయానికొస్తే.. వీటిని మెడికల్ గ్రేడ్ సిలికాన్‌తో రూపొందిస్తున్నాం. ఇవి 3-5 ఏళ్ల పాటు మన్నుతాయి. రక్తస్రావాన్ని బట్టి 8-12 గంటల దాకా ఇవి రక్షణనిస్తాయి. సులభంగా ధరించి, తొలగించుకునేందుకు వీలుగా ఉన్న ఈ రెండు ఉత్పత్తుల్ని శుభ్రం చేసుకోవడానికి స్టీమ్ స్టెరిలైజర్ కూడా మా వద్ద దొరుకుతుంది. మా వద్ద లభ్యమయ్యే ఉత్పత్తుల్లో జడ్ కప్, జడ్ డ్రిప్, హెవీ ఫ్లో నైట్ ప్యాడ్స్.. వంటి వాటికి గిరాకీ ఎక్కువగా ఉంది.
అదే నా అంతిమ లక్ష్యం!
మా ఉత్పత్తుల్ని FDA ఆమోదించింది. ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వీటిని విక్రయిస్తున్నాం. ప్రతి నెలా సుమారు 40 వేలకు పైగా కస్టమర్లు మా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, కొచ్చి, ముంబయి, దిల్లీ, జైపూర్.. వంటి నగరాల నుంచి మాకు ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. గతేడాది ‘నేషనల్ లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ అవార్డ్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ’; ఫ్రాంఛైజ్ ఇండియా - ISFA నుంచి ‘స్మాల్ బిజినెస్ అవార్డు - 2022’; వినూత్న ప్యాకేజింగ్ విధానానికి గుర్తింపుగా ఎక్ఛేంజ్ ఫర్ మీడియా నుంచి ‘బ్రాండ్ ఐడెంటిటీ అండ్ ప్యాకేజింగ్ అవార్డు’ అందుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘ఉమన్ ఎహెడ్ అవార్డు’ వరించింది. ఇక నెట్‌వర్కింగ్ విషయంలో వీహబ్ అందించిన ప్రోత్సాహం నా వ్యాపారాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా నా వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. వంద కోట్ల టర్నోవర్‌ను సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. మా బ్రాండ్‌ని దేశంలోనే అత్యుత్తమ పిరియడ్ కేర్ బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలన్నదే నా అంతిమ లక్ష్యం.
అవగాహనతోనే మార్పు!
ప్రస్తుతం సమాజంలో నెలసరిపై ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలున్నాయి. దేశంలో ఇప్పటికీ నెలసరి పేదరికం తొలగకపోవడానికి ఇవే ప్రధాన కారణం. అందుకే పిరియడ్ ఉత్పత్తుల్ని తయారుచేయడమే కాదు.. ఈ అంశంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నా. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా వెబ్‌సైట్లో ‘షేర్ యువర్ స్టోరీ’ పేరుతో మహిళలు తమ పిరియడ్ స్టోరీస్‌ని పంచుకునేందుకు అవకాశమిస్తున్నాం. అంతేకాదు.. వ్యక్తిగత ఆరోగ్యం, లైంగిక ఆరోగ్యం, నెలసరి పరిశుభ్రత.. తదితర అంశాలపై నిపుణులచే అవగాహన కల్పిస్తున్నాం. ఏటేటా నెలసరికి సంబంధించిన ఒక్కో అంశంపై అవగాహన కల్పించాలన్న నియమం పెట్టుకున్నాం. అలా ఈ ఏడాది పిరియడ్ కేర్-నెలసరి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్గాలపై నిపుణుల ఆధ్వర్యంలో బహిరంగ చర్చలు నిర్వహిస్తున్నాం. అయితే ప్రస్తుతం శ్యానిటరీ ప్యాడ్స్ ఉపయోగించినంతగా ట్యాంపన్స్, కప్స్, డిస్క్‌లు వాడడానికి చాలామంది నిరాకరిస్తున్నారు. కానీ ప్యాడ్స్ కంటే ఇవి పర్యావరణహితమైనవి, తిరిగి ఉపయోగించుకోదగినవి. ఈ విషయాన్నీ వినియోగదారులకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాం.
సమస్యకు పరిష్కారం చూపేలా..!
వ్యాపారమంటేనే సవాలు. ఇందులో గెలుపోటములు సహజం. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని వాటిని మన ఉన్నతికి సోపానాలుగా మార్చుకోవాలి. ఈ దిశగా చేసే ప్రయత్నం సమాజంలో ఉన్న సమస్యకు పరిష్కారం చూపేలా ఉండాలి. అలాగే చుట్టూ ఎప్పుడూ మనల్ని ప్రోత్సహించే వ్యక్తులుండేలా చూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.