Published : 12/10/2021 18:01 IST

నల్ల మిరియాలలో కల్తీ.. ఎలా కనిపెట్టాలి?

‘కల్తీకి కాదేదీ అనర్హం’ అన్నట్లు ప్రస్తుతం మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులన్నీ ‘కల్తీ’ మయం అవుతున్నాయి. పాలు, నీళ్లు, కారం, నెయ్యి, వంటనూనెలు, పొడులు, మసాలా దినుసులు... ఇలా మార్కెట్లో దొరికే పదార్థాలన్నీ చాలావరకు కల్తీ ఉత్పత్తులతో కూడి ఉన్నవే. ఇక పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు, రంగు వచ్చి ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిధ రకాల రసాయనాలు వినియోగిస్తున్నారు.

కల్తీని కనిపెట్టేందుకు!

కల్తీ ఉత్పత్తులు, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు ‘భారత ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’ తరచూ కొన్ని చిట్కాలు పంచుకుంటోంది. ‘డిటెక్టింగ్‌ ఫుడ్‌ అడల్ర్టెంట్స్’ పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు పంచుకుంటోంది. వీటి ద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాలు మంచివా? కల్తీవా? అనే విషయాలపై సులభంగా అవగాహన కల్పిస్తోంది. మరి ఆహార పదార్థాల నాణ్యత, స్వచ్ఛతకు సంబంధించి FSSAI ఇటీవల పంచుకున్న కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి.

 

నల్ల మిరియాల్లో వీటిని మిక్స్‌ చేశారా?

సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా చెప్పుకునే నల్ల మిరియాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రతి వంటగదిలోనూ కచ్చితంగా వీటికి ప్రత్యేక స్థానముంటుంది. అయితే వీటికున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు వీటిలో ఎండిన బ్లాక్‌ బెర్రీ (నల్ల నేరేడు)ని మిక్స్‌ చేసి విక్రయిస్తుంటారు. మరికొందరు బొప్పాయి గింజలు కూడా కలుపుతుంటారు. ఇవి చూడడానికి అచ్చం నల్ల మిరియాల్లానే ఉంటాయి కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు వీటిని అసలు గుర్తుపట్టలేం. ఈ నేపథ్యంలో నల్ల మిరియాల్లోని కల్తీని సులభంగా కనిపెట్టేందుకు FSSAI తాజాగా ఓ సింపుల్‌ చిట్కాను పంచుకుంది. అదేంటంటే..

కొన్ని మిరియాలను టేబుల్‌పై ఉంచి బొటనవేలితో నొక్కాలి. సాధారణంగా మిరియాలు కొంచెం గట్టిగా ఉంటాయి. అంత సులభంగా విరగవు. ఒకవేళ విరిగితే అందులో ఎండిన బ్లాక్‌బెర్రీ పండ్లను కలిపినట్లు అర్థం చేసుకోవాలి.

బొప్పాయి గింజలను గుర్తుపట్టండిలా!

ఇక మిరియాల్లోని బొప్పాయి గింజలను గుర్తు పట్టేందుకు... ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో కొన్ని మిరియాలను పోయాలి. ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన మిరియాలు నీటి అడుగు భాగానికి చేరతాయి. అదే బొప్పాయి గింజలు, ఇతర కల్తీ పదార్థాలు కలిపి ఉంటే నీటిపై భాగంలో తేలతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని