కొబ్బరినూనెకు వీటిని కలిపితే...

అనారోగ్యానికి గురై కోలుకుంటున్న స్వప్నకు శిరోజాలు రాలే సమస్య ఎక్కువైంది. ఒత్తుగా ఉండే జుట్టు కాస్తా రోజురోజుకీ పలచబడుతోంది. దీన్ని ఎదుర్కోవాలంటే పోషకాహారంతో పాటు, కొన్ని పూతలు కూడా అవసరమంటున్నారు నిపుణులు.

Published : 03 May 2022 01:22 IST

అనారోగ్యానికి గురై కోలుకుంటున్న స్వప్నకు శిరోజాలు రాలే సమస్య ఎక్కువైంది. ఒత్తుగా ఉండే జుట్టు కాస్తా రోజురోజుకీ పలచబడుతోంది. దీన్ని ఎదుర్కోవాలంటే పోషకాహారంతో పాటు, కొన్ని పూతలు కూడా అవసరమంటున్నారు నిపుణులు.

తేనె... కొబ్బరినూనెలోని లారిక్‌ యాసిడ్‌ మాడును ఆరోగ్యంగా ఉంచుతూ, శిరోజాలను బలంగా మారుస్తుంది. చెంచా గోరువెచ్చని కొబ్బరి నూనెలో చెంచా సహజసిద్ధమైన తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి శిరోజాల చివర్ల వరకు మృదువుగా రాయాలి. ఈ మాస్క్‌ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే చాలు.

ఉసిరి... చెంచా ఉసిరి రసం, రెండు చెంచాల శీకాకాయపొడి, చెంచా కొబ్బరినూనె కలిపిన మిశ్రమాన్ని పొయ్యిపై అయిదునిమిషాలు వేడి చేయాలి. దీన్ని చల్లార్చి వడకట్టగా వచ్చే నూనెను రాత్రి నిద్రపోయే ముందు తలకు పట్టించాలి. మరుసటి ఉదయం తలస్నానం చేస్తే చాలు. ఈ మిశ్రమంలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, సి విటమిన్‌ మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. కుదుళ్లను బలంగా ఉంచి శిరోజాల పెరుగుదలకు తోడ్పడతాయి. శీకాకాయ పొడి జుట్టును బలోపేతం చేసి రాలకుండా చేస్తుంది.

నిమ్మ.. చెంచా చొప్పున కొబ్బరినూనె, నిమ్మ రసాన్ని ఓ గిన్నెలో బాగా కలపాలి. ముందుగా శుభ్రపరిచి ఆరబెట్టిన జుట్టుకు కుదుళ్ల నుంచి ఈ మిశ్రమాన్ని రాసి పావుగంట తర్వాత తల స్నానం చేయాలి. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే నిమ్మరసం కొల్లాజెన్‌ ఉత్పత్తికి దోహదపడి, జుట్టు పెరిగేలా చేస్తుంది. వ్యాధినిరోధక శక్తినీ పెంచి మాడుపై చర్మరంధ్రాలను మూసుకునేలా చేసి, జిడ్డుగా లేకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో శిరోజాలు రాలే సమస్య తగ్గుతుంది.

అరటిపండుతో... సగం అరటిపండును గుజ్జులా చేసి అందులో చెంచా చొప్పున కొబ్బరినూనె, నారింజ రసం కలిపిన మిశ్రమాన్ని మాడుకు మర్దన చేయాలి. 20 నిమిషాలాగి తల స్నానం చేయాలి. అరటిపండు జుట్టుకు మృదుత్వాన్ని అందిస్తుంది. చివర్లు చిట్లే సమస్యనూ దూరం చేస్తుంది. జుట్టు బాగా పల్చబడిన వారు ఒక గుడ్డులోని పసుపు సొనను గిన్నెలోకి తీసుకొని రెండు చెంచాల కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకంతా రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి స్నానం చేయాలి. విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ ప్యాక్‌ శిరోజాలను రాలకుండా సంరక్షిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్