మీ చర్మాన్ని కాపాడుకుంటున్నారా?

ఈ కాలంలో బయటకు వెళ్లాలంటే చాలా ఆలోచిస్తాం. సన్‌స్క్రీన్‌ రాస్తాం. స్కార్ఫ్‌లు కట్టుకుంటాం... ఎండ నుంచి తప్పించుకొనే  అన్ని ప్రయత్నాలూ చేస్తాం. చర్మాన్ని రక్షించుకునేందుకు ఈ జాగ్రత్తలు మాత్రమే   సరిపోతాయా? కాదంటున్నారు నిపుణులు. మరేం చేయాలంటే..

Published : 04 May 2022 01:16 IST

ఈ కాలంలో బయటకు వెళ్లాలంటే చాలా ఆలోచిస్తాం. సన్‌స్క్రీన్‌ రాస్తాం. స్కార్ఫ్‌లు కట్టుకుంటాం... ఎండ నుంచి తప్పించుకొనే  అన్ని ప్రయత్నాలూ చేస్తాం. చర్మాన్ని రక్షించుకునేందుకు ఈ జాగ్రత్తలు మాత్రమే   సరిపోతాయా? కాదంటున్నారు నిపుణులు. మరేం చేయాలంటే..

అలర్జీలను అశ్రద్ధ చేయొద్దు.. వేసవికాలంలో చర్మానికి పొంచి ఉండే ప్రమాదాలు ఎక్కువే. ఈ కాలంలో అలర్జీలు రావడానికి ఆస్కారం ఎక్కువ. ముఖ్యంగా పూల పుప్పొడి కారణంగా వచ్చే అలర్జీలు కంటికింద సున్నితంగా ఉండే చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. దాంతో అక్కడ ఉబ్బడం, వాచిపోవడం, కళ్లనుంచి నీరు కారడం, దద్దుర్లు రావడం వంటివి జరుగుతాయి. లేచిన వెంటనే తుమ్ములు కూడా వస్తోంటే చర్మ వ్యాధి నిపుణులని కలవాల్సిందే. లేదంటే ఈ సమస్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. 

క్రీం తప్పదు.. చర్మాన్ని కాపాడుకోవడానికి ఏడాదంతా సన్‌స్క్రీన్‌ అవసరం. వేసవిలో మరికాస్త ఎక్కువ అవసరం. ఎందుకంటే ఈ కాలంలో చర్మానికి చేటు చేసే అతినీలలోహిత కిరణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు బయటకు వెళ్లాలనుకున్న ప్రతిసారీ ఎస్‌పీఎఫ్‌ క్రీములని రాసుకోవడం మర్చిపోవద్దు. మాటిమాటికీనా అనుకోవద్దు. ఇది చర్మాన్ని క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది.

పాతవి వద్దు.. ముఖానికి, శరీరానికి రాసే ఏ క్రీం అయినా సరే... అది సన్‌స్క్రీన్‌ క్రీం అయినా సరే... ఎక్స్‌పైరీ డేట్‌ దాటిపోతే తక్షణమే వాటిని పక్కన పెట్టేయండి. ముఖ్యంగా కళ్లకింద, పెదాలకు రాసే క్రీంలతో రాజీపడొద్దు. అవి చర్మానికి చాలా హానిచేస్తాయి. పాత మేకప్‌ బ్రష్‌లు కూడా ప్రమాదమే సుమీ!

తేలిక.. తక్కిన రోజులతో పోలిస్తే... వేసవిలో మృతకణాలు పోగొట్టుకునేందుకు వారానికి రెండుసార్లు స్క్రబింగ్‌ చేయాలి. ఎందుకంటే... ముఖంపైన మృతకణాలు, చెమట, అందులోని బ్యాక్టీరియా, మనం రాసే క్రీంలు.. ఇవన్నీ కలిసి చర్మరంధ్రాలని మూసేస్తాయి. ఫలితంగా చర్మవ్యాధులు మొదలవుతాయి. ఇక మీరు ఎంచుకొనే స్క్రబ్‌ గరుకుగా ఉండేది కాకుండా.... ఫ్రూట్‌ యాసిడ్స్‌, ఎంజైమ్స్‌ ఉండేదయితే మేలు. మాయిశ్చరైజర్లు కూడా ఆయిల్‌ బేస్డ్‌వి కాకుండా నీటి ఆధారితమైనవి ఎంచుకోవాలి. వాటిని వాడితే ముఖం జిడ్డుగా ఉండదు. ఫౌండేషన్స్‌, కన్సీలర్లు కూడా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. యాక్నె వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఉదయం.. రాత్రి.. విటమిన్‌ సి సుగుణాలుండే క్రీంలతోపాటు, యాంటీఆక్సిడెంట్లు ఉండే సీరమ్‌లు దొరుకుతాయి. వీటిని పొద్దునే రాసుకుంటే యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. లేదంటే కొల్లాజెన్‌ తగ్గి చర్మం సాగిపోతుంది. రాత్రి నిద్రపోయే ముందు విటమిన్‌ ఎ ఉండే రెటినాల్‌ క్రీం కూడా మంచి ఫలితాలనిస్తుంది. 

పుట్టుమచ్చలా జాగ్రత్త!.. కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా చర్మంపై అసాధారణంగా పుట్టుమచ్చలు వస్తుంటాయి. పైగా రోజురోజుకీ పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కుటుంబంలో ఎవరికైనా చర్మక్యాన్సర్లు ఉన్నాయేమో ఓసారి చూసుకోవాలి. అనుమానం ఉంటే నిపుణులని సంప్రదిస్తే.. మోల్‌మ్యాపింగ్‌ చేస్తారు. పుట్టుమచ్చల ఆధారంగా రాబోయే చర్మక్యాన్సర్ల గురించి ఇందులో తెలుస్తుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్