వడదెబ్బకు దూరంగా చిన్నారులు

వేసవి వేడి పెరుగుతోంది. దీనివల్ల పిల్లలు త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే వడదెబ్బ, చర్మ సమస్యలు మరెన్నో అనారోగ్యాలకు గురయ్యే అవకాశం

Updated : 03 Apr 2022 06:07 IST

వేసవి వేడి పెరుగుతోంది. దీనివల్ల పిల్లలు త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే వడదెబ్బ, చర్మ సమస్యలు మరెన్నో అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే మనమేం చేయాలో సూచిస్తున్నారు నిపుణులు.

తాజా పండ్లతో... పిల్లల చర్మం పొడారి, దురద, మంట వంటి పలురకాల ఎలర్జీలు మొదలైతే వారు డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించాలి. మూత్రవిసర్జనకు అతి తక్కువగా వెళ్లడం, కడుపునొప్పి, తలనొప్పి, వికారంతో బాధపడటం వంటివి కనిపించినా వెంటనే స్పందించాలి. ముందుగానే ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో వచ్చే మామిడి, ద్రాక్ష, అనాస, పుచ్చ, కమలా పండ్లలో ఏదో ఒక దాని రసాన్ని తాజాగా చేసి అందించాలి. వీటిలో తులసి, పుదీనా ఆకుల్ని కలిపి ఇస్తే మరింత రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికీ మంచిది. పండ్ల రసాల్లో పీచు జీర్ణశక్తిని మెరుగు పరిచి, వ్యర్థాలను బయటికి పంపుతుంది. గ్లాసు నీటిలో అరచెక్క నిమ్మరసం, చెంచా తేనె కలిపి ఇస్తే ఎండవల్ల కలిగే నిస్సత్తువ దూరమై, శక్తి వస్తుంది. ఇందులోని సి విటమిన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే  రోజూ ఉదయం గ్లాసు కొబ్బరినీళ్లు ఇవ్వాలి. ఇందులోని పొటాషియం వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. పిల్లలతో రోజుకి కనీసం రెండు లీటర్ల నీటిని తాగించడం అన్నింటికన్నా ముఖ్యం. రాత్రి సబ్జాగింజలను నానబెట్టిన నీటిని మరుసటి రోజు తాగిస్తే మరీ మంచిది.

వంటింటి నుంచి... చిన్నారులకు బార్లీ గింజలు వేసవిలో ఔషధంలా పనిచేస్తాయి. లేత గోధుమవర్ణంలో దోరగా వేయించిన బార్లీ గింజలను పొడి చేసి ఓ సీసాలో భద్రపరచాలి. గ్లాసు నీళ్లను పొయ్యిపై ఉంచి వేడెక్కిన తర్వాత రెండు చెంచాల బార్లీ పొడిని వేసి అయిదు నిమిషాలు బాగా మరిగించి దించి చల్లార్చాలి. ఇందులో చిటికెడు ఉప్పు, పలుచగా చేసిన మజ్జిగ కలిపి పిల్లలతో తాగించాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం బార్లీ తాగితే ఎండ వేడిని తట్టుకునే శక్తి వస్తుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత పలుచని మజ్జిగలో చిటికెడు జీలకర్రపొడి, ఉప్పు, పావుచెక్క నిమ్మరసం కలిపి తాగిస్తే జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. ఈ పానీయంతో కాల్షియం, విటమిన్‌ బి12, పొటాషియం అందుతాయి. ఇవి తలనొప్పి, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్నిస్తాయి. క్యారెట్‌, కీరదోస ముక్కలపై కాస్త నిమ్మ రసం, చిటికెడు ఉప్పు చల్లి తినిపించడం మంచిది.

దూరంగా... కారం, మసాలా, వేపుళ్లు, స్వీట్లు వంటి వాటికి దూరంగా ఉంచాలి. ఫ్రిజ్‌లో నీటిని తాగనివ్వకూడదు. పిజ్జా, బర్గర్‌,  అలాగే నిల్వ ఆహారాన్ని ఇవ్వకూడదు. ఇవన్నీ దాహాన్ని మరింత పెంచుతాయి. మెత్తని నూలు దుస్తులను ధరించేలా చూడాలి. ఉదయం, సాయంత్రం మాత్రమే ఆటలకు అనుమతినివ్వాలి. మధ్యాహ్న సమయాల్లో బయటికి వెళ్లకుండా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్