అష్టాంగ యోగా ప్రయత్నిద్దామా...

మామూలుగానే మనం కాస్త నాజూగ్గా ఉంటాం. దానికి తోడు రోజంతా పనులూ కుటుంబ బాధ్యతల మూలంగా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. దీనికి స్వస్తి పలకాలంటే అష్టాంగ యోగ సాధనే ఉత్తమం. వివరంగా చెప్పాలంటే.. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి - వీటి సమాహారమే అష్టాంగ యోగం....

Updated : 13 May 2022 06:28 IST

మామూలుగానే మనం కాస్త నాజూగ్గా ఉంటాం. దానికి తోడు రోజంతా పనులూ కుటుంబ బాధ్యతల మూలంగా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. దీనికి స్వస్తి పలకాలంటే అష్టాంగ యోగ సాధనే ఉత్తమం. వివరంగా చెప్పాలంటే.. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి - వీటి సమాహారమే అష్టాంగ యోగం.

దేనికదే విశిష్టం...

యమ : అహింస, సత్యం, అస్తేయ (దొంగతనం చేయకపోవడం), బ్రహ్మచర్యం, అపరిగ్రహ (దేని మీదా అతి మమకారం లేకపోవడం)... ఈ ఐదు గుణాలనూ అలవరచుకుంటే మెదడు స్వచ్ఛంగా ఉంటుంది. కల్మషాలు చేరనపుడు మనసు స్థిరంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

నియమ: యమతో మనసు నిర్మలమై సమాజంతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇక  శరీరాన్ని శుద్ధి చేయడానికి తప్పని సరిగా ఆచరించాల్సిన ఆచారాలూ లేదా అలవాట్లు నియమ కిందికొస్తాయి.

ఆసన: పతంజలి యోగ సూత్రాల్లో అతి ముఖ్యమైనవి ఆసనాలు. ఈ ఆధునిక యుగంలో వీటి అవసరం మరింత ఉంది. ఆరోగ్యంగా, దృఢంగా ఉంటే అందం దానంతట అదే వస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యాలకు ఆసనాలెంతో ఉపయుక్తం.

ప్రాణాయామం: శ్వాస దీర్ఘంగా తీసుకుని వదులుతూ మనసును లగ్నం చేయడమే ప్రాణాయామం. దీనివల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. శ్వాసకోశ అనారోగ్యాలు దరి చేరవు. మనసులో అలజడులు ఉండవు. కేంద్రీకరణ శక్తి పెరుగుతుంది. ప్రాణాయామం ఎంత శ్రద్ధగా చేస్తే మెదడు అంత ప్రశాంతంగా ఉంటుంది.

ప్రత్యాహార: ప్రత్యాహారం అంటే వస్తువుల నుంచి ఇంద్రియాలను దూరం చేయడం లేదా నియంత్రించడం. ఇంద్రియాలు బాహ్య ప్రపంచానికి కిటికీలు. వస్తువుల నుంచి పొందే అనుభూతులతో మనసుకు ఆహారాన్ని ఇస్తాయి. ఇంద్రియ ప్రేరణలను మనసు వాటిని స్వీకరిస్తుంది. ఆ ప్రేరణలూ, ప్రతిస్పందనలతో అయోమయ స్థితిలో పడుతుంది. కనుక ప్రత్యాహారలో ఇంద్రియాలను ఎలా జయించాలో నేర్చుకోగలుగుతారు. ధ్యానాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యాహార కీలకం.

ధారణ : ఇంద్రియ నిగ్రహం సాధ్యమయ్యాక మెదడుకు ఏకాగ్రత, కేంద్రీకరణశక్తి, ధారణ పెరుగుతాయి. అప్పుడిక మనసు పరిపరి విధాల కొట్టుకుపోదు. ఏకాగ్రత అనేది మెదడు శక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. ఉన్నతాశయాల దిశగా సాగడంలో ధారణ సాయపడుతుంది.

ధ్యానం : ధ్యానం అంటే ఆలోచనల మీద అదుపు. అనేక అంశాల మీదికి దృష్టి మళ్లకుండా ఒక దానిమీద కేంద్రీకరించడం నేర్చుకోగలిగితే అతుకులు లేని ఆలోచనల ప్రవాహం సాధ్యమవుతుంది.

సమాధి : ఇక్కడ వస్తువూ ఆలోచనా ఒకటే. ఏకాగ్రత తర్వాతిదైన ఈ స్థితిలో శరీర మెలకువ స్థితి అంతర్థానమై మెదడు వస్తువుగా మారుతుంది. అది క్రమంగా ఉజ్జ్వల వెలుగుగా పరిణమిస్తుంది.


ఎన్ని లాభాలో!

శారీరక బలం, మానసిక స్థైర్యం చేకూరుతుంది. కాళ్లూ చేతులూ మెడ, భుజాలూ- ఇలా ప్రతి భాగమూ మృదుత్వాన్ని సంతరించుకుని తేలిగ్గా వంగుతాయి. కండరాలు దృఢంగా ఉంటాయి. హృదయ నాళాలు సవ్యంగా పని చేస్తాయి. ఒంట్లో కొవ్వు కరుగుతుంది. జీవన వైఖరే మారిపోతుంది. సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది.

అష్టాంగ యోగాతో జీవక్రియ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. ఏకాగ్రత కుదురుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కేలరీలు కరిగి బరువు తగ్గుతారు. భవిష్యత్తులోనూ ఊబకాయం రాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్