ఆభరణం అందం ఆరోగ్యం!

ఫ్యాషన్‌... ఆరోగ్యం ఒక చోట కలిసి ఉంటామంటే అంతకంటే మనకి కావాల్సిందేముంది? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నగలు అలాంటివే. మన అందానికి మెరుగులద్దడంతోపాటు ఆరోగ్య సంరక్షలోనూ మేలు చేస్తాయి. అవేంటో మీరూ చూడండి...

Published : 09 Jun 2022 18:35 IST

ఫ్యాషన్‌... ఆరోగ్యం ఒక చోట కలిసి ఉంటామంటే అంతకంటే మనకి కావాల్సిందేముంది? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నగలు అలాంటివే. మన అందానికి మెరుగులద్దడంతోపాటు ఆరోగ్య సంరక్షలోనూ మేలు చేస్తాయి. అవేంటో మీరూ చూడండి...

వ్యాయామాలతో: మోకాళ్ల పైవరకూ ధరించే ఈ ఫిట్‌నెస్‌ షార్ట్‌... మహిళలకు అవసరమైన వ్యాయామాన్ని అందిస్తుంది. గర్భిణులు, బాలింతలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో కటి కండరాలు బలహీనపడి మూత్రవిసర్జనపై నియంత్రణ ఉండదు. అలాంటప్పుడు వైద్యులు కెగెల్స్‌ వ్యాయామాలు చేయమని సూచిస్తుంటారు. చాలామంది వీటిని ఉత్సాహంగా మొదలుపెట్టినా కొన్నిరోజులకే విరమించుకుంటారు. ఈ ప్యాంటీని ధరించి... దానికి సెల్‌ఫోన్‌ మాదిరిగా ఉండే చిన్న పరికరాన్ని అనుసంధానించి విశ్రాంతిగా కూర్చుంటే చాలు. రోజువారీ చేయాల్సిన కెగెల్స్‌ వ్యాయామాలని మనతో చేయించి ఆరువారాల్లో మూత్ర సమస్యలకు చెక్‌ పెట్టడంతోపాటు కటి కండరాలని బలోపేతం చేస్తుంది.


అందమైన బటన్‌గా: బయటకెళ్లేటప్పుడు కాస్త సన్‌స్క్రీన్‌ లోషన్‌ని రాసుకుని ‘ఇక నా చర్మం సురక్షితం’ అనుకుంటున్నారా? ఎంత మాత్రమూ కాదు. చర్మ ఆరోగ్యం పాడవడానికి కాలుష్యంతోపాటు, ఎండలోని యూవీ కిరణాలు, స్కిన్‌ అలర్జీలు కలిగించే పుప్పొడి రేణువులు, అధిక వేడి కూడా కారణాలే. చర్మం ఏ మేరకు కాలుష్య ప్రభావానికి గురవుతుందో చెప్పి హెచ్చరించే పరికరమే మైస్కిన్‌ట్రాక్‌ యూవీ. చిన్న పెండెంట్‌ మాదిరిగా ఉండి గొలుసులో ఇమిడిపోతుంది. లేదంటే డ్రస్‌కి అందమైన ఫ్యాషన్‌ బటన్‌లానూ అమరిపోతుంది. ఇది యాప్‌ సాయంతో పనిచేస్తుంది. వాతావరణంలోని కాలుష్యాన్ని, వేడిని, అతినీలలోహిత కిరణాలని గుర్తించి కచ్చితమైన సమాచారాన్ని తెలియచేసి మీ చర్మాన్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది.


హారంగా అమరి: మీ అందాన్ని రెట్టింపు చేసేలా ఉన్న ఈ హారం పేరు.. బెల్లాబీట్‌లీఫ్‌ అర్బన్‌. చూడ్డానికి నగలా ఉన్నా, వాస్తవానికి ఇది చేసే పని మీ ఫిట్‌నెస్‌ని కాపాడటం. హారంగా, బ్రేస్‌లెట్‌గా, బ్రూచ్‌గా వివిధ రూపాల్లో అమరిపోయే ఈ పరికరం 24 గంటలూ పనిచేస్తుంది. రోజంతా మీరు ఖర్చు చేసిన కెలొరీలను లెక్కకడుతుంది. నెలసరి సమయాన్ని నమోదు చేస్తుంది. నిద్రలేమిని గుర్తిస్తుంది. ఒత్తిడి గురించి ఆరా తీస్తుంది. మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు యాప్‌ సాయంతో విశ్లేషించి.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. నెలసరి తేదీ గురించి ముందుగానే హెచ్చరిస్తుంది.  అందంతోపాటు ఆరోగ్యాన్నీ అందిస్తుంది.


స్కార్ఫ్‌కాదిది: గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొనే వారికి వెన్ను, మెడ నొప్పి బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేవే ఈ స్కార్ఫ్‌, కోట్‌ తరహా హీటింగ్‌ ప్యాడ్‌లు. వీటిని దుస్తుల మాదిరిగానే ధరించొచ్చు. బ్యాటరీతో పనిచేసే ఈ హీటింగ్‌ ప్యాడ్‌ ఆయా ప్రాంతాల్లో రక్తప్రసరణ కానిచ్చి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


బ్రేస్‌లెట్టే కానీ: ఫిబే బ్రేస్‌లెట్‌ చూడ్డానికి మామూలు పూసల అమరికలానే ఉన్నా... ఇది మీ నెలసరి గురించి ఎన్నో విషయాలు చెబుతుంది. ఇందులో మొత్తం 28 పూసలుంటాయి. ఎర్రగా ఉన్న ఐదుపూసలూ నెలసరి రోజులని తెలియచేస్తాయి. గులాబీరంగులోవి ఫలదీకరణ సమయాన్ని తెలిపేవి. గర్భం ధరించాలనుకునే మహిళలకు నెలసరి తర్వాత వచ్చే ఆ రోజులు కీలకం. తెల్లగా ఉండే పూసలు.. హార్మోన్‌ మార్పులతో ఇబ్బందిపడకుండా హాయిగా ఉండే రోజులని తెలియచెప్పేవి. ఇక నల్లనివి నెలసరికి ముందు రోజులని సూచిస్తాయి. కోపం, చికాకుతో సతమతమయ్యే రోజులన్నమాట. బ్రేస్‌లెట్‌లోని పూసల రంగులని అనుసరిస్తే మనలోని భావోద్వేగాలకి కారణాలేంటో ఇట్టే తెలిసిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్