పాపాయి రాకకి.. సిద్ధం చేశారా?

ఇంట్లోకి చిన్నారి రాబోతోందన్న వార్త ఎప్పుడూ ఆనందం నింపేదే! మొదటిసారే కాకపోయినా అది ప్రత్యేకమే! మరి ఆ వార్త మీకు మాత్రం ఆనందమిస్తే సరిపోదుకదా! మొదటి చిన్నారికీ

Published : 16 Sep 2022 00:27 IST

ఇంట్లోకి చిన్నారి రాబోతోందన్న వార్త ఎప్పుడూ ఆనందం నింపేదే! మొదటిసారే కాకపోయినా అది ప్రత్యేకమే! మరి ఆ వార్త మీకు మాత్రం ఆనందమిస్తే సరిపోదుకదా! మొదటి చిన్నారికీ సంతోషమివ్వాలి. అలా అవ్వాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

* పంచుకోండి.. వాళ్లకేం అర్థమవుతుంది, ఆ వాళ్లకెందుకు అనుకోవద్దు. అయిదేళ్లు పైబడిన వాళ్లయితే ‘నీకో చెల్లో, తమ్ముడో పుడతాడు’ అని చెబితే అర్థం చేసుకోగలుగుతారు. దీనికి సంబంధించి ఆ చిన్న మెదళ్లలో బోలెడు ప్రశ్నలూ రావొచ్చు. ఓపిగ్గా సమాధానం చెప్పాలి. అయిదేళ్ల లోపు వాళ్లకైతే పొట్టను చూపించి చెప్పడం, తాకించడం లాంటి వాటి ద్వారా తోబుట్టువు రాబోతున్నారని అర్థమయ్యేలా చేయొచ్చు.

* ఫొటోలు.. ఫోనుతో కెమెరా కూడా అరచేతిలో కొచ్చింది. పుట్టినప్పటి నుంచీ వాళ్లవీ ఫొటోలు తీసుంటారుగా! వాటిని చూపిస్తే ‘ఇదిగో చిన్నప్పుడు నువ్వు. నీలాగే ఇంకో బేబీ మన ఇంటికొస్తోంది’ అని చెప్పొచ్చు.

* అడగండి.. పాపైతే ఏం పేరు పెడదాం, బాబు అయితే ఏం పెడదామంటూ అడగండి. బొమ్మలు, దుస్తులు ఏం కొందాం, పాపాయి కోసం గదినెలా మారుద్దామంటూ సలహా కోరవచ్చు. ఆనందంగా పంచుకుంటారు. కొత్త ఆలోచనల కోసం ప్రయత్నించడమే కాదు.. తెలియకుండానే ప్రేమనీ ఏర్పరచుకుంటారు.

* కోపమొద్దు.. ప్రెగ్నెన్సీలో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. దీనికితోడు నీరసం, భావోద్వేగాల్లో మార్పులూ సాధారణమే. దీంతో చిన్నారిని నిర్లక్ష్యం చేసే అవకాశాలెక్కువ. కాబట్టి జాగ్రత్త. ఇంకా ఒళ్లో పడుకోబెట్టుకోవడం, కోరగానే ఎత్తుకోవడం వంటివీ సాధ్యపడవు. వీటిని జాగ్రత్తగా వివరించి చెప్పాలి. మాటలు వచ్చినంత మాత్రాన వాళ్లకి అన్నీ తెలుసని కాదు. వాళ్లే చూసి అర్థం చేసుకోవాలనీ అనుకోవద్దు. నెమ్మదిగా వివరించి చెప్పండి. వాళ్లని అకస్మాత్తుగా పెద్దవాళ్ల పక్కన పడుకోబెట్టడం లాంటివీ చేయొద్దు. దాన్నీ మెల్లగా అలవాటు చేయాలి.

అలవాటు చేయొచ్చు.. మరీ చిన్న పిల్లలైతే ఒక పాపాయి తరహా బొమ్మని కొనివ్వండి. చెల్లో, తమ్ముడో అని చెబుతూ ఎత్తుకోవడం, ఆడించడం, తిప్పడం, జోలపాడటం లాంటివి చేయిస్తే నెమ్మదిగా అలవాటు పడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని