సెలవులు.. తీపిగుర్తులు
వేసవి సెలవులు అయిపోతున్నాయి కదూ! ఇక స్కూళ్లూ, కాలేజీలూ తెరిచారంటే పిల్లలకు చదువుసంధ్యలతో ఊపిరాడదు. ఈ కొన్ని రోజులూ ఆటపాటలతో హాయిగా గడిపారంటే వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లవుతుంది. ఈ ఆనందాలు వేసవి తీపిగుర్తులుగా నిలుస్తాయి.
వేసవి సెలవులు అయిపోతున్నాయి కదూ! ఇక స్కూళ్లూ, కాలేజీలూ తెరిచారంటే పిల్లలకు చదువుసంధ్యలతో ఊపిరాడదు. ఈ కొన్ని రోజులూ ఆటపాటలతో హాయిగా గడిపారంటే వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లవుతుంది. ఈ ఆనందాలు వేసవి తీపిగుర్తులుగా నిలుస్తాయి. మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుని పరవశిస్తారు. అలాగే చిన్నచిన్న వ్యాపకాలనూ కల్పించవచ్చు.
* కాసేపు న్యూస్‌రీడర్‌ను తలపించేలా వార్తలు చదవడం, ఒక దృశ్యాన్ని తీసుకుని నటించడం, కొంతదూరం ఒంటికాలితో కుంటడం, కోరిన పాట పాడటం, అడిగిన పాటకు నృత్యం చేయడం, రెండు జోక్స్ లేదా రెండు ప్రపంచ విడ్డూరాల గురించి చెప్పడం.. ఇలా ‘పెర్ఫార్మెన్స్ షో’ నిర్వహించండి. కుటుంబసభ్యులే కాకుండా పక్కింటి పిల్లలనూ చేర్చుకుంటే మరింత సరదాగా, సందడిగా ఉంటుంది.
* ప్రతి నిత్యం నేరాలూ ఘోరాలూ పెరిగిపోతున్నాయి. వాటిల్లో ఒక వార్త గురించి చెప్పి.. అలాంటి సందర్భంలో చిక్కుకుంటే ఎలా తప్పించుకోవచ్చు- అని చర్చ సాగించండి. చిట్టి మెదళ్లు చురుగ్గానే ఆలోచిస్తాయి. అందరూ తలా ఒక ఆలోచనా చెబుతారు. ఇలాంటివి కష్టసమయాల్లో బెంబేలు పడకుండా ధైర్యంగా ఆలోచించేలా చేస్తాయి. క్లిష్ట పరిస్థితి ఎదురైతే ఎలా గట్టెక్కాల్లో తర్ఫీదులా ఉపయోగపడతాయి.
* ఇప్పుడు ఔట్‌డోర్ గేమ్స్ బాగా తగ్గిపోయాయి. అతి కొద్దిమంది షటిల్, త్రోబాల్ లాంటివి ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతా మర్చిపోతున్న ఖోఖో, రాజు-రాణి-మంత్రి-దొంగ, పరుగుపందెం, దాగుడుమూతలు లాంటి మన సంప్రదాయ ఆటలను గుర్తు చేయండి. అవి శారీరక ఆరోగ్యానికీ, మానసిక ఉల్లాసానికీ మంచిదని అర్థమయ్యేలా చెప్పండి.
* స్కిప్పింగ్ ఎంత మంచి వ్యాయామమో చెప్పి, రోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం పావుగంటసేపు ప్రాక్టీస్ చేయమనండి. తోటి పిల్లలతో పోటీ పెట్టుకుని వేగంగా చేస్తారు. అదొక అలవాటుగా మారితే చాలా మంచిది.
* మీ కారు లేదా స్కూటరును కడిగి తళతళలాడేలా చేయమనండి. కుటుంబసభ్యుల్లో ఎవరు బాగా శుభ్రం చేస్తారోనని పోటీ పెట్టుకుంటే ఆ పని బరువుగా కాకుండా బాధ్యతగా, ఇష్టంగా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.