Updated : 12/08/2021 04:28 IST

చెవిలో భయంకర శబ్దాలు వినిపించేవి..

ఇంటర్‌ చదువుతున్న సౌమ్యకు క్లాసులో పాఠం వినిపించలేదు. అనుకోకుండా వచ్చిన ఆ సమస్య జీవితాంతం ఉంటుందని వైద్యులు చెప్పినప్పుడు ఆమె కుంగిపోలేదు. న్యాయవాద కోర్సులో ఉన్నప్పుడే యూపీఎస్సీకి సిద్ధమైంది. పరీక్షల్లో తీవ్ర జ్వరం... ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని చేరుకున్న కలెక్టరు సౌమ్యాశర్మ స్ఫూర్తి కథనమిది...

సౌమ్య అమ్మానాన్నలు లీనాశర్మ, అశోక్‌శర్మ వైద్యులు. సోదరుడు అభిషేక్‌కు అమ్మానాన్నలా డాక్టరునవ్వాలని ఉంటే, సౌమ్య మాత్రం న్యాయవాదిగా స్థిరపడాలనుకుంది. వాళ్లది దిల్లీ. ఇంటర్‌ చదివేటప్పుడు తరగతిలో అందరికన్నా అత్యధిక మార్కులు తెచ్చుకునేది. అలాంటి సౌమ్యకు అనుకోకుండా వచ్చిందీ సమస్య.

భయంకర శబ్దాలొచ్చేవి..

‘ఇంటర్‌ రెండో ఏడాదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన శబ్దాలతో నా చెవుల్లో ఏదో జరిగిపోతున్నట్లుగా అనిపించేది. ఎందుకలా జరుగుతుందో అర్థమయ్యేది కాదు. రెండు రోజులకి నా మాటలు నాకే వినిపించడం మానేసింది. చాలా భయపడ్డా. అమ్మానాన్నలు మరింత ఆందోళనకు గురయ్యారు. నిపుణులకు చూపించి, ఎన్నో పరీక్షలు చేయించేవారు. ఇంటర్‌ రెండో ఏడాది కాలేజీకి వచ్చిందాని కన్నా ఆసుపత్రులకు తిరగడమే ఎక్కువ. ఓవైపు ఈ సమస్య, మరో వైపు బాగా చదువు కోలేకపోతున్నాననే వేదన నన్ను కుంగదీసేవి. అయితే నా స్నేహితులు నోట్స్‌ ఇస్తూ సాయం చేసేవారు. చివరకు వైద్యపరీక్షల్లో నాకు చెవులు శాశ్వతంగా వినిపించవని చెప్పారు. ఎందుకంటే.. చెవుల్లోని సున్నిత కణాలు అకస్మాత్తుగా దెబ్బ తిన్నాయట. దీనివల్ల శబ్దతరంగాలను నాడీ స్పందన తరంగాలుగా మార్చే లోపలి చెవిభాగం (కాక్లియా) శాశ్వతంగా పనిచేయదని తేల్చారు. దీన్నే నెర్వ్‌ డెఫ్‌నెస్‌ అని పిలుస్తారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించింది ఓ హియిరింగ్‌ ఇంప్లాంట్‌ కంపెనీ. అది చేసిచ్చిన హియిరింగ్‌ ఎయిడ్స్‌ ద్వారా నాకు వినిపించడం మొదలైంది. వీటిని ప్రతీ క్షణం చెవిలో ఉంచుకోవాలి. ఏదైతేనేం సమస్య తీరడం నాలో ఉత్సాహాన్ని నింపింది. తిరిగి చదువు కొనసాగించి ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్నా’ అని వివరించింది సౌమ్య.

తీవ్ర జ్వరంతో...

దిల్లీ నేషనల్‌ లా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన సౌమ్య, తర్వాత  జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో 2018లో ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో చేరింది. రెండో ఏడాది చివర్లో యూపీఎస్‌సీకు ప్రవేశపరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకుంది. అప్పటికి కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉందామెకు. న్యాయ వాద కోర్సులో పలు సామాజిక అంశాలు తనను ఈ దిశగా అడుగులేసేలా చేశాయి అంటుంది సౌమ్య. ‘మానవహక్కులు, సామాజిక సమస్యలు వంటివి సివిల్‌ సర్వీసెస్‌పై ఆసక్తిని పెంచాయి. ఎంఏ రెండో ఏడాది చివర్లో ఉన్నా. దాంతోపాటు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలకూ పగలూ రాత్రీ చదివా. ఎక్కడా కోచింగ్‌ తీసుకోకుండా, సొంతగానే ప్రిపేరై పరీక్షలు రాశా. మెయిన్స్‌కు వెళ్లేటప్పుడూ మరో సమస్య. కాలు కింద పెట్టలేనంత జ్వర తీవ్రత. అమ్మా నాన్నా డాక్టర్లు కదా. వారి చేయూతతో పరీక్ష హాలుకు వెళ్లగలిగా. జీఎస్‌ పేపర్స్‌ రాసేటప్పుడు మధ్యాహ్న భోజన సమయంలో కారులో కూర్చోబెట్టి నాకు డ్రిప్స్‌ ఎక్కించేవారు. జ్వరంతో అంతగా బలహీనపడ్డా. జీఎస్‌2 పేపరు పూర్తి చేస్తున్నప్పుడైతే కళ్లు తిరిగి  పడిపోయా. ఎలాగో పరీక్షలు రాయగలిగా. ఇన్ని ఇబ్బందుల్లో రాసినా మొదటిసారే మంచి ర్యాంకు వచ్చింది. ప్రజాసేవ చేయాలనే నా ఆశయం నెరవేరింది. సౌత్‌ వెస్ట్‌ దిల్లీ, డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా 2019లో శిక్షణలో చేరా. గత ఆగస్టులో శిక్షణ పూర్తై, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఎన్సీటీ ఆఫ్‌ దిల్లీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నా. ప్రజావసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నా’ అని చెబుతున్న సౌమ్య కథ నిజంగా స్ఫూర్తిదాయకమే కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి