ఆన్‌లైన్‌ లేదని.. ఆసరాగా నిలుస్తున్నారు

ఇప్పుడు స్కూలు, కళాశాల తేడా లేకుండా అందరివీ ‘తెర’గతులే. ఇంటర్నెట్‌, మొబైళ్లు తప్పనిసరి అయ్యాయి. మరి.. తిండే గగనమయ్యే మురికివాడల పిల్లలకు ఈ స్మార్ట్‌ చదువులు ఎలా సాధ్యం? ఇదే ఆలోచన వచ్చింది ముంబయికి చెందిన వనితా హర్జినా, ఆరియా గుప్తాలకి. పరిష్కారంగా ఒకరు టీచర్‌గా మారి బోధిస్తుంటే.. మరొకరు విరాళాలు సేకరించి ట్యాబ్లెట్లను అందించడంతోపాటు విద్య కొనసాగేలా తోడ్పడుతున్నారు.

Updated : 24 Aug 2021 05:04 IST

ఇప్పుడు స్కూలు, కళాశాల తేడా లేకుండా అందరివీ ‘తెర’గతులే. ఇంటర్నెట్‌, మొబైళ్లు తప్పనిసరి అయ్యాయి. మరి.. తిండే గగనమయ్యే మురికివాడల పిల్లలకు ఈ స్మార్ట్‌ చదువులు ఎలా సాధ్యం? ఇదే ఆలోచన వచ్చింది ముంబయికి చెందిన వనితా హర్జినా, ఆరియా గుప్తాలకి. పరిష్కారంగా ఒకరు టీచర్‌గా మారి బోధిస్తుంటే.. మరొకరు విరాళాలు సేకరించి ట్యాబ్లెట్లను అందించడంతోపాటు విద్య కొనసాగేలా తోడ్పడుతున్నారు.


ఒక్కరితో మొదలై..

ముంబయిలోని శాంటాక్రూజ్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర్లోని భాజీవాడీ మురికివాడలను అక్రమ కట్టడాలుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. దీంతో కరెంట్‌ సౌకర్యమే లేదు. ఇక ఆన్‌లైన్‌ చదువు అవకాశమేది? అక్కడి పిల్లల చదువు కొనసాగేలా చేస్తోంది.. వనితా హర్జినా

నిత గ్రాడ్యుయేషన్‌ చదువుతోంది. తండ్రిది అరకొర సంపాదనే అయినా చదువు దిశగా ప్రోత్సహించాడు. క్యాండిల్‌ వెలుగులోనే చదువుకునేది. పోయినేడాది ఆయన చనిపోయారు. గతంలో ఓ ఎన్‌జీవోలోని పిల్లలకు హిందీ, మరాఠీ బోధించేది వనిత. నెలవారీగా వాళ్లిచ్చే రూ.3000 జీతం చదువు కొనసాగించడానికి సాయపడింది. లాక్‌డౌన్‌ కారణంగా అదీ ఆగిపోయింది. ఒకరోజు ఒక బాబు ‘నాకు స్మార్ట్‌ఫోన్‌ లేదు. నేనెలా చదువుకోవాలి? నువ్వు చెబుతావా అక్కా?’ అని అడిగాడు. చదువుకోవాలన్న కోరిక ఉండీ, అవకాశం లేకపోవడం ఎంత బాధాకరమో తనకు తెలుసంటుంది వనిత. అందుకే ఆ అబ్బాయికి సాయం చేయాలనుకుంది. కరెంట్‌ సౌకర్యం లేదు, స్మార్ట్‌ఫోన్లు ఉన్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఉన్నా తల్లిదండ్రులు తాము చేసే పని ప్రదేశాల్లోనే ఛార్జింగ్‌ పెట్టుకోవాలి. దీంతో ఆ వాడలోని 20 కుటుంబాలకుపైగా పిల్లలంతా ఈమె దగ్గరికే రావడం మొదలుపెట్టారు. వనిత వాళ్లకి హిందీ, మరాఠీ చెబుతూ తన స్నేహితులను ఇతర సబ్జెక్టులకు బోధించమని అడిగింది. వాళ్లూ ముందుకొచ్చారు. ఈ పిల్లలు చదివే పాఠశాల టీచర్లకు విషయం తెలిసి ఈమెకు రోజువారీ పాఠ్యాంశాల వివరాలను పంపించడం మొదలుపెట్టారు. వాటి ఆధారంగా బోధన కొనసాగిస్తోంది. అందుకు ఆమె ఎంచుకున్న ప్రదేశం స్థానిక రైల్వేస్టేషన్‌. ఇది ఏటా వరద ముంపుకు గురయ్యే ప్రదేశం. దీంతో వర్షాలు పడినప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో కొనసాగిస్తుంది. మరి ఇళ్లలోకీ వరద నీరొస్తే ఎలా అనేది ఇప్పుడు ఆమె ముందున్న ప్రశ్న!


ట్యాబ్లెట్లు అందించింది

పాఠశాల స్థాయి నుంచే సామాజిక సేవ చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తోంది ఆరియా గుప్తా. నిధులు సేకరించి ట్యాబ్లెట్లు అందివ్వడమే కాకుండా పలు విధాలుగా విద్య కొనసాగించేలా ప్రోత్సహిస్తోంది కూడా.

ముంబయిలోని ఆదిత్య బిర్లా వరల్డ్‌ అకాడెమీలో ఇంటర్‌ రెండో ఏడాది చదువుతోంది ఆరియా గుప్తా. శ్రీశ్రీ రవిశంకర్‌ విద్యామందిర్‌ స్కూల్‌ సహకారంతో ‘ఫస్ట్‌ టెక్‌ ఛాలెంజ్‌’ పోటీ కోసం కమ్యూనిటీ అవుట్‌రీచ్‌ ప్రోగ్రాంలో భాగస్వామురాలైంది. ధారావి ప్రాంతంలో కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి, రోబో తయారీ, డిజైనింగ్‌లలో శిక్షణనిప్పించింది. 2018లో రోబోటిక్స్‌ గేమ్‌లో వాళ్లు పాల్గొనేలా చేసింది. దీనికోసం ఆన్‌లైన్‌ ఫండింగ్‌ ద్వారా రూ.5 లక్షలను సేకరించింది. ఉచితంగా బోధించడం, పాఠ్యాంశాల్లో సందేహాలను తీర్చడంలోనూ సాయపడేది. కొంతమంది వలంటీర్లూ తోడయ్యారు. కొవిడ్‌ నేపథ్యంలో చాలామంది ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కాలేకపోతున్నారని తెలుసుకుంది. వాళ్లతో మాట్లాడి, 15 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. ‘వాళ్లకి క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా డబ్బులు సేకరించి ట్యాబ్లెట్లు అందించాలనుకున్నా. ఇందుకు దాదాపు రూ.1,50 లక్షలు కావాలి. వీళ్ల పరిస్థితిని చెబుతూ ఆన్‌లైన్‌లో సాయం కోరా. రూ.97,998 నిధులు సమకూరాయి. వాటితో ట్యాబ్లెట్లు కొని,  అందించా. ఇప్పుడు వాళ్లు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. మరికొందరికీ ఈ సౌకర్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నా’ అని చెబుతున్న ఆరియా మరెన్నో సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటోంది. మైనా మహిళా ఫౌండేషన్‌ తరఫున కొవిడ్‌-19 డిసెన్సిటైజేషన్‌ ప్రాజెక్ట్‌లో వలంటీర్‌. జై వకీల్‌ ఫౌండేషన్‌ ద్వారా పేద చిన్నారులకు ఉచితంగా తరగతులు నిర్వహించడంలో సాయపడుతోంది. టాటా ముంబయి మారథాన్‌లో పాల్గొని, గ్రామీణ విద్యార్థులకు విద్యనందించడానికి కావాల్సిన నిధుల సేకరణకు కృషి చేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ వివరాలను సేకరిస్తోంది. ఇందుకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలు, మూత్రశాలల సౌకర్యం లేకపోవడం వంటివన్నీ కారణాలని చెబుతోంది. ఈ సర్వేను త్వరలో నిర్వహించనున్న మైక్రోసాఫ్ట్‌ ఇమేజిన్‌ పోటీకి సమర్పించనుందీమె. దేశంలో ప్రభుత్వ విద్యా విధానాన్ని మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుందని భావిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్